Asianet News TeluguAsianet News Telugu

అదో విప్లవాత్మక పథకం...ఆ పేరే ఎందుకు పెట్టామంటే: మంత్రి కన్నబాబు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసలతో ముంచెత్తారు. విప్లవాత్మక పథకాలను దేశంలోను  మొదటిసారి ప్రవేశపెడుతున్న ఏకైక నాయకుడు జగన్ అంటూ ఆకాశానికెత్తారు. 

AP Assembly: Kurasala Kannababu Speaks About Amma Vodi Scheme
Author
Amaravathi, First Published Jan 21, 2020, 5:49 PM IST

అమరావతి: అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై మంత్రి కురసాల కన్నబాబు ప్రసంగించారు. దేశంలో విప్లవాత్మకమైన పథకానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలోనే జగనన్న అమ్మ ఒడి పథకం అనేది ఒక సంస్కరణగా కన్నబాబు అభివర్ణించారు. ఇది ఒక విప్లవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.  

ఈ రాష్ట్ర భవిష్యత్‌ను, భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దే క్రమంలో నిర్ధేశించగలిగే పధకమని నిస్సందేహంగా చెప్పగలను అని మంత్రి పేర్కొన్నారు. అమ్మ ఒడి పుట్టిన ప్రతిబిడ్డకూ తొలిబడి అవుతుందన్నారు. అందుకే ఇంత గొప్ప పథకానికి అమ్మ ఒడి అని పేరు పెట్టడం జరిగిందని కన్నబాబు వివరించారు. 

అమ్మ ఒడిలో హాయి, ప్రేమ దొరుకుతుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 72,77,387 పిల్లలు అమ్మ ఒడి పథకం కింద 62,518 పాఠశాలల్లో నమోదైనట్లు కన్నబాబు తెలిపారు. వీటిలో 47,273 ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలలు అయితే 15,245 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.

read more  జగన్ మొండోడు... ఎవరి మాట వినడు: మహిళా మంత్రి ఆసక్తికర కామెంట్స్

ఏపీ అక్షరాస్యతలో 67.35% ఉందని... మహిళల అక్షరాస్యత 59.96% మాత్రమే ఉందని కన్నబాబు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచంలో మన మానవవనరులు పోటీ పడేస్థాయికి తీసుకురావాలంటే నిరక్షరాస్యతను పారదోలాలి అనే ఒకే ఒక్క సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌ అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కన్నబాబు అన్నారు. 

తల్లులకు సహాయం చేసి తల్లులకు ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తే తప్ప పిల్లలు సక్రమంగా చదువుకునే పరిస్థితులు వస్తాయనే ఉద్దేశంతో సీఎం ఈ అమ్మ ఒడి పథకాన్ని  ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తారో ఆ పిల్లల అకౌంట్‌లో రూ.15,000లు ప్రతి సంవత్సరం వేస్తానని చెప్పి ఎన్నికలు ముందు ఒక మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో జగన్‌ నెరవేర్చారని.. ఇది సామాన్యమైన పథకం కాదని కురసాల కన్నబాబు తెలిపారు. 

ఈ కార్యక్రమం గురించి ఒకరకంగా చెప్పాలంటే గొప్ప సంస్కరణ అనొచ్చని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు కాకుండా జూనియర్‌ ఇంటర్‌ వరకు చదివేవారి వరకు ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్ లోప్రభుత్వం డబ్బులు వేస్తుందన్నారు. ఇది జనవరి 9వ తేదీ సంక్రాంతి ముందు చదువుల పండుగకు శ్రీకారం చుట్టారన్నారు. 

read more  ఇది చారిత్రాత్మక నిర్ణయం... ఇప్పటికైనా మద్దతివ్వండి: టిడిపిని కోరిన సీఎం జగన్

దీనివల్ల ఎంత ఖర్చు అవుతోంది? ఎంత వారికి సాయం చేస్తున్నామన్నది కాకుండా భవిష్యత్‌లో నిరక్షరాస్యత లేని ఆంధ్రప్రదేశ్‌ను సృష్టించటానికి ప్రపంచంలో గొప్ప మానవవనరులను సృష్టించటానికి ఒక పునాదిని సీఎం వేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. 

అర్హత గల విశిష్ట తల్లులను గుర్తిచంటానికి ఐఎఫ్‌సీ కోడ్‌ పొందటానికి ప్రత్యేకమైన డ్రైవ్‌ నిర్వహించామని తెలిపారు. తద్వారా ఎంత మంది అర్హులు ఉన్నారో తేల్చామన్నారు. మొన్న జనవరి 8వ తేదీకి 42,04,955 తల్లులను సంరక్షులుగా, లబ్ధిదారులుగా ఎంపిక చేశారని కన్నబాబు తెలిపారు. దీంట్లో 7,231మంది అనాధ విద్యార్థులు ఉన్నారని.. వీరికి తానే తండ్రిని, తల్లిని అవుతానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలబడ్డారు. ఇలా అనాథాశ్రమంలో చదువుకునేవారికి కూడా రూ.15,000 ఇస్తామని చెప్పి సగం డబ్బులు ఆ పిల్లల అకౌంట్‌లో వేసి మిగిలిన డబ్బులు ఆ సంరక్షుల అకౌంట్‌లో వేశారని తెలిపారు. 

ఇలా ప్రతి సంవత్సరం పిల్లల అకౌంట్‌లో వేస్తే భవిష్యత్‌లో వారి చదువుకు, వారి అవసరానికి అది ఉపయోగపడుతుందని సూక్ష్మంగా సీఎం ఆలోచించారని కన్నబాబు కొనియాడారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios