లాక్ డౌన్ వేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎలా రూపు మారిందో చూడండి
హైదరాబాద్ లోని మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్ డౌన్ తరువాత, ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా వైరస్ నుండి వారిని వారు రక్షించుకునేందుకు వీలుగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం కోసం ఏర్పాట్లను చేసింది.
కరోనా మహమ్మారి దెబ్బకు భారత దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తొలిసారి విధించిన లాక్ డౌన్ ను రెండవదఫా పొడిగించారు కూడా. అలా పొడిగించిన లాక్ డౌన్ కూడా మరో 9 రోజుల్లో ముగియనుంది(తెలంగాణాలో మే 7వతేది అనుకోండి).
ఈ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ తరువాత ప్రజల దైనందన జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని అందరూ చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే మనం మనకందరికీ ఎంతో అలవాటైన షేక్ హ్యాండ్ ను పూర్తిగా మానేశాము.
బయట ఎక్కడ పడితే అక్కడ ఉమ్మే మన జనం చాలా వరకు దాన్ని కూడా తగ్గించుకున్నారు. మాస్కులను ధరిస్తున్నారు. ఇంతకుముందు తినేటప్పుడు కూడా చేతులు కడగడానికి బద్ధకించే మన జనాలు ఇప్పుడు తరచుగా చేతులను కడుగుతూ హైజీన్ ని పాటిస్తున్నారు.
లాక్ డౌన్ తరువాత మన జీవితంలో మనం ఊహించని ఎన్నో మార్పులు రావడం ఖాయంగా కనబడుతుంది. ఇంతకు మునుపులా బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు ఉండకపోవచ్చు. ఆఫీస్ లో ఒకరినొకరు పలకరించుకోవడానికి చేసుకునే ఆలింగనాల ఊసే ఉండకపోవచ్చు కూడా.
లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా కరోనా వైరస్ మనల్ని వదిలైతే పోదు కాబట్టి మనం ఆ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉంటూ సోషల్ డిస్టెంసింగ్ పాటించడమే మార్గం. ఇందుకు తగ్గట్టుగానే బయట కూడా అలంటి ఏర్పాట్లే చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని జన సమ్మర్ధ ప్రాంతాల్లో ప్రజలమధ్య భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్ డౌన్ తరువాత, ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా వైరస్ నుండి వారిని వారు రక్షించుకునేందుకు వీలుగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం కోసం ఏర్పాట్లను చేసింది.
ఎయిర్ పోర్టుల్లో మనం చెక్ ఇన్ అయ్యే దగ్గర ఎప్పటిలాగే ఉండే క్యూ లైన్లలో డబ్బాలను గీశారు. ఒక్కో డబ్బా మధ్య గ్యాప్ ను వదిలారు. ఇలా గ్యాపులు ఉండడం ద్వారా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం మెయింటైన్ చేయడం తేలికవుతుంది.
ఎయిర్ పోర్టులో చాలా చోట్ల పాదాల బొమ్మలను నేలపైన స్టిక్కర్లుగా అతికించారు. దాని పక్కన మెయింటైన్ సోషల్ డిస్టెంసింగ్ అని రాసారు. ఇలా విమానాశ్రయం లో చాలా చోట్ల అతికించారు. కొన్నిసార్లు ప్రయాణీకులు మరిచిపోయినా వాటిని చూసి భౌతిక దూరం గుర్తొస్తుంది. రానురానూ అది వారిలో భాగమయిపోతుంది.
ఇకపోతే కూర్చునే కుర్చీల్లో కూడా కుర్చీకి కుర్చీకి మధ్య గ్యాప్ వదిలారు. అక్కడ కూర్చోవద్దు అన్నట్టుగా బొమ్మను కూడా వేశారు. ఎయిర్ పోర్ట్ లాంజ్ లో వెయిటింగ్ ఏరియాలో అన్ని చోట్లా ఉన్న కుర్చీల్లో ఈ బొమ్మలు మనకు కనబడుతాయి.
ఇక పోతే, విమానం దిగాక మనం బయటకు వచ్చే దగ్గర ఉండే క్యాబ్ బుకింగ్ పాయింట్ల దగ్గర కూడా డబ్బాలను గీశారు. ప్రయాణీకులు క్యాబ్ లను బుక్ చేసుకోవడానికి ఆ డబ్బాలలో మాత్రమే నిలబడాల్సి ఉంటుంది.
లాక్ డౌన్ తరువాత అయినా మనం వాక్సిన్ వచ్చే వరకు లేదా మందు కనుక్కునే వరకు ఈ కరోనా మహమ్మారితో సహవాసం చేయక తప్పదు. ఎలాగూ ఆ వైరస్ తో పాటు ఒకే సమాజంలో జీవించాలి కాబట్టి, ఆ మహమ్మారి బారి నుండి మనల్ని మనం సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖ ద్వారా మాత్రమే కాపాడుకోగలం.