Asianet News TeluguAsianet News Telugu

Independence Day 2022: స్వేచ్చా, స్వాతంత్య్రాల కోసం అలుపెరగకుండా పోరాడిన వీర వనితలు..

Independence Day 2022: భారత దేశానికి  స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, అలుపెరుగని పోరాటం వల్లే వచ్చింది. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఒక్కో ఘటనను చదువుతుంటే రోమాలు నిక్కబొరుస్తాయి. స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం అశువులుబాసిన వారెందరో ఉన్నారు. అయితే మన స్వాతంత్య్రం కోసం కేవలం పురుషులే కాదు.. మహిళలు కూడా అలుపెరగకుండా పోరాటం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధీర వనితల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Independence Day 2022:Incredible Women Who Helped In India's Freedom Struggle
Author
Hyderabad, First Published Aug 9, 2022, 1:06 PM IST

1. సావిత్రిబాయి ఫూలే

సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో మహిళలను శక్తివంతం తయారుచేయడానికి నిస్వార్థంగా కృషి చేశారు. ఆడవాళ్లు విద్యావంతులు కావడానికి ఆమె చేసిన కృషి  ఎన్నటికీ మరువలేనిది. సామాజిక వివక్ష నుంచి మహిళలను విముక్తి చేసే ఆయుధం  ఒక్క విద్యేనని ఆమె విశ్వసించారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే ప్రసిద్ధి చెందారు. తన భర్త జ్యోతిరావ్ ఫూలే (జ్యోతిబా)తో కలిసి పూణేలో బాలికలకు ఉచితంగా చదువును చెప్పడం ప్రారంభించింది. అంతేకాదు ఆ సమయంలో బాలికా విద్యను వ్యతిరేకించిన వారితో పోరాటం కూడా చేసింది. 

2. మహాదేవి వర్మ

1907లో అలహాబాదులో ఒక ప్రగతిశీల హిందూ కుటుంబంలో జన్మించిన మహాదేవివర్మ హిందీ కవిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, విద్యావేత్తగా ఎదిగారు. ఆమె గాంధేయవాద ఆదర్శాలను స్వీకరించింది. అంతేకాదు ఆమెకు ఆమె ఆంగ్లంలో మాట్లాడటం మానేసి ఖాదీ పని చేసింది. అలహాబాద్ లోని మహిళల రెసిడెన్షియల్ కళాశాల ప్రయాగ మహిళా విద్యాపీఠ్ కు ప్రిన్సిపాల్ గా, ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. అయితే మహాదేవి వర్మ మాత్రం రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఆమెను 16వ శతాబ్దపు మీరాబాయితో పోలుస్తారు.

3. కెప్టెన్ లక్ష్మీ సెహగల్

1914లో జన్మించిన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ మద్రాసు మెడికల్ కాలేజీలో చదివి 1938లో ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత ఆమెతో పాటుగా ఆమె కుటుంబం స్వాతంత్య్ర ఉద్యమంలో నిమగ్నమయ్యింది. ఆమె నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీ మొట్టమొదటి ఆల్-ఉమెన్ రెజిమెంట్ ను నిర్మించడానికి సహాయపడింది. అలాగే దానికి నాయకత్వం వహించింది. యుద్ధ ఖైదీలకు, యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడంలో కూడా ఆమె సహాయపడింది.

4. రాణి లక్ష్మీబాయి

ఉత్తర భారతదేశంలోని మరాఠా సంస్థానపు రాణి లక్ష్మీబాయి స్వాతంత్య్రోధ్యమ సమయంలో భారతదేశం అంతటా ఉన్న మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఈమె 1828లో కాశీలో "మణికర్ణిక"గా జన్మించింది. ఈమెకు 12 ఏళ్ళ వయసులోనే ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం జరిగింది. ఆమె భర్త మరణానంతరం రాష్ట్ర పాలనా బాధ్యత రాణి లక్ష్మీబాయిపై పడింది. బ్రిటీష్ వారి పాలనకు లొంగిపోనని ధైర్యంగా ఏడు రోజుల పాటు ఒక చిన్న సైన్యంతో పోరాడి తన సంస్థానాన్ని రక్షించుకుంది. రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో భీకరంగా పోరాడి.. 1858లో గ్వాలియర్ సమీపంలో జరిగిన యుద్ధంలో మరణించింది.

5. బసంతి దేవి

1880 లో జన్మించిన బసంతి దేవి 1921 లో స్వాతంత్య్రోధ్యమంలో చేరారు. ఆమె భర్త చిత్తరంజన్ దాస్ ను ప్రేమగా 'దేశబంధు' అని పిలుస్తారు. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు గాను ఈయన రెస్టు చేయబడ్డాడు. సహాయ నిరాకరణోద్యమ సమయంలో తన మరదలు ఊర్మిళా దేవితో కోర్టు అరెస్టు చేసిన మొదటి మహిళ బసంతి దేవి. ఖిలాఫత్ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా ఆమె పాల్గొన్నారు.

6. సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు ఒక రాజకీయ ఉద్యమకారిణి. ఆమె కవిత్వం ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే మారు పేరును సంపాదించిపెట్టింది. మహాత్మాగాంధీ అనుచరురాలు సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ కు తొలి మహిళా అధ్యక్షురాలు.

7. ఉడా దేవి

ఉడా దేవి 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లక్నోలో జరిగిన భీకర పోరాటాలలో ఒక దానికి ఈమె నాయకత్వం వహించింది. దానిలో 30 మందికి పైగా సైనికులను చంపింది. ఉడా దేవి, ఇతర దళిత భాగస్వాములు నేడు 1857 భారత తిరుగుబాటు యోధులుగా కీర్తించబడుతున్నారు.

8. ఉమాబాయి కుందాపూర్

 స్వాతంత్య్రోధ్యమంలో అలుపెరగని వీరు రాలిగా పేరుపొందిన ఉమాబాయి 'భగిని మండల్' స్థాపకురాలు. 1946లో మహాత్మాగాంధీ ఆమెను కస్తూర్బా ట్రస్ట్ కర్ణాటక శాఖకు ఏజెంట్ గా నియమించారు.

వీరితో పాటుగా భారతదేశ స్వాతంత్య్రోధ్మమంలో  ఎంతో మంది మహిళలు పాల్గొన్నారు. ఈ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వీర వనితలను స్మరించుకుందాం..

Follow Us:
Download App:
  • android
  • ios