అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో మెలానియా ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను, తన భర్త ట్రంప్ ఈ పర్యటన పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నామంటూ ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

‘ భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానానికి ధన్యవాదాలు. అహ్మదాబాద్, ఢిల్లీలో పర్యటించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్, నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అమెరికా-భారత్ సత్సంబంధాన్ని వేడుకలా జరుపుకుందాం’ అని ఆమె ట్వీట్ చేశారు.

రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ కి అదిరిపోయే స్వాగతం పలుకుతాం అంటూ ఇటీవల మోదీ ప్రకటించారు. ‘ ఈనెలాఖరుకి అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి మెలానియా భారత్ పర్యటనకు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన అపూర్వ అతిథులకు భారత్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఆహ్వానాన్నిపలుకుతుంది. ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది’ అంటూ ఇటీవల మోదీ ట్వీట్ చేశారు.  కాగా ట్రంప్ కి ఇది తొలి భారత్ పర్యటన కావడం విశేషం.