Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానులపై ప్రశ్నిస్తే యువతిని గెస్ట్ హౌస్ కు రమ్మంటారా...: టిడిపి అనిత పైర్

దిశ చట్టాన్ని తీసుకువచ్చిన రెండు నెలల తర్వాత మొక్కుబడిగా ఓ పోలీస్ స్టేషన్ ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. సీఎం జగన్ కు మహిళా భద్రతపై చిత్తశుద్ది వుంటే ఇప్పటికే 13 జిల్లాల్లోనూ ఇలాంటి పోలీస్ స్టేషన్లు ఏర్పాటుచేసేవారని అన్నారు. 

Vangalapudi Anitha Open Letter To YS Jagan over Disha  act
Author
Guntur, First Published Feb 8, 2020, 9:03 PM IST

గుంటూరు: ప్రత్యేకంగా మహిళల భద్రత కోసమే ఏర్పాటుచేసిన దిశ పోలీస్ స్టేషన్ ను శనివారం ఏపి సీఎం జగన్ ప్రారంభించారు. అయితే దిశ చట్టాన్ని తీసుకువచ్చినా దాన్ని  అమలు చేయడంలో ప్రభుత్వ అలసత్వం కనిపిస్తోందని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ మేరకు మహిళా భద్రతకు సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలుపుతూ సీఎంకు ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. 

