గుంటూరు: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలపై పోలీసులు దాడి చేయించడాన్నితెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఖండించారు. పాలిచ్చే ఆవు కాదు తన్నే దున్నపోతు అని తాజా లాఠీఛార్జితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. 

సీఎం జగన్ తుగ్లక్‌ పోకడలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారన్నారు. 500 మందిపై ఏడు రకాల సెక్షన్ల కింద కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి నిర్ణయాలే రాజధాని మహిళలు రోడ్డెక్కేలా చేశాయని... ఇప్పుడు ఏకంగా రోడ్లపై ఈడ్చి లాఠీలతో కొట్టించడానికి సిగ్గుగా లేదా.? అని మండిపడ్డారు. 

read more  నాలుకను లబలబలాడిస్తూ...ఏసి రూముల్లో పడుకోవడం కాదు...: రోజాపై దివ్యవాణి ఫైర్

రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతుండడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతోందన్నారు. ముఖ్యమంత్రిలో రాక్షసత్వం జడలు విప్పుతోందని... రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ సంస్కృతి విజృంభిస్తోందన్నారు. అందుకు ఈ పోలీసుల దాడులే నిదర్శనమన్నారు. 

''అమ్మా విజయమ్మా.. నీ కుమారుడు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఏం చేస్తున్నావు...? రాష్ట్రాన్ని దోచుకున్నందుకు నీ కుమారుడిని అరెస్ట్‌ చేస్తే జైలు ముందు ఆందోళన చేసిన నీవు తమ బతుకుల కోసం, తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న మహిళలపై అదే కుమారుడు లాఠీ ఛార్జీ చేయిస్తుంటే నోరు ఎందుకు మెదపడం లేదు.? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం భువనేశ్వరి గారిలా అండగా నిలవడం నీకెలాగూ సాధ్యం కాదు. కనీసం మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఆపేలా మంచి బుద్ధి ప్రసాదించమని ఆ దేవుణ్ని కోరుకో'' అంటూ ముఖ్యమంత్రిపైనే కాదు ఆయన తల్లిపైనా  విమర్శలు ఎక్కుపెట్టారు వంగలపూడి అనిత.