ముస్లిం దేశాల్లో వివిధ నేరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. బహిరంగంగా ఉరి, శిరచ్చేధనం, అవయవాల తొలగింపు వంటివి అక్కడ అమలు చేస్తారు. తాజాగా బ్రూనై ఓ కఠినమైన, వివాదస్పద నిర్ణయాన్ని తీసుకుంది.

వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వారిని, స్వలింగ సంపర్కులను రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానించింది. షరియా చట్టాల ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధికారులు పేర్కొన్నారు.

దొంగతనానికి పాల్పడిన వారి చేతులు, పాదాలు నరికివేసే శిక్షను వచ్చే బుధవారం నుంచి అమలు చేస్తామని తెలిపారు. మొదటిసారి దొంగతనానికి పాల్పడితే కుడిచేతిని, రెండోసారి కూడా అదే తప్పు చేస్తే ఎడమపాదాన్ని నరికివేస్తారు.

మరోవైపు బ్రూనై నిర్ణయాన్ని మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విజ్ఞప్తి చేసింది.

ఈ విషయం గురించి హ్యూమన్ రైట్స్ వాచ్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీయ సమాజం నుంచి బ్రూనైను బహిష్కరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.

ఆగ్నేయాసియా దేశాల్లో ఈ తరహా శిక్షలు అమలు చేసే తొలి దేశంగా గుర్తింపు పొందడం ద్వారా బ్రూనై వివాదాస్పద దేశంగా ముద్రపడుతుందని, తద్వారా విదేశీ పెట్టుబడులు, పర్యాటకుల సంఖ్య తగ్గి భారీగా ఆదాయం నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశమైన బ్రూనైలో కేవలం ఆ వర్గానికి మాత్రమే ఈ కఠిన శిక్షలు విధించనుంది.