హైదరాబాద్: హైదరాబాదులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాతికేళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారంనాడు నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని పుప్పాలగుడా ముష్కి చెరువు సమీపంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఒంటరి మహిళపై వారు ఆత్యాచారనికి పాల్పడ్డారు. 

మహిళతో పాటు నిందితులు ఇరువురు కూడా కూలీలుగా పుప్పాల ప్రాంతంలో పనిచేస్తున్నారు. మద్యం తాగించి వారు ఆ దారుణానికి ఒడిగట్టారు. శుక్రవారం సాయంత్రం నార్సింగికి చెందిన కూలీ దుబ్బ శ్రీను (45), పుప్పాలగుడాకు చెందిన పెయింటర్ ప్రవీణ్ అలియాస్ యాకూబ్ మాయమాటలు చెప్పి మహిళను సమీపంలోని మామిడి తోటలోకి తీసుకుని వెళ్లారు. 

మద్యం తాగిన తర్వాత మహిళపై అత్యాచారం చేశారు. మహిళ కేకలు విని మామిడితోట వాచ్ మన్ యజమానికి ఫోన్ చేశాడు. ఆ యజమానికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. 

శ్రీను చెప్పిన వివరాలతో మరో నిందితుడు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని కూడా అరెస్టు చేశారమని, బాధిత మహిళను ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ రాములు చెప్పారు.  సంఘటన సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో జరిగినట్లు ఆయన తెలిపారు.