హైదరాబాదులో పోలీసులపై పిచ్చి ప్రవర్తన, బూతులు: ఇంతకీ ఎవరితను?
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు గడప దాటి బయటకు రాకూడదని ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు గడప దాటి బయటకు రాకూడదని ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు
కొందరు మాత్రం బాధ్యతా లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు అపసోపాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పోలీసులపై బూతుల వర్షం కురిపించాడు.
గురువారం నగరంలోని లంగర్‌హౌస్‌కు చెందిన ఓ వ్యక్తి అకారణంగా బయటకు రావడంతో పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి పోలీసులపై తీవ్ర పదజాలంలో విరుచుకుపడ్డాడు.
తాను ఓ పోలీస్ అధికారి కొడుకునంటూ పోలీసులపైనే తిరగబడ్డాడు. మీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. సహనం నశించిన పోలీసులు ఆ వ్యక్తిని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలో అతను ఎవరా అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి పేరు లోకేశ్ అని కొద్దిరోజుల క్రితమే మద్యం దొరక్క ఎర్రగడ్డలోని డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది
ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఆయన పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో అతనికి మతి స్థిమితం సరిగా లేదని తేలింది. పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ చేసి అనంతరం లోకేశ్‌ను అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఇతను గత రెండు రోజులుగా చనిపోయిన తన భార్య గుర్తొచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.