హైదరాబాద్: మేడ్చల్ లోని నవదుర్గా నగర్ లో స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. హైదరాబాదులోని చైతన్యపురిలో ట్రాక్టర్ ప్రమాదం నుంచి రెండేళ్ల బాలుడు తెలివి తప్పించుకున్నాడు. ఈ రెండు ఘటనలు కూడా శనివారం సాయంత్రం జరిగాయి.

మేడ్చెల్ లోని నవదుర్గా నగర్ లో స్కూల్ బస్సును డ్రైవర్ రివర్స్ తీసుకుంటున్న సమయంలో రెండేళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు మరణించాడు. బస్సు వెనక ఉన్న బాలుడిని చూసుకోకుండా డ్రైవర్ రివర్స్ తీసుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు.

హైదరాబాదులోని చైతన్యపురి గణేష్ పురి కాలనీలో రెండేళ్ల బాలుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టి తెలివిగా తప్పించుకున్నాడు. లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి దూసుకొస్తున్న తీరును గుర్తించి రెండేళ్ల బాలుడు ఇంటి గేటు వద్ద ఉన్న తన తల్లి వద్దకు పరుగెత్తాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది.

ట్రాక్టర్ అదుపు తప్పి మొదట ఓ బైకును ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ డ్రైవర్ కిందపడిపోయాడు. అతని రెండు కాళ్లపై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. దాంతో అతని రెండు కాళ్లు దెబ్బ తిన్నాయి. డ్రైవర్ పడిపోయిన తర్వాత ట్రాక్టర్ ో కారును ఢీకొట్టింది. ట్రాక్టర్ ప్రమాదంలో రెండు కార్లు, ఐదు బైకులను ధ్వంసమయ్యాయి. వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రాక్టర్ చివరకు బోల్తా పడింది. గాయపడిన డ్రైవర్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.