తైవాన్ లో భారీ భూకంపం..
తైవాన్ లో భారీ భూకంపం (Taiwan Earthquake)సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున వచ్చిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదు అయ్యింది. దీని వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
Earthquake in Taiwan : చైనాలోని తైవాన్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.3 గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జెడ్) తెలిపింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టుగా ఇప్పటి వరకు సమాచారం లేదు.
ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పేర్కొంది. తైవాన్ లోని తైటుంగ్ కౌంటీకి సమీపంలో సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. ఎక్కువగా గ్రామీణ ప్రాంతంగా ఉన్న కౌంటీలో స్వల్ప ప్రకంపనలు మాత్రమే నమోదయ్యాయి. రాజధాని తైపీలో భూకంపం సంభవించలేదు. తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల కూడలికి సమీపంలో ఉండటం వల్ల తరచూ భూకంపాలకు గురవుతుంటుంది.
రెండు రోజుల కిందట కూడా పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఈ నెల 22వ తేదీ (శుక్రవారం) తెల్లవారుజామున ఇస్లామాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఒక్క సారిగా ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదు అయ్యింది. ఈ ప్రకంపనల ప్రభావంతో ఇస్లామాబాద్, రావల్పిండి, పరిసర ప్రాంతాలను వణికిపోయాయి.
ఇస్లామాబాద్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం 5.30 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు భూకంప కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రత 16 కిలోమీటర్లుగా నమోదైందని పేర్కొంది. భూ ప్రకంపనలకు భయపడిన స్థానికులు కల్మా-ఎ-తయ్యాబా జపం చేస్తూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
అయితే ఈ ప్రకంపనల వల్ల ఇస్లామాబాద్, రావల్పిండిలోని ఈ ప్రాంతంలోనూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదు. కాగా.. గత నెలలో కూడా గిల్గిత్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత నమోదైనప్పటికీ.. ఒక్క సారిగా ఆ ప్రాంతాన్ని ప్రకంపనలు కుదిపేశాయి. గిల్గిత్, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (ఎన్ఎస్ఎంసీ) పేర్కొంది.
భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.