విదేశీ కరెన్సీ సహా... విజయవాడలో కోట్లల్లో పట్టుబడ్డ హవాలా సొత్తు
రాష్ట్రంలో హవాలా వ్యవహారం నరసాపురం టు హైదరాబాద్ వయా విజయవాడ మీదుగా సాగుతున్నట్లు సమాచారం.
కృష్ణా జిల్లా విజయవాడలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు భవానిపురం ప్రాంతంలో ఓ కారును పట్టుకున్నారు. అందులో తరలిస్తున్న దాదాపు రూ.1.50 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి లెక్కాపత్రం లేని ఈ డబ్బను హవాలా మార్గంలో తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రాష్ట్రంలో హవాలా వ్యవహారం నరసాపురం టు హైదరాబాద్ వయా విజయవాడ మీదుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు తమకు సమాచారం అందడంతో హవాలా ముఠాను పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పక్కా సమాచారంతో వాహనాల తనిఖీ జరిపినట్లు... ఓ కారులో రూ.కోటి 40 లక్షల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షల విలువ చేసే 30 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఓ బంగారు వ్యాపారితో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్కు హవాలా సొమ్మును తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.