గుడ్‌న్యూస్: సిటీలో వచ్చే నెలలో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యే ఛాన్స్
లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రో రైలు సర్వీసులు జూన్ మాసంలో ప్రారంభమయ్యే ఛాన్స్ కన్పిస్తున్నాయి.ఈ మేరకు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే నెలలో హైద్రాబాద్ లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా మెట్రో రైలు సర్వీసులను ప్రారంభించేందుకు మెట్రో రైలు సంస్థ సన్నాహలు చేస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ప్రజా రవాణా వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేశాయి. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ, మెట్రో రైలు సర్వీసులు తెలంగాణలో నిలిచిపోయాయి. అయితే ప్రతి ఆర్టీసీ బస్సు డిపోలో ప్రతి రోజూ 5 బస్సులను సిద్దంగా ఉంచుతున్నారు. మరో వైపు రెండు మెట్రో రైళ్లను కూడ ఇదే తరహాలో సిద్దం చేసి ఉంచారు
లాక్ డౌన్ ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది.ప్రజా రవాణాపై కూడ త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. ప్రైవేట్ ఆపరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నడిపే విషయంలో ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం బస్సు డిపోల మేనేజర్లతో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ అభిప్రాయాలను సేకరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు సన్నాహలు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ప్రతి మెట్రో రైలులో కనీసం వెయ్యి మంది ప్రయాణం చేసే వీలుంటుంది. అయితే భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 500 నుండి 600 మంది ప్రయాణీకులను మాత్రమే అనుమతించాలని భావిస్తోంది.
ప్రతి మెట్రో రైల్వేస్టేషన్ లో రైలు ఆగేది. అయితే రద్దీ అంతగా లేని రైల్వే స్టేషన్లలో రైలును నిలిపే ఛాన్స్ ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పెద్ద స్టేషన్లలో మాత్రమే రైళ్లను నిలిపితే ఎలా ఉంటుందనే విషయమై కూడ అధికారులు చర్చిస్తున్నారు.
నగరంలో ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 69 కి.మీ మార్గంలో మెట్రో రూటు అందుబాటులో ఉంది. ప్రయాణికులు సుమారు 4.5 లక్షలకు చేరుకున్న తరుణంలోనే లాక్‌డౌన్ విధించడంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి.
జూన్‌లో తిరిగి ప్రారంభించినా ఒక్కో రైలులో పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ..అంటే మూడు బోగీల్లో వెయ్యి మంది ప్రయాణించే వీలుండదు. భౌతిక దూరం విధిగా పాటించాల్సి ఉన్నందున ఒక్కో రైలులో 500–600కు మించి ప్రయాణించడం సాధ్యపడదని అధికారులు చెబుతున్నారు.
ప్రతీ స్టేషన్‌లోకి ప్రవేశించే ప్రయాణికునికి విధిగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి ఒక్కరికి శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. నగరంలో సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ప్రాజెక్టు వ్యయం రూ.3 వేల కోట్లు అదనంగా ఖర్చు చేశారు.
సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు నిలిచిపోవడం, మాల్స్ మూతపడడం వంటివన్నీ మెట్రో ప్రాజెక్టుకు సవాళ్లు విసురుతున్నాయి. ఇక నగరంలో సుమారు 18 మాల్స్ నిర్మించాలనుకున్నప్పటికీ ప్రస్తుతం 4 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం నెలకు రూ.45 కోట్ల ఆదాయంతో లాభం నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలోనే కరోనాతో మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. కిలోమీటరుకు సుమారు రూ.200 కోట్లు వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు మరికొన్నేళ్లపాటు నష్టాలబాట తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.