అనిత సీఎంకు రాసిన లేఖ యధావిధిగా

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, 
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా భద్రత కోసం దిశా చట్టాలు తీసుకొచ్చామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిన మీరు ఆ చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. జనవరి 31కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో “దిశా” పోలీస్ స్టేషన్లు నిర్మిస్తామని హామీనిచ్చి రెండు నెలల తర్వాత మొక్కుబడిగా రాజమండ్రిలో ఒక స్టేషన్ ప్రారంభించడం మహిళా భద్రతపై మీ నిర్లక్షానికి అద్దం పడుతోంది. 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 అత్యాచార కేసులు నమోదైతే  వాటిలో ఎంతమందికి న్యాయం చేశారు? ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారు? మీ వైసీపీ నాయకులే దుశ్శాసనులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే వారిపై దిశా చట్టం కింద కేసులెందుకు పెట్టలేదు? రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. మీ కళ్లముందే నెలకు 20 మందిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా చలించకపోవడం మీ ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతోంది. 
1.    మీ పార్టీలోని 8 మంది సభ్యులపై అత్యాచార కేసులు ఉన్నవి వాస్తవం కాదా? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? 
2.    ఎస్టీ బాలికపై అత్యాచార ఆరోపణలున్న ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
3.    సొంత వదినను వేధించిన కేసులో నిందితుడుగా ఉన్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించడం హస్యాస్పదంగా లేదా ?మహిళ రక్షణపై మీకున్న చిత్తశుద్ది ఏపాటిదో దీన్నిబట్టే తెలుస్తోంది?
4.    నాగార్జున యూనివర్సిటీలో 3 రాజధానులపై ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకు వెనకబడిన వర్గానికి చెందిన మహిళా విద్యార్థిని గెస్ట్ హౌజ్ కు రమ్మన్న ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
5.    నెల్లూరు జిల్లా మహిళా ఎంపీడీవో ఇంటిపై దాడి చేసి బెదిరించిన మీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? 
6.    అదే నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వైసీపీ కార్యకర్తలపై చర్యలెందుకు తీసుకోలేదు?
7.    చట్టానికి వ్యతిరేకంగా పులివెందులలో నిర్వహిస్తున్న క్లబ్ లను ఎందుకు మూయించడం లేదు?
8.    గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనారిటీ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వైసీపీ నాయకులకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అండగా నిలవడం వాస్తవం కాదా? 
9.    మంత్రి కొడాలి నాని పనితీరును ప్రశ్నించిన రాజధాని మహిళ పద్మపై  మహిళపై అక్రమ కేసులు బనాయించడం నిజం కాదా? 
10.    తిరుమల తిరుపతి వెంకటేశ్వర చానల్ లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ SVBC చైర్మన్ పృధ్వీపై దిశా చట్టం ఎందుకు అమలు చేయలేదు? పార్టీ నుంచి అతణ్ణి ఎందుకు సస్పెండ్ చేయలేదు?
11.    రాజధానిలో మహిళా రైతులపై అసభ్యంగా ప్రవర్తించిన  వేధించిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 
12.    మీ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని మీ చెల్లిలే కోరుతుంటే ఎందుకు ఆదేశించండం లేదు? సిబీఐ విచారణ జరపాలన్న పిటిషన్ ను హైకోర్టులో ఎందుకు వెనక్కు తీసుకున్నారు? సొంత చెల్లిలికే మీరు న్యాయం చేయలేని అన్నగా ఫ్యాక్షన్ చరిత్రలో మిగిలిపోయిన మిమ్మల్ని రాష్ట్రంలో ఆడబిడ్డలు ఎలా విశ్వసిస్తారు?
13.    మీ సొంత బాబాయి హత్య జరిగి మరో ఐదు వారాల్లో ఏడాదవుతున్నా హంతకులను పట్టుకోలేని మీరు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏవిధంగా కాపాడతారు? ఆడపిల్లలకు ఎలా రక్షణ కల్పిస్తారు?
14.    ప్రకాశం జిల్లా చిన గంజాంలో మత్స్యకార మహిళ పద్మను వివస్త్రను చేసి ఆత్మహత్యకు పురిగొల్పిన నిందితులను ఏం చేశారు? ఏం చర్యలు తీసుకున్నారు?
15.    అనంతపురం జిల్లాలో అలివేలమ్మ జుట్టు కత్తిరించిన నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు?
16.    గుంటూరు జిల్లా రామిరెడ్డి పేట ఎస్సీ బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై దిశాచట్టం ఎందుకు నమోదు చేయలేదు?
17.    ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో బీసీ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను దిశాచట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోలేదు?
18.    వారం రోజుల్లో ఏ కేసునైనా దర్యాప్తును పూర్తి చేశారా? 14 రోజుల్లో ఏ కేసులోనైనా విచారణ పూర్తి చేశారా? ఆధారాలున్న కేసుల్లో 21 రోజుల్లో తీర్పు ఒక్కటైనా చెప్పారా? 
19.    దిశా చట్టం ఆమోదం పొంది మరో నాలుగు రోజుల్లో రెండు నెలలవుతోంది. ఎన్ని కేసులు వారంలో పూర్తి చేశారు?ఎన్ని కేసుల్లో 14 రోజుల్లో విచారణ పూర్తి చేశారు? రెండు నెలల్లో ఒక్కరికైనా శిక్ష విధించారా?
20.    ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ కు సెల్యూట్ కొట్టడం కాదు. రాష్ట్రంలోని ఆడబిడ్డలు మీకు సెల్యూట్ కొట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకోలేకపోయారు?
21.    సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే రెండేళ్లు, నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తామన్నారు. కానీ తనపై అసభ్య పోస్టులు పెట్టిన దుండగులపై దిశా చట్టం కింద కేసులు నమోదు చేయమని సాక్షాత్ అసెంబ్లీలోనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మిమ్మల్ని కోరి ఇప్పటికి 7 వారాలైనా ఎందుకు న్యాయం చేయలేదు? భవానీపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని ఎందుకు జైలుకు పంపలేదు?
22.    మహిళా ఎమ్మెల్యే కోరినా దిశా చట్టం కింద న్యాయం చేయలేని మీరు రాష్ట్రంలో మిగిలిన ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తారు?
23.    తనపై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా డీజీపీని కలిసి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ కోరితే మీరేం న్యాయం చేశారు?
24.    గత 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది మహిళపై అత్యాచారాలు జరిగాయి ? ఎంతమంది ఆడపిల్లలను హత్య చేశారు? ఎన్ని కిడ్నాప్ లు జరిగాయో వివరాలు ప్రకటించే ధైర్యం ఉందా?

 వంగలపూడి అనిత
తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు

Follow Us:
Download App:
  • android
  • ios