హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం ఎదుర్కొంటున్న సమస్యలపై భవన నిర్మాణదారుల అసోసియేషన్లతో (బిల్డర్ అసోషియేషన్లు) ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాలలో నుండి హైదరాబాద్ మహానగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా దాదాపు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారని,  లాక్ డౌన్ సందర్భంలో వారి బాగోగులు చూడవలిసిన కనీస బాధ్యత భవన నిర్మాణ యజమానులపైన ఉంటుందని మంత్రి సూచించారు. 

కార్మికుల ఆత్మవిశ్వసం కలిగించేవిదంగా భవన నిర్మాణ యజమానులు చర్యలు తీసుకోవాలని...వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలని భవన నిర్మాణదారుల అసోసియేషన్లను పురపాలక శాఖ మంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల మూలంగా రియల్ ఎస్టేట్ గణనీయంగా అభివృద్ధి చెందినదని అందులో భవన నిర్మాణాదారులకు కూడా అభివృద్ది ఫలాలు అందాయని ఈ సందర్బంగా గుర్తుచేశారు.  

ప్రస్తుత అపత్కాలంలో నిర్మాణ కార్మికులకు బిల్డర్ల తొడ్పాటు అవసరమని పేర్కొన్నారు. కార్మికులకు కావలిసిన వంట సరుకులు, ఇతర అవసరాలను భవన నిర్మాణ యజమానులు అందించాలని కోరారు.  నిర్మాణ పనులు జరుగుతున్న సైట్లలో పనిచేస్తున్న కార్మిల బాగోగులు, వారి అవసరాలు, సమస్యల పైన క్షేత్ర స్థాయిలో టీంలను ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని ఈ సందర్బంగా  జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి ని ఆదేశించారు. 

కార్మికులకు కనీసావసర సరుకులు, భోజన సదుపాయాలు అందించేందుకు భవన నిర్మాణ యజమానులకు కావలిసిన అనుమతులను ఇవ్వాలని డిజీపి, సైబరాబాద్, రాచకొండ, సిటీ పోలీస్ కమిషనర్ల తో ఫోన్ లో మాట్లాడి తెలిపారు. ఈ విషయం లో సిసిపీ మరియు డైరెక్టర్ డిసాస్టర్ మానేజ్మెంట్ సెల్ వారు సమన్వయం చేసుకుంటారని తెలిపారు.

కార్మికుల సంక్షేమంను అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే కాంట్రాక్టు, రోజువారీ కూలీలకు వేతనాలు, కూలీలు చెల్లించాలని ప్రభుత్వం తెల్చిచెప్పిందని, ఒక వేళ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే అయా బిల్డర్లపైన చట్ట రీత్యా చర్యలకు వెనకాడమని మంత్రి హెచ్చరించారు.

భవన నిర్మాణ యజమానులు సీఎస్ఆర్ నిధులతో ముందుకు రావాలని పురపాలక మంత్రి కోరిన వెంటనే క్రెడాయ్ హైదరాబాద్- కోటిరూపాయలు, మీనాక్షి ఇన్ప్రాస్టక్టర్స్- 25 లక్షల రూపాయాలు, విజయ్ మద్దూరి (హైదరాబాద్ పుట్ బాల్ క్లబ్ సహ యజమాని)- 25 లక్షలు, తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ తరపున చైర్మన్ లోకభూమారెడ్డి 5లక్షల చెక్కులను మంత్రి కెటిఆర్ కు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ క్రింద అందచేశారు. 

ఈ అపత్కాలంలో విరాళాలతో ముందుకు వచ్చిన వారికి మంత్రి దన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్,  డైరెక్టర్ విశ్వజిత్, సీసీపీ దేవేందర్ రెడ్డి, వివిధ భవన నిర్మాణ యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.