టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు పీవీ సింధు దూరం... 127 మందిలో 20 మంది మాత్రమే...
టోక్యో ఒలింపిక్స్ 2020 కోసం భారత్ నుంచి రికార్డు స్థాయిలో 127 మంది అథ్లెట్లు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే నేటి సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకల్లో మాత్రం కేవలం 20 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొనబోతున్నారు. దీనికి కారణం కరోనా ప్రోటోకాల్స్ అమలులో ఉండడమే.
టోక్యో ఒలింపిక్ స్పోర్ట్స్ విలేజ్‌లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. దీంతో ప్రారంభ వేడుకలకు పరిమిత సంఖ్యలో అథ్లెట్లు హాజరుకావాలని నిబంధనను అమలులోకి తెచ్చారు నిర్వహాకులు.
భారత సీనియర్ బాక్సర్ మేరీకోమ్, హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, ఒలింపిక్ మార్చ్‌లో భారత్‌కి ప్రాతినిధ్యం వహించబోతున్నారు.
ఒక్కో స్పోర్ట్స్ నుంచి ఒక్కో ప్లేయర్ ఈ మార్చ్‌కి రావొచ్చని సూచించింది ఒలింపిక్ కమిటీ. అయితే చాలాసేపు ఎదురుచూస్తూ నిల్చోవడం, సుదీర్ఘ సమయం పాటు మార్చ్‌లో గడపాల్సి ఉండడం వల్ల ప్రారంభవేడుకల్లో పాల్గోవడం లేదని పీవీ సింధు తెలియచేసింది.
సింధుతో కొందరు షూటర్లు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కో స్పోర్ట్స్ నుంచి ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు ఒలింపిక్ ఓపెనింగ్ మార్చ్‌లో పాల్గొనబోతున్నారు.
టేబుల్ టెన్నిస్ నుంచి సుతీర్థ ముఖర్జీ, మానికా బత్రా, జీ సత్యన్, శరత్ కమల్, సెయిలింగ్ నుంచి కేసీ గణపతి, వరుణ్ అశోక్, విష్ణు శరవణ్, నేత్ర కుమారన్, ఫెన్సింగ్ నుంచి భవానీ దేవి, జిమ్నాస్టిక్స్ నుంచి ప్రణతి నాయక్, స్విమ్మింగ్ నుంచి సజన్ ప్రకాష్, బాక్సింగ్ నుంచి సిమ్రాన్‌జిత్ కౌర్, లవ్లీనా, పూజా రాణి, అమిత్, మనీశ్ కౌశిక్, సతీశ్ కుమార్, మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పాల్గొనబోతున్నారు. జపనీస్ అల్ఫాబెటిక్స్ ప్రకారం మార్చ్‌లో భారత స్థానం 21.