Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ప్రభుత్వం ఆ మూడు పథకాలను పక్కాగా అమలుచేస్తోంది...: నారా లోకేష్

మంగళగిరిలో జరిగిన ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్న నారా లోకేష్ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

Nara Lokesh Praja Chaitanya Yatra At Mangalagiri
Author
Mangalagiri, First Published Feb 19, 2020, 9:13 PM IST

మంగళగిరి: ప్రజా వేదిక కూల్చివేతతో జగన్ తుగ్లక్ పాలన ప్రారంభం అయ్యిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. కేవలం తొమ్మిది నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ పై కక్ష సాధింపు ఫుల్లుగా సాగించి అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేశారని అన్నారు. 9 నెలల్లో ప్రజల్ని ముంచే కార్యక్రమాలు తప్ప తుగ్లక్ గారు చేసిన ఒక్క మంచి కార్యక్రమం లేదని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళగిరిలో మొదలయ్యింది. ఇందులో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ మూడు కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు.  

1. వైసిపి కలరింగ్ స్కీం: రూ.1300 కోట్లతో చంద్రబాబు హయాంలో నిర్మించిన పంచాయితీ భవనాలు, స్కూల్స్, స్మశానాలు, ఆఖరికి మరుగుదొడ్లకు వైకాపా రంగులు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. కోర్టు చివాట్లు పెట్టడంతో ఈ రంగుల కార్యక్రమం ఆగిపోయిందని... ఇప్పుడు వేరే రంగులు వెయ్యడానికి మరో రూ.1300 కోట్ల ప్రజా ధనం వృధా అని అన్నారు. 

2. వైసిపి భాష: రాష్ట్ర రాజకీయాల్లో వైసిపి ఓ కొత్త బాషను తీసుకువచ్చిందని అన్నారు. తెలుగులో నాన్న అంటాం...ఇంగ్లీష్ లో ఫాదర్ అంటాం కానీ వైసిపి బాషలో   నీ అమ్మ మొగుడు అంటారని... ఇది వారి బాష అని ఎద్దేవా చేశారు. 

3. కక్ష సాధింపులు:  ఇక మూడో పథకం వైసిపి కక్ష సాధింపులకు సంబంధించినది. తెలుగు దేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, భద్రత తగ్గించడం వంటివి ఈ పథకం కిందకు వస్తాయన్నారు.

read more  అశోకుడు, అక్బర్ చక్రవర్తుల తరహాలో జగన్ పాలన..: కర్నూల్ ఎంపీ

45 ఏళ్లకే బీసీ,ఎస్సి,ఎస్టీ మహిళలకు పెన్షన్ అని చెప్పి ఇవ్వలేదని... ఇలా మహిళల్ని వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేసేస్తా అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి మాఫీ చెయ్యలేదని మండిపడ్డారు.  

రూ.3 వేల పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలో రాగానే వృద్ధులను దగా చేసారని లోకేష్ ఆరోపించారు. కేవలం రూ.250 పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఇందుకోసం ఏకంగా 7 లక్షల పెన్షన్లు తీసేసారని అన్నారు. అలాగే 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసారని... చివరికి దివ్యాంగులు పెన్షన్లు కూడా తీసేసారని ఇంతకంటే దుర్మార్గం మరోటి వుండదన్నారు.

ఈ తుగ్లక్ రైతులను కూడా ముంచేశాడంటూ సీఎం జగన్ ను విమర్శించారు. విత్తనాలు కూడా ఇవ్వలేని ఉత్తుత్తి ప్రభుత్వమిదని అన్నారు. అప్పుల‌బాధ‌తో 270 మంది రైతుల ఇప్పటివరకు ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.12500 రైతుభ‌రోసా అంటూ కేవలం రూ.7,500 చెల్లించి రైతులను ముంచేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 15 లక్షల మంది కౌలు రైతులకు భరోసా అని 50 వేల మందికే ఇచ్చారని అన్నారు. 

read more  అది నిరూపించు... ప్రాణత్యాగానికి సిద్దమే...: పేర్ని నాని సవాల్

యువత భవిత పై కూడా ఈ ప్రభుత్వం దెబ్బ కొట్టిందని... ఉన్న కంపెనీలు అన్ని వెళ్లిపోతుంటే వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా రద్దు చేసారని మండిపడ్డారు. 

''కియా పోతుంది, లులూ బై బై ఎపి అంది, అదానీ పోయింది. లక్షల మంది కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని నిరుద్యోగ యువత ని రోడ్డు మీద నిలబెట్టారు. గ్రామ సచివాలయం పోస్టులు అంటూ పేపర్ లీక్ చేసి ఒక్కొక్కరికి రూ.5 లక్షలకు అమ్ముకొని 20 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసారు. ఇలా వెన‌క‌బ‌డిన త‌ర‌గతుల‌కు వెన్నుపోటు పొడిచారు'' అని అన్నారు.

''బీసీ,ఎస్సి,ఎస్టీ లకు చెందాల్సిన రూ.6,500 కోట్లు పక్కదారి పట్టించారు. బీసీల‌కు ఆద‌ర‌ణ ప‌థ‌కం దూరం చేసారు. కులానికో కార్పొరేష‌న్ అనే హామీ మాయం అయ్యింది'' అని ఆరోపించారు. 

''ముస్లింల ఉనికికే ముప్పు.NPR,NRCల‌కు వైకాపా మ‌ద్ద‌తుతో ముస్లింల‌కు తీర‌ని న‌ష్టం చేస్తున్నారు. రంజాన్ తోఫా కానుక‌లు ర‌ద్దు చేసారు. మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ గారిని మ‌తం పేరుతో వైకాపా మంత్రులు దూషించారు. మైనార్టీ కార్పొరేషన్ నుండి రూ.442 కోట్లు మళ్లించారు'' అంటూ వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ ఎండగట్టారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios