గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది.  తన భర్త మిత్రులతో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. 

ఏటి అగ్రహారానికి చెందిన ఓ మహిళతో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వివాహమైన తర్వాత కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం అతను గుంటూరు వచ్చాడు. 

ఆ విషయం తెలుసుకున్న మహిళ తన బంధువులతో కలిసి  మాట్లాడడానికి వెళ్లింది. అయితే, ఈ సమయంలో గొడవ జరిగింది. దాంతో తనపై దాడి చేశారని ఆరోపిస్తూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 17వ తేదీన తాను కాపురానికి తీసుకుని వెళ్లాలని అడిగేందుకు తన భర్త వద్దకు వెళ్లానని,  ఆ సమయంలో తన భర్త స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడని బాధితురాలు చెప్పింది. 

మద్యం సేవిస్తున్న తన భర్త, అతని మిత్రులు తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నోదు చేశారు.