హైదరాబాద్: హైదరాబాదులోని వనస్థలిపురంలో భార్యాభర్తలు మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని వారు మరణించారు. వారిని వెంకటరెడ్డి, అతని భార్య నికితా రెడ్డిలుగా గుర్తించారు. 

వారిద్దరి శవాలు బిఎన్ రెడ్డి నగర్ లోని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాయి. ఐదేళ్ల క్రితం వారికి వివాహమైంది. దానికి ముందు వెంకట్ రెడ్డి తన నాలుగేళ్ల కుమారుడు జస్వంత్ రెడ్డిని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ గాజుల దుకాణంలో వదిలేసి, చూస్తూ ఉండాల్సిందిగా దుకాణం యజమానికి చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సాయంత్రం 4,6 గంటల మధ్య దంపతులు ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించారు. ఇంటికి వచ్చిన ఓ బంధువు ఆ విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం జస్వంత్ రెడ్డి వెంకట్ రెడ్డి సోదరి ఇంట్లో ఉన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తమ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లోరాశారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతులు వెంకట్ రెడ్డి (35), నిఖిత (32) రంగారెడ్డి జిల్లా కెశంపల్లి గ్రామానికి చెందినవారు. కొంత కాలంగా బిఎన్ రెడ్డి నగర్ లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వెంకట్ రెడ్డి ప్రైవేట్ ఉద్యోగి. కొన్ని రోజులుగా వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. 

తమ చావుకు ఎవరూ కారణం కాదని, జీవించడం ఇష్టం లేకనే చనిపోతున్నామని, తమ బాబుని మంచిగా చూసుకోవాలని, దయచేసి ఎవరూ బాధపడకండి అని సూసైడ్ నోట్ లో రాశారు.