భారత మాజీ అథ్లెట్ మిల్కా సింగ్‌కి కరోనా పాజిటివ్... ‘బాగ్ మిల్కా బాగ్’ హీరో 91 ఏళ్ల వయసులో...
భారత మాజీ అథ్లెట్, స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారు. 91 ఏళ్ల మిల్కా సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, తనకి హై ఫివర్‌గా ఉండడంతో ఐసోలేషన్‌లో ఉంచినట్టు ఆయన భార్య నిర్మలా కౌర్ తెలిపారు. ఛంఢీఘర్‌లో మిల్కా సింగ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
‘కొన్నిరోజుల క్రితం మా ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మేం అందరం కూడా టెస్టులు చేయించుకున్నాం. ఆయనకి నిన్న రాత్రి నుంచి హై ఫివర్ ఉంది. అయితే రుచి తెలుస్తుంది, వాసన కూడా గుర్తుపడుతున్నారు...’ అని మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్ తెలియచేశారు.
‘నేనిప్పుడు చాలా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉన్నాను... బుధవారం ఉదయం జాగింగ్‌కి కూడా వెళ్లి వచ్చాను. ఇంటికి వచ్చాక పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని తేలడంతో షాక్ అయ్యాను. నేనిప్పుడు బాగానే ఉన్నాను..’ అంటూ తెలిపాడు మిల్కా సింగ్.
గత ఏడాది కరోనా బాధితుల కోసం మాజీ అథ్లెట్ మిల్కా సింగ్, ఆయన సతీమణి కలిసి రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. రోమ్‌లో జరిగిన 1960 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేసులో ఫైనల్‌కి చేరుకున్న మిల్కా సింగ్... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో మిల్లీ సెకన్ తేడాతో పతకాన్ని కోల్పోయారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా నిలిచిన మిల్కా సింగ్, 1958లో ఈ రికార్డు సాధించారు.
‘ప్లైయింగ్ సిక్’గా గుర్తింపు తెచ్చుకున్న మిల్కా సింగ్... అనేక అవార్డులు దక్కించుకున్నారు. అయితే తన కెరీర్‌లో ఒలింపిక్ పతకం మాత్రం గెలవలేకపోయారు.
మిల్కా సింగ్ జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన ‘బాగ్ మిల్కా బాగ్’ 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ అని మిల్కా సింగ్ రాసిన జీవిత చరిత్ర పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.