Asianet News TeluguAsianet News Telugu

మజ్లీస్ తో కలిసి టీఆర్ఎస్ కుట్ర: పాతబస్తీ మెట్రోపై కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైలు మార్గం వ్యవహారంపై కేంద్ర మంత్రి, బిజెపి నేత జి. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాతబస్తీకి మెట్రో రాకుండా ఎంఐఎం చేస్తున్న కుట్రలో టీఆర్ఎస్ పాలు పంచుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు. 

Kishan Reddy lashes out at TRS on Hyderabad metro rail
Author
Hyderabad, First Published Feb 15, 2020, 4:00 PM IST

హైదరాబాద్: హైదరాబాదు పాతబస్తీకి మెట్రో రైలు మార్గాన్ని చేపట్టకపోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత జి. కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీకి మెట్రో రైలు రాకుండా మజ్లీస్ కుట్ర చేస్తోందని, ఆ కుట్రలో టీఆర్ఎస్ పాలు పంచుకుంటోందని ఆయన విమర్శించారు. మెట్రో రైలు హైదరాబాదు పాత బస్తీ ప్రజల హక్కు అని ఆయన అన్నారు. 

మెట్రో రైలుకు కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు ఇచ్చిందని, మరో 250 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్రం అడుగుతోందని ఆయన చెప్పారు. పాతబస్తీలో చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, లాల్ దర్వాజా ఆలయం వంటి పర్యాటక కేంద్రాలు, ఎగ్జిబిషన్ సెంటర్లు ఉన్నాయని ఆయన అన్నారు. పాత బస్తీ అభివృద్ధిలో వెనక పడిందని ఆయన అన్నారు. గత కాంగ్రెసు ప్రభుత్వం గానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదని ఆయన చెప్పారు. మజ్లీస్ కు పాత బస్తీ అభివృద్ధి కావడం ఇష్టం ఉండదదని ఆయన అన్నారు.

మెట్రో రైలు వస్తే పాతబస్తీ రూపు రేఖలు మారే అవకాశం ఉంటుందని, మజ్లీస్ పార్టీ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మగా మారి మెట్రోను అడ్డుకుంటోందని ఆయన చెప్పారు. కేంద్రంతో జరిగిన ఒప్పందంలో పాతబస్తీ మెట్రో రైలు మార్గం కూడా ఉందని ఆయన చెప్పారు. 

మెట్రో రైలుకు సమాంతరంగా ఎంఎంటీఎస్ రెండో దశను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని, రాష్ట్రం తన వాటా ఇవ్వకున్నా దాని పనులను కేంద్రం కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ను పొడగించడానికి రైల్వే శాఖ ముందుకు వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడానికి, తన వాటాను ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడం లేదని ఆయన అన్నారు. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ అనవసరంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు కావాల్సింది ఇళ్లు, బియ్యం, వైద్యం అని, ఇందుకు సంబంధించి కేంద్రం తన వాటాను ఇస్తోందని ఆయన అన్నారు. కేంద్రం వాటా ఇస్తుంది ఎన్ని ఇళ్లు కట్టిస్తావో కట్టించు అని ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.

మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక ఎంపీని పిలువరా అని ఆయన ప్రశ్నించారు. ఆ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా చేశారని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios