షూటర్ మను బాకర్‌కి ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం... రైఫిల్స్ ఉన్నాయని అడ్డుకున్న అధికారులు...
భారత షూటర్ మను భాకర్‌ను చేదు అనుభవం ఎదురైంది. ట్రైనింగ్ కోసం భోపాల్ వెళ్తున్న ఆమెను, ఎయిర్ పోర్ట్ అధికారులు నిలిపివేశారు. రైఫిల్స్ ఉన్నాయనే కారణంగా ఆమెను నిలిపివేసిన అధికారులు, వాటికి తగిన అనుమతి పత్రాలు చూపించినా కూడా వదలలేదు. తనకి ఎదురైన ఈ అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజుజుకి తెలియచేసింది మను బకర్...
19 ఏళ్ల మను బకర్, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్‌కప్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన అతిపిన్న భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2018లోనూ స్వర్ణం సాధించిన ఆమె, యూత్ ఒలింపిక్స్‌లోనూ రెండు పతకాలు సాధించింది.
‘మధ్యప్రదేశ్ షూటింగ్ అకాడమీకి ట్రైనింగ్ కోసం వెళ్తున్నా. ఇందుకోసం పిస్టల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా అధికారులు ఆటగాళ్లకి కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. కనీసం గౌరవించకపోయినా పర్లేదు, ఇలా అవమానించకండి.
మమ్మల్ని డబ్బులు అడగకండి. నా దగ్గర కావాల్సిన అనుమతులన్నీ ఉన్నాయి...’ అంటూ పోస్టు చేసింది మను బకర్. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా, నన్ను బోయింగ్ ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. డీజీసీఏ ఇచ్చిన అనుమతి పత్రాలను ఇక్కడ ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి మనోజ్ గుప్తా, ఏ మాత్రం గుర్తించడం లేదు...’ అంటూ నరేంద్ర మోదీ, అమిత్ మిశ్రా, వసుంధర రాజే వంటి నాయకులను ట్యాగ్ చేసిన మను బకర్, లంచం ఇవ్వమంటారా అంటూ ప్రశ్నించింది...
ఆ తర్వాత కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుని ట్యాగ్ చేసి... ‘నా దగ్గర రెండు గన్స్ ఉన్నాయని నన్ను ఇలా విమానం ఎక్కకుండా ఆపేసి, అవమానిస్తున్నారు...’ అంటూ పేర్కొంది మను బకర్...
‘ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం సహించ లేనిది. మనోజ్ గుప్తా కనీసం మనిషిలా కూడా ప్రవర్తించడం లేదు. నన్ను ఓ నేరస్థురాలిగా ట్రీట్ చేస్తున్నాడు... అతనితో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా కనీసం గౌరవం లేకుండా అవమానిస్తున్నారు... ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, అతన్ని సరైన ప్లేస్‌కి పంపించాలి’ అంటూ మరో పోస్టు చేసింది మను బకర్.
మను బకర్ పోస్టులకు స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు, అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు ‘థ్యాంక్యూ కిరణ్ రిజుజు సర్.. మీ అందరి స్ట్రాంగ్ సపోర్ట్ కారణంగా నేను ఫ్లైట్ ఎక్కాను. థ్యాంక్యూ ఇండియా. జై హింద్’ అంటూ పోస్టు చేసింది మను బకర్.
‘ఎయిర్ ఇండియా, మనోజ్ గుప్తా లాంటి వాళ్లను రక్షించాలని చూస్తే, అది సంస్థ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది. వాళ్లు నా మొబైల్ లాక్కుని, నన్ను వేధిస్తున్నప్పుడు మా అమ్మ తీసిన ఫోటోను బలవంతంగా డిలీట్ చేశారు. సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ట్యాగ్ చేస్తూ పోస్టు చేసింది మను...
మను బకర్కి ఎదురైన అనుభవంపై భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి స్పందించింది. ‘మను బకర్ నీకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం దురదృష్టకరం. ఎయిర్ ఇండియాలో ఉద్యోగిగా, ప్రయాణికురాలిగా నాకు మంచి అనుబంధం ఉంది. క్రీడలను, క్రీడాకారులను గౌరవించడంలో ఎయిర్ ఇండియా ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉంటుంది’ అంటూ ట్వీట్ చేసింది జులన్ గోస్వామి...
మను బకర్ పోస్టులపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘డియర్ మిస్ బకర్... మీరు ఆయుధం తీసుకెళ్తుండడంతో దానికి తగిన అనుమతి పత్రాలు చూపించాలని మాత్రమే అధికారులు కోరారు. పత్రాలు లేకపోతే, అందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ జరిమాని చెల్లించాలని మాత్రమే అధికారులు మిమ్మల్ని కోరారు...
అంతేకానీ ఏ అధికారి లంచం ఇవ్వాలని అడగలేదు. సరైన పత్రాలు చూపించిన వెంటనే మిమ్మల్ని బోర్డింగ్ పాయింట్‌కి చేర్చడం జరిగింది. మిమ్మల్ని విమానం ఎక్కేందుకు అనుమతించాం. ఎయిర్ ఇండియా ఎప్పుడూ క్రీడాకారులను గౌరవిస్తుంది... చాలామంది క్రీడాకారులు మాతో కలిసి పని చేస్తున్నారు’ అంటూ పేర్కొంది ఎయిర్ ఇండియా.