Asianet News TeluguAsianet News Telugu

Taliban: చుట్టూ తుపాకులే.. వణికిపోతూ భయపడవద్దని ప్రజలకు చెప్పిన యాంకర్.. వీడియో వైరల్

తుపాకిని గురిపెట్టి నువు భయపడవద్దు అని చెప్పినట్టుగా ఉన్నది ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల వ్యవహారం. ప్రజలు తాలిబాన్లు అంటే భయపడవద్దని, వారితో సహకరించాలని ఓ టీవీ యాంకర్‌తో స్టేట్‌మెంట్ ఇప్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీవీ యాంకర్ చుట్టూ తుపాకులు పట్టుకున్న సాయుధులే ఉన్నారు. స్వయంగా యాంకరే భయంతో వణికిపోతూ ప్రజలు భయపడవద్దని చేస్తున్న ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. తాలిబాన్ల తీరుకు నిదర్శనమన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

anchor made to announce dont scared with talibans by gunmen in a viral video evokes controversy
Author
New Delhi, First Published Aug 30, 2021, 12:48 PM IST

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాలిబాన్లు బలప్రయోగంతో దేశాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. తాలిబాన్ల గత పాలన, ప్రస్తుత విధ్వంసాన్ని కళ్లారా చూస్తున్న ప్రజల్లో వారిపై విశ్వసం ఏర్పడటం లేదు. తాలిబాన్లు అంటేనే వణికిపోయే పరిస్థితులున్నాయి. కానీ, అంతర్జాతీయంగా తమ పాలనకు గుర్తింపు ఉండాలనే పాకులాటలో తాలిబాన్ల చేష్టలు విచిత్రంగా తోస్తున్నాయి. వారి చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన ఉండటం లేదు.

ఒకవైపు ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుందని చెబుతూనే జర్నలిస్టులపై దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారి అజెండా అమలులో జర్నలిస్టులనూ వినియోగించుకుంటున్న వైనం ముందుకువచ్చింది. తాలిబాన్లను చూసి ప్రజలు భయపడవద్దని, తాలిబాన్ల కోఆపరేషన్‌ను వారు కోరుకుంటున్నారని ఓ యాంకర్ చదివి వినిపిస్తున్న స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనీసం ఎనిమిది మంది తాలిబాన్లు తుపాకులు పట్టుకుని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన పీస్ స్టూడియోకు వెళ్లారు. పొలిటికల్ డిబేట్ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని సూచించారు. అయితే, అందులో తాము ఇచ్చిన స్టేట్‌మెంట్ చదివి వినిపించాలని యాంకర్‌కు హుకూం జారీ చేశారు. 

 

ఎనిమిది మంది తాలిబాన్లు తుపాకులు పట్టుకుని డిబేట్ రూమ్‌ను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. యాంకర్ స్టేట్‌మెంట్ చదివారు. వీడియోలో ఇద్దరు తాలిబాన్లు ఆయన వెనకాలే తుపాకులు పట్టుకుని నిలుచున్నది కనిపిస్తున్నది. ఆ భయంతోనే యాంకర్ వణికిపోతూనే ప్రజలు తాలిబాన్లకు భయపడవద్దని చదివారు. తాలిబాన్లు ప్రజల సహకారాన్ని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి ఆయనే స్వతహాగా భయపడుతున్నారు. యాంకర్‌ను భయపెట్టిస్తూనే ప్రజలకు భయపడవద్దనే సందేశాన్ని ఇవ్వాలనుకున్న తాలిబాన్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు కుప్పలుతెప్పలుగా కురిశాయి.

ఓ ఇరానియన్ జర్నలిస్టు ఈ వీడియోను పోస్టు చేస్తూ ఆయన కామెంట్ వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నదో తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఇస్లామిక్ ఎమిరేట్‌లకు భయపడవద్దని ఇద్దరు గన్‌లు పట్టుకుని ఓ యాంకర్‌తో చెప్పిస్తున్నారని వివరించారు. లక్షలాది మంది ప్రజల మదిలో తాలిబాన్లు అంటే భయానికి ప్రతిరూపంగా ఉన్నారని తెలిపారు. అందుకు ఇది మరొక సాక్ష్యమని పేర్కొన్నారు. 

ప్రెస్ ఫ్రీడమ్ ఉంటుందని తాలిబాన్లు చెబుతూనే పలుచోట్ల జర్నలిస్టులపై దాడులకు తెగబడ్డారు. టోలో టీవీ రిపోర్టర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, జర్మనీ మీడియా సంస్థ డీడబ్ల్యూ‌కు పనిచేస్తున్న ఓ జర్నలిస్టును వెతుక్కుంటూ తాలిబాన్లు ఆయన బంధువును ఒకరిని చంపేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios