Asianet News TeluguAsianet News Telugu

బలహీన వర్గం వాడినే... కానీ బలహీనున్ని కాదు : టిడిపికి తమ్మినేని హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తననెంతో భాదిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రతిపక్ష టిడిపి సభ్యులు ముందస్తు వ్యూహంతోనే సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

AP assembly speaker tammineni sitharam fires on TDP MLAs
Author
Amaravathi, First Published Jan 22, 2020, 3:42 PM IST

అమరావతి: గత మూడు రోజులుగా ఏపి అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న ఘటనలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. స్పీకర్ పదే పదే చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోవడం లేదని...అవకాశం ఇస్తామన్నా గందరగోళం సృష్టించాలనే ప్రయత్నాలను ఆపడం లేదన్నారు. అవకాశమిస్తేనే గొడవ ఆపుతాం అన్నట్టు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. 

టిడిపి సభ్యులు సభలో గందరగోళం సృష్టించటానికి ముందస్తు ఆలోచనతో వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. మార్షల్స్ ను ఎందుకు పిలిచారని కొందరు ప్రశ్నిస్తున్నారని... అయితే వారివారి స్థానాల్లో సభ్యులను కూర్చోబెట్టటానికే  వారిని పిలిపించినట్లు స్పష్టం చేశారు. శాసనసభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హద్దులు దాటిందని... ఏకంగా స్పీకర్ పోడియం పైకి వెళ్ళి స్పీకర్ ను పదే పదే చుట్టుముట్టడం ఏమిటని ప్రశ్నించారు. 

బీసీ వర్గానికి చెందిన  స్పీకర్ ను అయిన తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతో  బాధిస్తోందన్నారు. అలాగే శాసనసభాపక్ష నేత  జగన్, ముఖ్యమంత్రి జగన్, మంత్రులను వారు ఏకవచనంతో నోటికొచ్చినట్లు మాట్లాడటంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ సభ్యుల ప్రవర్తన, వారి భాష, వారి తీరు పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఖండించారన్నారు. ఈ పరిణామాలపై స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..  శాసనసభ స్పీకర్ స్థానానికి ఇచ్చిన సూచనలు, అధికారం మేరకు గౌరవ స్థానానికి భంగం కలిగించేలా ఉన్న ఈ సంఘటనను ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ వీలైనంత త్వరగా రిపోర్టు ఇవ్వమని ఆదేశించారు. 

బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా తనకు సభానాయకుడు స్పీకర్ గా అవకాశం ఇచ్చారని తమ్మినేని సీతారాం అన్నారు. అయితే తా.ను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కానీ బలహీనుడ్ని మాత్రం కాదని... దయచేసి ఈ విషయాన్ని టిడిపి సభ్యులు గుర్తు పెట్టుకోవాలని స్పీకర్ స్పష్టం చేశారు. నేను బలహీనుడునో, బలవంతుడునో ప్రతిపక్ష నాయకుడు  చంద్రబాబుకు కూడా అనుభవం ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. దయచేసి ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకూడదని హెచ్చరించారు.

ఇకమీదట పునరావృతం అవుతుందని అనుకోవటం లేదని స్పీకర్ ఆశించారు. బలహీనవర్గాలు, దళిత వర్గాలు,  మైనార్టీ వర్గాలు శక్తిహీనులు కాదని రుజువు చేసే బ్రహ్మాండమైన అవకాశం సీఎం జగన్ ఇచ్చారన్నారు. ఎథిక్స్ కమిటీకి ఈ ఘటనను రిఫర్ చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రిపోర్టు తర్వాత దీనిపై ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. 

read more  పవన్ కల్యాణ్ జాగ్రత్త...అలాగే చేస్తే రాష్ట్రంలో తిరగలేవు: మంత్రి వార్నింగ్

తన అభిప్రాయాలను తెలియజేయటానికి అవకాశం ఇచ్చినందుకు సభకు  స్పీకర్ తమ్మినేని సీతారాం ధన్యవాదాలను తెలిపారు. ఈరోజు శాసనసభలో జరిగిన ఉదంతం చాలా దురదృష్టకరమని... శాసనసభ్యునిగా సభలో అడుగుపెట్టినప్పుడే సభ రూల్స్, కన్వెన్షన్స్(Rules and Conventions)ను సభ్యులు ఎవరికి వారు అర్థం చేసుకొని వ్యవహరించాల్సి ఉందని స్పీకర్ తెలిపారు. 

దురదృష్టకరం ఏమిటి అంటే చాలా సందర్భాల్లో సభ రూల్స్, కన్వెన్షన్స్ నియమాలు మొత్తం ఉల్లంఘించి గత మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరు చాలా ఆక్షేపణీయమన్నారు. అయినా స్పీకర్ గా ఎందుకు సహిస్తున్నారన్న ప్రశ్న సభ నుంచి ఉత్పన్నం అయిందన్నారు. అయితే మనది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడ్డ చట్టసభ కాబట్టి సహించాల్సి వచ్చిందన్నారు. 

ఈ చట్టసభకు కొన్ని రాజ్యాంగపరమైన, శాసనసభ సభ్యుల ప్రవర్తనపై నియమావళి ఉందన్నారు. మనకి ఎవరైతే సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆక్షేపనీయంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవటానికి కమిటీలు కూడా ఉన్నాయని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ప్రత్యక్షంగా తాను చర్యలు తీసుకునే ముందు కొన్ని సాంప్రదాయాలు, రూల్స్  పాటించాలని అన్నారు.  

సభా నాయకులు మార్షల్స్ పిలిపించి వారిని అక్కడ అదుపులో పెట్టండి.... వారి స్థానాల్లో కూర్చొపెట్టండి  అన్నారని...అయితే మార్షల్ పిలిచేటప్పుడు రెజిల్యూషన్ (resolution) అవసరమని టిడిపి సభ్యులు అంటున్నారని స్పీకర్ గుర్తుచేశారు. సస్పెండ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రెజిల్యూషన్ మూవ్ చేసి చేస్తారని... కానీ ఇక్కడ సభలోనే కూర్చొబెట్టమన్నారు సభా నాయకుడు అన్నారని స్పీకర్ వివరణ ఇచ్చారు. దానికి కూడా రెజల్యూషన్ ఉండాలని సభ్యులు భావిస్తే తనకు  తెలియజేయాలి అని స్పీకర్ కోరారు.  

ఉదయం నుంచి సుమారు గంటన్నర, రెండు గంటల కాలం చాలా సహనంతో వెళ్లి కూర్చొండి.. మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం అంటూ సముదాయిస్తూ వచ్చానని  తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. అయితే మాకు మైక్ ఇస్తే మేం వెళ్లి కూర్చుంటాం అని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారని.... ఇది ఏమైనా బేరసారాలా? ఒప్పందమా? అని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''కొన్ని నియమావళితో కూడుకున్నదే ఈ శాసనసభ. అవకాశం ఇస్తామని సభాపతిగా నేను చెబితే వారు అది కాదని మీరు ఇస్తేనే మేం వెళ్తామని అన్నారు. అంటే.. వీరు (ప్రతిపక్ష  సభ్యులు) ముందస్తు ఉద్దేశాలతో వచ్చారని అనుకున్నాను. మంగళవారం కూడా అలాగే వ్యవహరించారు'' అని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు.  

read more  రాజధాని కోసం 15 ఎకరాలు... తుళ్లూరు రైతు గుండెపోటుతో మృతి

టీడీపీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభను డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేశారన్నారు స్పీకర్. అయితే చివరకు సభ్యులకు ఏమైనా అయ్యిందో లేక అలుపు వచ్చిందోగానీ వారే వాకౌట్ చేసుకొని వెళ్లిపోయారని అన్నారు. వెళ్లిపోతూ స్పీకర్ తాలూకా వ్యవహారశైలిపై సాకుగా చూపిస్తూ వెళ్లిపోయారని.... అవకాశం ఇస్తామని చెప్పినా, కూర్చొకుండా చివరకు స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా వెళ్తున్నామనటం ఏంటని ప్రశ్నించారు.  

ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వటం ఏంటి? దాని మీద ఏంటో వెంటనే చెప్పండని అడగటం ఏంటని తమ్మినేని సీతారాం నిలదీశారు. వారు ఇచ్చిన వాయిదా తీర్మానం చూశానని... దానిపై సరైన సమయంలో నిర్ణయం చెబుతాను అన్నానని తెలిపారు. అయితే సభలోకి వస్తూనే వారి స్థానాల్లో కూర్చోకుండా నేరుగా పోడియం వద్దకు రావటం ఏంటని స్పీకర్ సభ్యుల తీరుపై విచారం వ్యక్తం చేశారు. 

సభలో 151 మంది వైసిపి సభ్యులు, జనసేన నుంచి ఒక శాసనసభ్యుడు కూడా ఉన్నారన్నారు. సభ్యులు శాసనసభ ద్వారా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి చెప్పుకోవాలని అనుకుంటారని... వారి హక్కులను హరించే అధికారం ప్రతిపక్షానికి లేదన్నారు. గౌరవ సభ్యుడి హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదని ప్రతిపక్షమే కాదు.. అధికార పార్టీకి కూడా లేదన్నారు.

''గౌరవ సభ్యుడి హక్కుల్ని పరరిక్షంచాలి, వారి అభిప్రాయాలు చెప్పుకోవాలి. సభ ద్వారా సభానాయకుడు వింటారు. సాధ్యాసాధ్యాలు విని ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. ప్రజాప్రభుత్వం ఎన్నికైంది. ఈ ప్రజా ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి. వాటిని నిర్వర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది '' అని తమ్మనేని అన్నారు.

''ఇవాళ మూడు రాజధానులపై నిర్ణయం జరిగింది. అది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయం మంచిదా, చెడ్డదా అన్న ప్రజలు నిర్ణయిస్తారు.దానిపై టీడీపీ శాసనసభ్యులు తమ అభిప్రాయాలను చెప్పారు. ఆ బిల్లును సభ ఆమోదించింది. సభ ఆమోదించిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే అంశాన్ని పట్టుకొని కూర్చోవటం సరికాదన్నారు. మీ అభిప్రాయాన్ని మీరు సభలో చెబుతున్నారు. ప్రజలు అందరూ మన తాలూకా వైఖరిని గమనిస్తున్నారు. ఇది దురదృష్టకర పరిణామం'' అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios