పాదయాత్రలో లక్షలాది మందిని కలిసిన వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ తెలుసుకున్నారని అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014లోనే రుణమాఫీని ప్రకటించి వుంటే... కనీసం రూ.లక్ష ప్రకటించినా అధికారంలోకి వచ్చే వారమని కొందరు చెప్పారని కానీ - ఆచరణలో చేయలేనిది చెప్పి రైతులు మోసం చేయడం సరి కాదని జగన్ ఆనాడే స్పష్టం చేశారని సజ్జల గుర్తుచేశారు.

ప్రజలకు మేలు చేసే హామీలను ఎంత కష్టమైనా ఇవ్వడం సరైదని తన వైఖరిని చాటుకున్నారని రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. వైసీపీ మేనిఫేస్టోలో ఏ అంశాన్ని చూసినా... రాష్ట్రానికి మొత్తంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదిగా వుంటుందన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని సజ్జల మండిపడ్డారు.

Also Read:బాబు కోసమే నిఘా...ఆయనో దళారీ, మాఫియానే నడిపారు: ఏబీవీపై సజ్జల వ్యాఖ్యలు

రాష్ట్రప్రజలు, వారి సంక్షేమంతో తమకు సంబంధం లేని వ్యవహారంగా తన స్వప్రయోజనాల కోసం పనిచేశారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశారని ఆయన ధ్వజమెత్తారు.

అత్యంత దారుణంగా కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు రాష్ట్ర విభజనకు కారణమయ్యాయని.. దీనిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సజ్జల ఆరోపించారు. తొంబై వేల కోట్ల అప్పులతో ఏర్పడిన ప్రభుత్వం ... చంద్రబాబు వల్ల రూ.2.60 లక్షల కోట్ల అప్పులకు వెళ్ళిందన్నారు.

తాజాగా రూ. 60 వేల కోట్లు పెండింగ్ బిల్లులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై పడేసి వెళ్ళిపోయారని ఆయన మండిపడ్డారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని చిన్నాభిన్నం చేశారని.. స్వలాభాల కోసం ఒకముఠాగా అధికార యంత్రాంగాన్ని తయారు చేశారని రామకృష్ణారెడ్డి విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు లాగా గంటల తరబడి సమీక్షలు కాకుండా  నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. రాజధానిని మారుస్తున్నామని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

Also Read:రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 14వేల మంది రైతులే కారు...మరి ఎవరంటే..: సజ్జల

రాజధానిని ఎక్కడకు మార్చడం లేదని.. అన్ని ప్రాంతాల అభివృద్థిని దృష్టిలో పెట్టుకుని రాజధానిని వికేంద్రీకరిస్తున్నామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాజధానిని ఇక్కడ కట్టాలనే ఆలోచన చద్రబాబుకు లేదని ఆయన విమర్శించారు.

ప్రజలను భ్రమలో పెట్టి.. తద్వారా వేల కోట్లు సంపాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇక్కడ రాజధాని నిర్మాణం ఆచరణలో జరిగేది కాదని చంద్రబాబుకు తెలుసునంటూ ధ్వజమెత్తారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే తప్ప అమరావతిలో కనీస వసతులు కూడా కల్పించలేమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.