Asianet News TeluguAsianet News Telugu

నాలుకను లబలబలాడిస్తూ...ఏసి రూముల్లో పడుకోవడం కాదు...: రోజాపై దివ్యవాణి ఫైర్

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత వైసిపి ఎమ్మెల్యే రోజాకు లేదని మహిళా నాయకురాలు దివ్యవాణి అన్నారు. ఏసి రూముల్లో మేకప్ వేసుకుని కూర్చునే రోజాకు బయట ప్రజల కష్టసుఖాలు ఏం తెలుస్తాయంటూ మండిపడ్డారు. 

TDP Leader Divya Vani Fires on YSRCP  MLA Roja
Author
Guntur, First Published Feb 20, 2020, 5:00 PM IST

గుంటూరు: నవమాసాల అనంతరం పండంటి బిడ్డను కంటానని ఆశపడిన తల్లికి తన కడుపులో ఉన్నది బిడ్డ కాదు పెద్దబండ రాయి అని తెలిస్తే ఎంతలా బాధపడుతుందో ప్రస్తుతం ఏపి పరిస్థితి కూడా అలానే తయారైందని టీడీపీ మహిళానేత, అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. 9నెలల వైసీపీ పాలన అనంతరం ఏపీ ప్రజలకు 9 మోసాలతో పాటు 9రకాల రాళ్లే మిగిలాయని ఎద్దేవా చేశారు. 

గురువారం దివ్యవాణి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నరంలేని తన నాలుకను ఎటువీలైతే అటు తిప్పే రోజా నేడు ఏ ముఖం పెట్టుకొని విద్యార్థుల ముందుకొచ్చిందో చెప్పాలని దివ్యవాణి డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ విద్యార్థులను కర్కశంగా, దారుణంగా పోలీసులతో కొట్టించిన రోజాపై దిశా చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు.  

రైతులను చూసి భయపడుతున్న ముఖ్యమంత్రి జగన్ దొడ్డిదారిన అసెంబ్లీకి వెళుతుంటే ఎమ్మెల్యే రోజా తన సొంతూరిలో తిరగలేని స్థితిని తెచ్చుకున్నారన్నారు. తన సొంతూరి ప్రజలే రోజాపై  కేసులు పెట్టారంటే ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నారో అర్థమవుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుని ప్రశ్నించారన్న అక్కసుతో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ విద్యార్థులను పోలీసులతో దారుణంగా కొట్టించడాన్ని దివ్యవాణి తప్పుపట్టారు. 

అమయాకులైన రైతులు, మహిళలను, దారుణంగా హింసిస్తుంటే వారు ఎక్కడికి వెళ్లాలని, ఎవరితో చెప్పుకోవాలని ఆమె ప్రశ్నించారు.   నరంలేని నాలుకను లబలబలాడించే రోజా చంద్రబాబునాయుడిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధినేత ప్రజాచైతన్య యాత్ర చేస్తుంటే వైసీపీ నేతలు, ప్రభుత్వం ఎందుకంతలా భయపడుతోందని దివ్యవాణి నిలదీశారు. చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్న ప్రభుత్వం, తన ఆటలు ఎల్లకాలం సాగించలేదని తెలుసుకుంటే మంచిదన్నారు. 

read more  దిశ చట్టం ఎఫెక్ట్... ఏపిలో మహారాష్ట్ర హోంమంత్రి, డిజిపి పర్యటన

ఇప్పటికే దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు జగన్ పరిపాలనపై గగ్గోలు పెడుతున్నారని, సోషల్ మీడియాద్వారా తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నా జగన్ ప్రభుత్వంలో మార్పురావడం లేదన్నారు. చంద్రబాబు ఏదైనా సరే ముఖానే చెబుతారని, రాష్ట్రం కోసమే ఆయన మోదీని సైతం ఎదిరించారని, జగన్ లా దొంగనవ్వులు నవ్వడం, మోసాలు చేయడం, చాటుమాటుగా కాళ్లు పట్టుకోవడం ఆయనకు తెలియదని దివ్యవాణి తేల్చిచెప్పారు. 

జగన్ కు భజన చేయడం మానేసి ప్రజల్లోకి వెళితే రోజాకు వాస్తవాలు బోధపడతాయని, మేకప్పులు వేసుకొని ఏసీ రూముల్లో పడుకుంటే ఏం తెలుస్తుందన్నారు. మూడురాజధానుల పేరుతో తమ భూములు కాజేయవద్దని విశాఖ వాసులు గగ్గోలు పెడుతున్నారని, వారికి సమాధానం చెప్పే ధైర్యం రోజాకు ఉందా అని దివ్యవాణి ప్రశ్నించారు. 

తన నియోజకవర్గ ప్రజలు ఛీ కొడుతున్నా, రాష్ట్రమంతా వైసీపీ పాలనను చీదరించుకుంటున్నా రోజా తన జబర్దస్త్ షోలను ఆపడం లేదన్నారు. అమరావతి ఆందోళనలో పాల్గొనే విద్యార్థులను బెదరిస్తూ మహిళలు, రైతుల్ని పోలీసులతో కొట్టిస్తూ, రాక్షసానందం పొందడం వైసీపీనేతలకే చెల్లిందన్నారు. జగన్ పరిపాలన వల్ల దేశంలో ఏ రాష్ట్రానికి పట్టని దుర్గతి ఆంధ్రరాష్ట్రానికి పట్టిందని ప్రజలంతా వాపోతున్నారన్నారు. 

అన్నక్యాంటన్లు మూసేసి పేదల కడుపులు మాడ్చిన ప్రభుత్వం గోడలకు సున్నాలు కొట్టడంలో మాత్రం బిజీగా ఉందన్నారు. ప్రజలంతా అమరావతి కావాలంటుంటే, వారి మధ్యన విబేధాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నాడన్నారు. ఏ1, ఏ2ల అవినీతి, ఆర్థిక నేరాల కారణంగా దేశప్రధాని కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ఏటా ప్రతిజనవరిలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ప్రకటనలు చేస్తామని చెప్పిన జగన్ దాని గురించి మర్చిపోయాడని,  రోజాగారైన ఈ విషయాన్ని తమ నేతకు తెలియచేస్తే సంతోషిస్తామన్నారు. వివేకానందరెడ్డి హత్యకేసుని సాధారణ మరణంగా చిత్రీకరించిన జగన్, ఆయన మీడియా ఐటీ సోదాలను పట్టుకొని, చంద్రబాబుపై బురదజల్లడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఐటీకి, ఇన్ కంటాక్స్ రంగాలకు తేడా తెలియకుండా వెర్రెక్కినట్లుగా మాట్లాడతున్న రోజా, జగన్ అవినీతి చిట్టాపై నోరెందుకు మెదపడం లేదని దివ్యవాణి ప్రశ్నించారు. 

read more  ''వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే జగన్ కు...రస్ అల్ ఖైమా చేతిలో క్రాష్...''

ఐటీదాడుల ముసుగులో చంద్రబాబు, ఆయన కుటుంబంపై బురదజల్లాలని సాక్షి మీడియా, వైసీపీ నేతలు ఎంతగా దుష్ర్పచారం చేసినా ప్రజల్లో ఆయనపై ఉన్న ఆదరాభిమానాలు తగ్గలేదన్నారు. అందుకు ప్రజాచైతన్య యాత్రలో ప్రజల నుంచి ఆయనకు లభిస్తున్న నీరాజనాలే నిదర్శనమన్నారు.  

చంద్రబాబునాయుడు, ధర్మం - న్యాయం వైపున్నారు కాబట్టి ఆయనకు భద్రతను కొనసాగించాల్సిన అవసరముందనే విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి గ్రహించాలని... దొడ్డిదారిన అసెంబ్లీకి వెళుతున్న జగన్ కు భద్రత కల్పించడంపై పెట్టే శ్రద్ధను టీడీపీ అధినేతపై కూడా పెట్టాలని దివ్యవాణి సూచించారు. 

సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బయటకురాడని... దాని అవసరం జగన్మోహన్ రెడ్డికే ఎక్కువుందని దివ్యవాణి ఎద్దేవాచేశారు. కేసుల భయంతో మోడీ కాళ్లు పట్టుకోవడం, కోర్టులకు వెళ్లాల్సి వస్తుందని పరిపాలన చేస్తున్నట్లు నటించడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చేతనైన విద్యలని దివ్యవాణి విరుచుకుపడ్డారు. బరితెగించిన ప్రభుత్వం ప్రజలకు కష్టాలపాలు చేస్తుంటే చూసి తట్టుకోలేకనే చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లాడని... వైసీపీనేతలు, మంత్రులకు దమ్ము, ధైర్యముంటే, వారుకూడా జనం మధ్యలోకి వచ్చి మాట్లాడాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios