టోక్యో ఒలింపిక్స్: మను బకర్‌ను ఇబ్బందిపెట్టిన పిస్టల్... ఆ సమస్య కారణంగానే...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు కనీసం ఒక్క గోల్డ్ మెడల్ తెస్తారనే ఆశలు ఉండేవి. అయితే భారత ఆర్చరీ జట్టులాగే షూటర్లు కూడా ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యారు. భారత యంగ్ స్టార్, వరల్డ్ నెం.2 మను బకర్ కూడా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.
19 ఏళ్ల మను బకర్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ క్వాలిఫికేషన్ రౌండ్లో మొదటి సిరీస్‌లో అద్భుతంగా 98 పాయింట్లు స్కోరు చేసిన మను బకర్కి రెండో సిరీస్‌లో పిస్టల్ ఇబ్బంది పెట్టింది.
పిస్టర్ సర్కిట్ మాల్ఫంక్షన్ కావడంతో రెండో సిరీస్ మధ్యలో ఆమె పిస్టల్‌ను మార్చాల్సి వచ్చింది. కోచ్ దగ్గరికి వెళ్లి పిస్టల్‌ను పరీక్షించి, ఆ తర్వాత జ్యూరీ సభ్యుల దగ్గర రిప్లేస్‌మెంట్‌కి అనుమతి తీసుకుని కాంపిటీషన్ ఏరియాకి తిరిగి రావాల్సి వచ్చింది.
ఇదంతా జరిగే లోపు ఆమె అత్యంత విలువైన 5 నిమిషాల సమయాన్ని కోల్పోయింది దీంతో ఆ ఒత్తిడి ఆమెలో స్పష్టంగా కనిపించింది. సమయం కోల్పోయాననే టెన్షన్, ప్రెజర్ కారణంగా మూడో సిరీస్‌లో 94 పాయింట్లే సాధించిన మను బకర్, నాలుగో సిరీస్‌లో 95 పాయింట్లు సాధించింది.
ఐదో సిరీస్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన మను బకర్ 98 పాయింట్లు స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. ఫైనల్ సిరీస్‌లో ఆఖరి షాట్‌కి 10 పాయింట్లు స్కోరు చేయాల్సి ఉండగా, 8 పాయింట్లే చేయగలిగింది మను...
మొత్తంగా 575 పాయింట్లతో క్వాలిఫికేషన్స్ రౌండ్లో 12వ స్థానంలో నిలిచిన మను బకర్, ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయింది. ఆమెతో పాటు బరిలో దిగిన వరల్డ్ నెం.1 భారత షూటర్ యశస్వి కూడా 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది.
టెక్నికల్ సమస్య కారణంగా ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయిన భారత యంగ్ షూటర్ మను బకర్పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ మొదలైంది. వరల్డ్ టాప్ 2లో ఉన్న భారత షూటర్లు, ఒలింపిక్‌లో ఒత్తిడిని అధిగమించలేకపోయారంటూ విమర్శలు వస్తున్నాయి.
అయితే భారత సీనియర్ షూటర్ హీనా సిధు, యంగ్ షూటర్ మను బకర్కి మద్ధతుగా నిలిచింది. ‘ఒత్తిడి కారణంగా మను బకర్ సరిగా రాణించలేకపోయిందని జనాలు మాట్లాడుతున్నారు. అసలు ఆమె పిస్టల్‌కి ఏమైంది, ఆ కారణంగా ఆమె ఎంత సమయాన్ని కోల్పోయిందనే విషయాలను నేను తెలుసుకున్నాను. 34 నిమిషాల్లో 575 పాయింట్లు సాధించిందంటే అది చాలా మంచి రికార్డు. పోటీ మధ్యలో పిస్టల్ ఇబ్బంది పెట్టినాఆమె చివరి షాట్ దాకా పోటీలో నిలిచిదంటే తన టాలెంట్ అర్థం చేసుకోవచ్చు. తెలిసీ తెలియకుండా అథ్లెట్లను ఇలా అవమానించకండి...’ అంటూ ట్వీట్లు చేసింది హీనా సిధు.
19 ఏళ్ల మను బకర్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్‌కప్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన అతిపిన్న భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2018లోనూ స్వర్ణం సాధించిన ఆమె, యూత్ ఒలింపిక్స్‌లోనూ రెండు పతకాలు సాధించింది.