తెలంగాణలో మద్యం షాపులను తెరవడానికి సర్కార్ మొగ్గు, కారణాలివేనా....?
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం నిర్ణయించాయి. ఇప్పటివరకు అమలుచేస్తున్న కఠిన ఆంక్షలను సోమవారం (మే 4వ తేదీ) నుంచి సడలించాయి.
తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దు పంచుకుంటున్న మొత్తం మూడు రాష్ట్రాలు సోమవారం నుంచి మద్యం షాపులను తెరవాలని నిర్ణయించాయి. అమల్లో కష్టమైనా, ఆర్థికంగా నష్టమైనా మద్య నియంత్రణ పాటిస్తున్న తెలంగాణను ఇది తీవ్ర సంకటంలోకి నెట్టింది. తానూ ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండలేని అనివార్య పరిస్థితిని కల్పించాయి.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదివారం నిర్ణయించాయి. ఇప్పటివరకు అమలుచేస్తున్న కఠిన ఆంక్షలను సోమవారం (మే 4వ తేదీ) నుంచి సడలించాయి.
సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు మద్యం దుకాణాలు తెరిచేలా ఉత్తర్వులు జారీచేశాయి. మూడు పొరుగు రాష్ట్రాల ఈ నిర్ణయం.. తెలంగాణపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇప్పటికీ మద్యం దుకాణాల మూసివేతకే తెలంగాణ కట్టుబడి ఉంటే.. పొరుగు రాష్ర్టాల నుంచి మద్యం స్మగ్లింగ్‌కు దారితీసే ప్రమాదం కనిపిస్తున్నది. ఆ ముసుగులో కల్తీ మద్యం రాకకూ దారులు తెరుచుకొని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ఒకరోజు ముందు నుంచే (మార్చి 22) తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచే రాష్ట్రంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసేసింది. మందు బాబుల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ప్రజలను కరోనా నుంచి కాపాడటమే ధ్యేయంగా నిక్కచ్చిగా తన నిర్ణయాన్ని అమలుచేసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన అనేక మద్యం షాపులను సీజ్ చేసింది. జరిమానాలు విధించింది.
ఎక్సైజ్‌శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున 50-60 కోట్ల రూపాయల చొప్పున నెలకు రెండువేల కోట్ల దాకా ఆదాయం వస్తుంది. గత 42 రోజుల లాక్‌డౌన్ వల్ల ప్రభుత్వం కేవలం మద్యం దుకాణాల నుంచే ప్రభుత్వం రూ.3 వేల కోట్ల దాకా రాబడిని కోల్పోయింది.
పైసలు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. ప్రాణాలు పోతే తీసుకురాగలమా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వ ఆదాయాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డారే తప్ప, కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాలకు సడలింపులు ఇవ్వడానికి అంగీకరించలేదు.
రాష్ట్రంలో ఎప్పుడో కనుమరుగైన గుడుంబా తయారీ ఇదే అదనుగా మళ్లీ మొదలైంది. మందుకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వారి బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు గుడుంబా తయారీదారులు మళ్లీ బట్టీలను ముట్టించారు.
సాధారణ ప్రజల ఆరోగ్యాలకు పెను ముప్పుగా తయారైన గుడుంబా తయారీని తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. దశలవారీగా దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గుడుంబా తయారీదార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లుచేసింది. దీంతో వారు కూడా ఈ వృత్తిని దాదాపుగా మానుకున్నారు.
కానీ లాక్‌డౌన్‌లో ఇతర ఆదాయాలు లేకపోవడం.. మద్యం దుకాణాలు బంద్‌కావడం వల్ల ఏర్పడిన పరిస్థితిని సొమ్ముచేసుకోవడానికి గుడుంబా తయారీదార్లు మళ్లీ పాత వృత్తివైపు దృష్టి సారించారు. దీంతో గుడుంబా కట్టడికి ఇప్పటిదాకా చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే పరిస్థితి దాపురించింది. అయినా దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దాడులు జరిపి, బట్టీలను ధ్వంసంచేస్తున్నది.
లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే, పలు సడలింపులిస్త్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు మద్యం దుకాణాలు తెరిచేందుకు నిర్ణయించడం తెలంగాణకు ఇరకాట పరిస్థితిని సృష్టించింది. కీలమైన విషయమేమిటంటే ఈ మూడూ తెలంగాణకు సరిహద్దు రాష్ర్టాలు. ఆ రాష్ర్టాల్లో మద్యం దుకాణాలు తెరిస్తే, అది సరిహద్దులు దాటి, అక్రమ మార్గాలు, డొంకదార్ల గుండా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది.
మూడు రాష్ట్రాలతో సుదీర్ఘమైన సరిహద్దు ఉన్న దృష్ట్యా పొరుగు మద్యాన్ని మొత్తానికి మొత్తం రాకుండా ఆపడం అంత సులువుకాదు. అలా బ్లాక్‌మార్కెట్లో వచ్చేది అధిక ధరలకు అమ్ముడవుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజల జేబులు గుల్ల కావడం ఖాయం. అంతే కాదు.. ప్రభుత్వం పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతుంది.
పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చామనే పేరుతో రాష్ట్రంలోనే కల్తీ మద్యాన్ని తయారుచేసి అమ్మితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం మొదట్నుంచీ లాక్‌డౌన్‌కు దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాలు అమలు చేయాలని సూచిస్తూ వచ్చింది.
కానీ ఇది జరగలేదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల మద్యం దుకాణాలకు అనుమతించడంతో తెలంగాణ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి.. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పూర్తిగా మూసేయడం. రెండు.. రాష్ట్రంలోనూ మద్యం దుకాణాలు నిర్దుష్ట వేళల్లో తెరిచేందుకు అనుమతివ్వడం. వలస కార్మికులు, ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో సరిహద్దులను పూర్తిగా మూసివేయడం సాధ్యం కాకపోవచ్చు.
ఇక రెండోది మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించడం. దీనివల్ల పొరుగు మద్యం రాకను నిరోధించవచ్చు. బ్లాక్‌మార్కెటీర్లకు వెళ్లే రాబడిని రాష్ట్ర ఖజానాకు మళ్లించవచ్చు. అదే సమయంలో మళ్లీ తలెత్తుతున్న గుడుంబా మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం షాపులను తెరిచే దిశగా అడుగులు వేసేలా కనబడుతుంది.