క్రికెటర్ కాబోయి అథ్లెట్ అయ్యాడు... ఎవరీ అర్షద్ నదీమ్? పాక్ గోల్డ్ భాయ్ స్పూర్తిదాయక స్టోరీ...
అర్షద్ నదీమ్... ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో గట్టిగా వినిపిస్తున్న పేరు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రాను ఓడించి స్వర్ణ పతకం సాధించిన పాక్ అథ్లెట్ సక్సెస్ స్టోరీ ఇదే...
Arshad Nadeem
Arshad Nadeem : ఇండియా, పాకిస్థాన్ మధ్య పోటీ... ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఏ రంగంలో అయినా దాయాది దేశాల పోరంటే కోట్లాదిమంది ఆసక్తిగా గమనిస్తుంటారు. క్రీడల్లో అయితే మరింత ఆసక్తి... భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ వుందంటే ఆరోజు కోట్లాదిమంది టీవీలకు అతుక్కుపోతారు. ఇలాంటి ఆసక్తికర పోరే తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో ఎదురయ్యింది.
Arshad Nadeem
ఒలింపిక్ స్వర్ణం ప్రతి క్రీడాకారుడి కల... ప్రతి దేశం కోరుకునేది ఇదే.అలాంటి పతకానికి అడుగు దూరంలో దాయాదులు నిలిస్తే... ఆ పోరు రసవత్తరం. ఇలా పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో భారత్, పాక్ స్వర్ణం కోసం పోటీపడ్డాయి. చివరకు పాక్ దే పైచేయిగా నిలిచింది... ఆ దేశమే స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. గత ఒలింపిక్స్ లో స్వర్ణంతో మెరిసిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను ఓడించి పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు.
Arshad Nadeem
అయితే మన నీరజ్ చోప్రా స్వర్ణం సాధించకపోవడం... అదీ పాక్ చేతిలో ఓడటం భారతీయులను ఎంతగానో బాధించింది. కానీ పాక్ అథ్లెట్ నదీమ్ ఈ స్థాయికి చేరుకోడానికి పడిన కష్టాల గురించి తెలిసినవారు మాత్రం ఈ పతకానికి అతడు అన్నిరకాలుగా అర్హుడేనని అంటున్నారు. శతృదేశ ఆటగాడు అయినప్పటికీ అతడి సక్సెస్ స్టోరీ భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంటోంది... దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Arshad Nadeem
ఎవరీ అర్షద్ నదీమ్ :
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఖనేవాల్ జిల్లాలోని మియాన్ చున్నున్ లో అర్షద్ నదీమ్ స్వస్థలం. అతడు 1997 జనవరి 2 న ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి మహ్మద్ అష్రాఫ్ భవననిర్మాణ కార్మికుడు. అతడు రోజూ పనికి వెళితేనే కుటుంబానికి మూడుపూటలా భోజనం... లేదంటే అందరూ పస్తులే. నదీమ్ తో పాటు మరో ఆరుగురు పిల్లలు సంతానంగా కలిగిన అష్రఫ్ దంపతులు కుటుంబపోషణ కోసం రెక్కలు ముక్కలయ్యేలా శ్రమించేవారు.
Arshad Nadeem
ఇలాంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన నదీమ్ చిన్ననాటి నుండి క్రీడల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. అతడి ఆసక్తిని గమనించిన టీచర్లు కూడా బాగా ప్రోత్సహించేవారు. ఇలా అతడి క్రీడా జీవితం క్రికెటర్ గా ప్రారంభమయ్యింది. మంచి బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న నదీమ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇలా క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ వంటి వాటిలో కూడా నదీమ్ సత్తా చాటాడు.
Arshad Nadeem
అయితే నదీమ్ లో క్రికెటర్ కంటే మంచి అథ్లెట్ వున్నాడని కోచ్ రషీద్ అహ్మద్ గుర్తించాడు. అతడికి మంచి శిక్షణ అందిస్తే తప్పకుండా దేశం గర్వించదగ్గ అథ్లెట్ అవుతాడని ఆనాడే భావించాడు. దీంతో అన్ని ఆటలను పక్కనబెట్టి గురువు రషీద్ అహ్మద్ పర్యవేక్షణలో కేవలం అథ్లెటిక్స్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టాడు నదీమ్. ఇక్కడా ఓ కన్ఫ్యూజన్ వుండేది... జావెలిన్ త్రో తో పాటు షాట్ ఫుట్, డిస్కస్ త్రో మూడింటిని ప్రాక్టిస్ చేసేవాడు నదీమ్. అయితే జావెలిన్ త్రోలో జిల్లాస్ధాయిలో మెడల్స్ సాధించడంలో దాన్ని కొనసాగించాడు.
Arshad Nadeem
జావెలిన్ త్రో కెరీర్ :
2015 లో నదీమ్ జావెలిన్ త్రో కెరీర్ ప్రారంభమయ్యింది. అతి తక్కువ కాలంలోనే జావెలిన్ త్రో లో అనేక రికార్డులు సాధించి జాతీయస్థాయి అథ్లెట్ గా గుర్తింపు పొందాడు. కానీ గాయాలు, ఆర్థిక కష్టాల కారణంగా అతడి కెరీర్ లో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. పాక్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కాబట్టి క్రీడాకారులకు ఆర్థికసాయం చేసి ప్రోత్సహించేది కాదు. దీంతో ఓ సమయంలో నదీమ్ ను సొంత గ్రామస్తులే చందాలు వేసుకుని ఆర్థిక సాయం చేసారట. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి అష్రాఫ్ వెల్లడించాడు.
Arshad Nadeem
ఎలాగోలా జావెలిన్ త్రో లో మంచి ప్రావిణ్యం సాధించిన నదీమ్ 2016 లో భారత్ లో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్నాడు. ఇక్కడే మొదటిసారి భారత అథ్లెట్ తో నదీమ్ పోటీపడ్డాడు. ఈ పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించగా నదీమ్ కాంస్యం సాధించాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో సీన్ రివర్స్ అయ్యింది... నదీమ్ స్వర్ణం, నీరజ్ కాంస్యం సాధించాడు.
Arshad Nadeem
ప్రస్తుత ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించడం వెనక కూడా అనేక కష్టాలు దాగివున్నాయి. 2022 కామన్ వెల్త్ గేమ్స్ లో నదీమ్ జావెలిన్ ను 90 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు.దీంతో అతడి ఒలింపిక్స్ పతక ఆశలు చిగురించాయి. కానీ పాకిస్థాన్ పరిస్థితి కారణంగా అతడు ఒలింపిక్స్ కు వెళతాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు పాక్ నదీమ్ తో పాటు మరో ఏడుగురు క్రీడాకారులను పారిస్ కు పంపించగలిగింది. వీరిలో ఆరుగురు ఫైనల్ కు అర్హత సాధించకపోగా... నదీమ్ మాత్రం ఏకంగా అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు.