Asianet News TeluguAsianet News Telugu

వికేంద్రీకరణ బిల్లుపై క్లారిటీ లేదు... ఏం జరుగుతుందో చూద్దాం...: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని తరలింపు కోసం తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనుందో సీనియర్ నాయకులు, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. 

YSRCP MLC Ummareddy Venkateswarlu Reacts on AP Decentralisation and Development Bill
Author
Guntur, First Published Feb 14, 2020, 5:14 PM IST

అమరావతి: ఏపి రాజధాని వ్యవహారంపై మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నరుకు పంపలేదన్నారు. టీడీపీ తన వాదనలను వినిపిస్తోందని... తాము తమ వాదనలను వినిపిస్తున్నామని చివరకు ఏం జరుగుతుందో చూద్దామన్నారు. 

వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేసినా బిల్లులు లైవులోనే ఉంటాయన్నారు. తన ఆదేశాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటానని మండలి ఛైర్మన్ షరీఫ్ సెక్రటరీకి లేఖ రాయడాన్ని ఉమ్మారెడ్డి తప్పుబట్టారు. 

సభలో నిర్ణయం తీసుకునే సమయంలో విధిగా ఓటింగ్ జరపాలని ఆర్టికల్ 189/1 ప్రకారం రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. తప్పులు జరుగుతోంటే సరి చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుందని...నిబంధనల ప్రకారం చెల్లదని చెబితే ధిక్కారం ఎలా అవుతుందన్నారు.  తాను తప్పు చేసినట్టు రుజువు అవుతుందనే మండలి ఛైర్మన్ సభ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

read more  బాబుపై కాదు కేసీఆర్ పైనే ఐటీ దాడులు...ఆ ఎనిమిదిమంది మంత్రులకోసమే...: దేవినేని ఉమ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి యనమల కామకృష్ణుడు వివరణ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలతో మాకు సంబంధం లేదని యనమల ఎలా చెప్పారు..?  అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ల ఆర్ధిక లావాదేవీల విషయంలో యనమల వకాల్తా తీసుకున్నారా..?
 అని నిలదీశారు. 

తన మాజీ పీఎస్ పై ఐటీ దాడులు జరిగినా... వాటితో సంబంధముందని ఆరోపణలు వస్తున్నా చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? తండ్రీ కొడుకుల మౌనం వస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా ఉన్నాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. 

రూ. 2 వేల కోట్లు అక్రమంగా చేతులు మారాయని ఐటీ శాఖ వెల్లడించిందని... అయితే శ్రీనివాసులుకు షెల్ కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు చేసేంతటి స్థాయి, ఆదాయం వుందా..? అని ప్రశ్నించారు. ఈ అక్రమ సొత్తు ఎవరితో ప్రజలందరికీ తెలుసని... తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు మౌనం పాటిస్తున్నారని అడిగారు. నిప్పుకు ఇప్పుడు తుప్పు పట్టిందా..? అని ఎద్దేవా చేశారు. 

read more  రెండువేల కోట్ల బాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కు భాగం.: మంత్రులు

ఓటుకు నోటు కేసులో దొరికిన సందర్భంలో చంద్రబాబు తన వాయిస్ కాదని బహిరంగంగా చెప్పారని... మరి ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు..? అని అన్నారు. చంద్రబాబు అక్రమాలు ఎల్లకాలం దాగవు...  ఇప్పుడు ఒక్కోటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. 

ఈ మొత్తం వ్యవహరంలో తనకు సంబంధం లేకుంటే అదే విషయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీకి దొరికిపోతామనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీలోకి ఐటీ  అధికారులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఉమ్మారెడ్డి ఆరోపించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios