అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఉపాధి కోల్పోయిన కార్మికులు ఆర్థిక కష్టాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా రోడ్డునపడ్డ కార్మికుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా వుండటం మంచిది కాదని ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ఆయన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి చురకలు అంటించారు. ''రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు.'' అంటూ  కన్నా ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. 

read more  video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్
 
ఈ ట్వీట్ కు ఏపిలోని వివిధ ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రంగులు వేసిన పోటోలను జతచేశారు. కేవలం భవనాలకే కాదు చేతిపంపు, వాటర్ ట్యాంకులకు కూడా ఆ పార్టీ రంగును వేసిన పోటోలను ఆయన ఈ ట్వీట్ లో వాడారు. ఇలా కేవలం మాటలతోనే కాదు పోటోలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. 

ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన గుంటూరుకు చెందిన పోలెపల్లి వెంకటేశ్ అనే ప్లంబర్ ఆర్థిక కష్టాలు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో ఇక బ్రతకడం భారంగా భావించిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సెల్ ఫోన్ లో ఓ సెల్పీ వీడియోను తీసుకున్నాడు. అందులో తన ఆత్మహత్యకు కారణాలను వివరించడంతో పాటు తన గుండెల్లో దాగున్న బాధనంతా బయటపెట్టాడు.  

ఇక ఇదే జిల్లాలో గతంలో ఓ తాపీమేస్త్రీ కూడా బలయ్యాడు. గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

read more  వైసిపి దళారుల వల్లే ఇసుక కొరత...ఇక తాడోపేడో: ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్

ఇలా ఇసుక కొరతతో ఉపాది కోల్పోయి ఇప్పటికే ఇద్దరు కార్మికులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ ఆత్మహత్యలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదివరకే స్పందించారు.  వీటికి వైఎస్సార్‌సిపి ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.  తాజాగా కన్నా కూడా కార్మికుల ఆత్మహత్యలపై స్పందిస్తూ వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు.