మచిలీపట్నంలో టిడిపి, వైసిపి నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇటీవల మున్సిపాలిటీ పనుల్లో మంత్రి పేర్ని నాని భారీ అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తే... దాన్ని రుజువు చేయాలంటూ మంత్రి సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ ను స్వీకరించడానికి సిద్దంగా వున్నానంటూ మాజీ మంత్రి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా బందరులో రాజకీయాలు వేడెక్కాయి. 

తననే కాదు కుటుంబ సభ్యులను కూడా విమర్శించిన మంత్రి పేర్ని నానిపై తాజాగా రవీంద్ర ఎదురుదాడికి దిగారు. ఎల్లయ్య పుల్లయ్య చెప్పాడని కట్టుకథలు పిట్టకథలు వినిపించడం మానుకోవాలని అన్నారు. మంత్రి చేసిన పనుల్లో అవినీతి జరిగిందని మరోసారి ఆరోపించారు. బందరు మున్సిపాలిటీలో పనుల కోసం   టెండర్లు పిలిచి బిడ్ ఓపెన్ చేసేలోపే పనులు ఖరారు అయిన మాట వాస్తవం కాదా...? ఈ ప్రశ్నకు డొంకతిరుగుడు లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని  మంత్రిని కొల్లు రవీంద్ర నిలదీశారు. 

తాను చేసినవి కేవలం ఆరోపణలు కావని... వాటిని ఎక్కడయినా, ఎప్పుడయినా, ఎలాగయినా రుజువు చేయడానికి సిద్ధమేనని అన్నారు. తనకు పిట్టకథలు, నాటకాలు అవసరం లేదన్నారు. సీఎం జగన్ ఎవరు అవినీతికి పాల్పడినా వదిలేది లేదని అంటుంటే... మంత్రిగారేమో ఎవరైనా గిఫ్టుగా ఇస్తే తీసుకొండని అధికారులకు బహిరంగంగానే చెప్పడం ఏమిటన్నారు. ఇలాగే బందరు మునిసిపాలిటీ లో గిఫ్టుల కోసం పనులు ధారాదత్తం చేశారని అన్నారు. 

కాంట్రాక్టర్లను చక్కగా రింగ్ చేసి పనులు పంచారని ఆరోపించారు. చట్టపరంగా పనులు జరగాలి అని తాము చెబుతుంటే ప్రభుత్వ పెద్దలు అలా చేయడానికి అడ్డుతగిలారని తెలిపారు. పనులు చేస్తుంటే తమకు కడుపుమంటగా వుండటం కాదు...ఇష్టానుసారం చేస్తుంటే చూస్తుంటే కడుపు మండిపోతోందన్నారు.  వీటిని చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దని హెచ్చరించారు.

read more  అది నిరూపించు... ప్రాణత్యాగానికి సిద్దమే...: పేర్ని నాని సవాల్

2015, 2016 పనుల గురించి మంత్రి మాట్లాడిన మాటలు గుర్తుచేసిన రవీంద్ర...  కొంచెం తెలుసుకొని మాట్లాడితే  బావుండేదన్నారు. తాము టెండర్లు పిలిచినప్పుడు చాలామంది పాల్గొని పనులు పొందారన్నారు. అయితే అప్పుడు వచ్చిన జిఎస్టి వల్ల నష్టపోతున్నాని... న్యాయం చేయండని కోర్టుకు వెళ్లి పనులు రద్దునచేయించుకున్నారని తెలిపారు. టిడిపి హయాంలో కాంట్రాక్టర్లు నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పారదర్శకంగా పనులు చేశామన్నారు.   

ఎక్సైజ్ శాఖలో  తాము అవినీతి చేశామని అనేముందు ఈ  వ్యాపారంలో వున్న ఆయన మనుషులను కనుక్కోవాల్సిందని మంత్రి నానికి సూచించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పనిచేసామని వారే మంత్రికి చెప్పేవారన్నారు. 

పేర్ని నాని బినామీ సాల్ట్ ఫ్యాక్టరీలో ఎలా దోచుకుంటున్నారో తెలుసని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరు లారీలు కొన్నారు... ఇసుక అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారు... వారికి ఎవరు సహకరిస్తున్నారో అందరికి తెలుసని అన్నారు. బినామిలు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని... వాటిమీద బతికే కుటుంబం ఆయనదే అంటూ మంత్రిపై రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

read more  ఆ మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి...: కొల్లు రవీంద్ర డిమాండ్

తమ కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయని... మంత్రి గారికి రాజకీయాలే వ్యాపారమని ఎద్దేవా చేశారు. టిడిపి హయాంలో సాల్ట్ ఫ్యాక్టరీ, కరగ్రహారం గోడౌన్ల నిర్మాణం, 8 రిసర్వాయర్లు, బీచ్ రోడ్, సెంట్రల్ లైట్స్, ఎల్ఈడి లైట్లు, బీచ్ ఫెస్టివల్స్, చెప్పుకుంటూ పోతే చాలా చేశామని... మీరేం చేశారో చర్చకు సిద్దమా అని పేర్ని నానికి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు.