టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళా హాకీ జట్టు... కాంస్య పతక పోరుకి...
టోక్యో ఒలింపిక్స్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్తో సెమీస్ చేరిన భారత మహిళా హాకీ జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. టాప్ టీమ్ అర్జెంటీనాపై అద్భుత పోరాటం చూపించినా, విజయం మాత్రం దక్కించుకోలేకపోయింది.
వరల్డ్ నెం.2 హాకీ టీమ్ అర్జెంటీనాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు 2-1 తేడాతో ఓడింది.
ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన గుర్జీత్ కౌర్ గోల్‌గా మలిచి 1-0 తేడాతో టీమిండియాకి ఆధిక్యాన్ని అందించింది...
తొలి క్వార్టర్స్‌లో అర్జెంటీనా గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను టీమిండియా తిప్పి కొట్టింది. అయితే రెండో క్వార్టర్లో 18వ నిమిషంలో లభించిన మూడో పెనాల్టీ కార్నర్‌ను చక్కగా ఉపయోగించుకున్న నోయల్ బరినోవో గోల్ సాధించి 1-1 తేడాతో స్కోర్లను సమం చేసింది...
మూడో క్వార్టర్లో 36వ నిమిషంలో గోల్ సాధించిన నోయల్ రెండో గోల్ సాధించడంతో అర్జెంటీనా 2-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ ఆధిక్యాన్ని నిలుపుకున్న అర్జెంటీనా, భారత జట్టును గోల్ చేయకుండా నియంత్రించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
సెమీ ఫైనల్లో ఓడిన భారత హాకీ జట్టు, కాంస్య పతక పోరులో తలబడబోతున్నాయి. భారత పురుషుల హాకీ జట్టు, జర్మనీతో, మహిళా జట్టు గ్రేట్ బ్రిటన్‌తో కాంస్య పతకం కోసం పోటీపడనున్నాయి.