హైదరాబాద్: ఆరు రోజుల క్రితం ఓ ఆటో డ్రైవర్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఇద్దరు అమ్మాయిలను ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. వారిలో 18 ఏళ్ల అమ్మాయిని ఆటో డ్రైవర్ సోదరుడు అత్యాచం చేశాడు. ఈ సంఘటన హైదరాబాదులోని నాంపల్లి లాడ్జిలో జరిగింది. 

ఆటో డ్రైవర్, అతని సోదరుడి కోసం పోలీసులు గాలిస్తన్నారు. చాంద్రాయణగుట్టకు చెందిన బాలికల కుటుంబ సభ్యులు పోలీసులకు శుక్రవారంనాడు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆ సంఘటన డిసెంబర్ 8వ తేదీన జరిగింది. అమ్మాయి తన 10 ఏళ్ల చెల్లెతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరారు. వారిని ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు. బాలికలు నిరాకరించినప్పటికీ అతను వారిని బలవంతంగా ఆటోలో కూర్చోబెట్టాడు. 

వారిని నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి చివరికి వట్టేపల్లిలోని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అమ్మాయిలను రాత్రిపూట ఇంటికి తీసుకు వచ్చినందుకు తల్లి ఆటో డ్రైవర్ ను తిట్టిపోసింది. అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి బాలికలకు ఆహారం ఇచ్చాడు. 

బాలికలను చాంద్రాయణగుట్టలోని వారి ఇంటి వద్ద వదిలిపెట్టాలని తల్లి చిన్న కుమారుడికి చెప్పింది. అయితే, అతను బాలికలను నాంపల్లి లాడ్జికి తీసుకుని వెళ్లాడు. పదేళ్ల బాలిక నిద్రపోగా, ఆమె సోదరిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. 

మర్నాడు ఉదయం వారిని ఫలక్ నుమా రైల్వే స్టేషన్ లో వదిలేశాడు. అక్కడ ఉన్న ఒకరి ఫోన్ ద్వారా బాలికలు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు వచ్చి వారిని ఇంటికి తీసుకుని వెళ్లారు.