మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రచారం... స్వగ్రామంలో ఇదీ పరిస్థితి
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత గణపతి రాక దాదాపు ఖరారు అయిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో గణపతి స్వగ్రామం బీర్పూర్ లో ఎలా వుందో ఓసారి చూద్దాం.
కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి జనజీవనంలోకి వస్తే స్వాగతిస్తామని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోలీస్ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. గణపతితో పాటు అతని అనుచరులు రావడానికి రంగం సిద్ధమైంది అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలా జనజీవన స్రవంతిలోకి గణపతి రాక దాదాపు ఖరారు అయిందని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో గణపతి స్వగ్రామం బీర్పూర్ లో ఎలా వుందో ఓసారి చూద్దాం.
30 సంవత్సరాల క్రితం బీర్పూర్ శివారులో జరిగిన భారీ పేలుళ్ల తర్వాత పోలీసులు శాంతి చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే గ్రామంలో శాంతి స్థూపం నిర్మించారు. మావోలు అడవిలో ఉండే ఏమి సాధించలేరని, జన జీవన స్రవంతిలో కలిసి అభివృద్ధి కోసం కలిసి రావాలని కోరారు.
అయితే ప్రస్తుతం గణపతి జనజీవన స్రవంతిలోకి వస్తారన్న వార్తలతో ఇప్పుడు ఆ శాంతి స్తూపం వద్ద కోలాహలం మొదలైంది. గణపతి 43 ఏళ్ల అజ్ఞాతవాసం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తారన్న వార్త విని ఆనందంగా వుందని... ఆయన వల్లే తమ గ్రామం అభివృద్ధి చెందిందని గ్రామస్తులు, యువత అంటున్నారు.
43 సంవత్సరాల క్రితం గ్రామాన్ని వదిలివెళ్లిన గణపతి అంచెలంచెలుగా కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారని... అయితే మావోయిస్టుగా మారినప్పటి నుండి ఇప్పటివరకు చూడలేదని బంధువులు తెలిపారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పార్టీలోకి వెళ్లారు తప్ప ఏనాడు సొంత ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదన్నారు. ప్రస్తుతం ఆయన జనజీవన స్రవంతిలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని బీర్పూర్ ప్రజలు అంటున్నారు.