చంద్రుడిపై విజయవంతంగా దిగిన జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. ఆ దేశాల సరసన చోటు

చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దించిన ఐదవ దేశంగా జపాన్ శుక్రవారం చరిత్ర సృష్టించింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారత్‌లు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించాయి. 

Japan's 'Moon Sniper' makes historic 'pin-point' lunar landing ksp

చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా దించిన ఐదవ దేశంగా జపాన్ శుక్రవారం చరిత్ర సృష్టించింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారత్‌లు మాత్రమే ఇప్పటి వరకు ఈ ఘనత సాధించాయి. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ‌ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) ప్రోబ్.. దీనినే ‘‘మూన్ స్నిపర్’’ అని పిలుస్తారు. పిన్‌పాయింట్ టెక్నాలజీని ఉపయోగించి చంద్ర భూ మధ్య రేఖకు దక్షిణంగా వున్న బిలం వాలుపై ఇది ల్యాండ్ అయ్యింది. క్రాఫ్ట్ ల్యాండింగ్ సైట్ అనేది ఉపరితలం నుంచి 100 మీటర్లు (300 అడుగులు) లోపు వుండే ప్రాంతం. ఇది సాధారణ ల్యాండింగ్ జోన్ కంటే గట్టిగా వుంటుంది. 

ఇప్పటి వరకు మరే ఇతర దేశం ఈ ఘనతను సాధించలేదు. జపాన్‌కు ఈ పిన్ పాయింట్ సాంకేతికత వుందని రుజువు చేయడం ఆర్టెమిస్ వంటి రాబోయే అంతర్జాతీయ మిషన్‌లలో తమకు భారీ ప్రయోజనాన్ని తెస్తుందని JAXAలోని SLIM ప్రాజెక్ట్ మేనేజర్ షినిచిరో సకాయ్ అన్నారు.  పిన్ పాయింట్ టెక్నాలజీని రెండు గ్రహ శకలాలపై విజయవంతంగా ల్యాండ్ చేయడానికి జపాన్ గతంలో ఉపయోగించింది. JAXAకు చెందిన ఖచ్చితత్వంతో కూడిన సాంకేతికత.. భవిష్యత్తులో చంద్రుడి పర్వత ప్రాంతాల్లోని ధ్రువాల అన్వేషణలో శక్తివంతమైన సాధనంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిజన్, ఇంధన, నీటి జాడను ఇది కనుగొననుంది. 

చంద్రుడిపైకి స్పేస్ షిప్‌ను దించాలనుకున్న జపాన్ రెండు సార్లు విఫలమైంది. అయినప్పటికీ వెనుదిరగకుండా ప్రయత్నించి లక్ష్యాన్ని ముద్దాడింది. లాండింగ్‌లో స్లిమ్ రెండు చిన్న ప్రోబ్‌లను మోహరించింది. మైక్రోవేవ్ ఓవెన్, బేస్‌బాల్ పరిమాణంలో వుండే చక్రాల రోవర్.. ఇది అంతరిక్ష నౌక ఫోటోలను తీస్తుంది. టెక్ దిగ్గజం సోనీ గ్రూప్, టాయ్ మేకర్ టామీ, జపాన్‌లోని పలు విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఇందుకు అవసరమైన రోబోలను అభివృద్ధి చేశాయి.

రానున్న రోజుల్లో తన మిత్రదేశమైన అమెరికా భాగస్వామ్యంతో అంతరిక్షంలో పెద్దన్న పాత్ర పోషించాలని జపాన్ ఉవ్విళ్లూరుతోంది. ప్రైవేట్ సెక్టార్ స్పేస్ స్టార్టప్‌లు జపాన్‌లో ఎన్నో పనిచేస్తున్నాయి. నాసా తలపెట్టిన ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా చంద్రునిపైకి వ్యోమగామిని పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

గతేడాది ఆగస్టులో భారతదేశం చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై వ్యోమనౌకని దింపింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఇది అంతరిక్ష రంగంలో భారత్ సత్తాని, ఆధిపత్యాన్ని మరో మెట్టు పైకెక్కించింది. ఈ క్రమంలో జపాన్ కూడా భారత్‌తో 2025లో మానవ రహిత చంద్రుడి ధ్రువాల అన్వేషణలో చేతులు కలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios