శృంగార పాఠాలు... పిల్లలకు ఏం నేర్పుతున్నారు..
శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. అదో బూతు పదంలా, చీకటి వ్యవహారంలా చూస్తుంటారు. అంతెందుకు చిన్నతనంలో పిల్లలు తెలిసీ తెలియక వారి ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకున్నా.. అదో నేరంలా చూసి వాళ్లను మందలిస్తూ ఉంటారు. అయితే.. పిల్లలకు లైంగికత మీద అవగాహన కలిగేలా చేయడం పూర్తిగా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు ప్రతి ఒక్క విషయం తల్లిదండ్రులు దగ్గరుండి మరీ నేర్పుతారు. బుడి బుడి అడుగులు వేసే దగ్గర నుంచి ప్రతి ఒక్క దానిపై శ్రద్ధ చూపిస్తారు.
ఎలా తినాలి..? ఎలా నడవాలి..? ఎలా మాట్లాడాలి..? సైకిల్ ఎలా తొక్కాలి..? కారు ఎలా నడపాలి..? ఇలా ప్రతి విషయం పై వారికి పూర్తి అవగాహన వచ్చేలా చేస్తారు.
కానీ పిల్లల జీవితంలో అతి ముఖ్యమైనది.. తెలుసుకోవాల్సినది శృంగారం, పీరియడ్స్ లాంటి వాటి గురించి మాత్రం వివరించారు.
మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. అదో బూతు పదంలా, చీకటి వ్యవహారంలా చూస్తుంటారు. అంతెందుకు చిన్నతనంలో పిల్లలు తెలిసీ తెలియక వారి ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకున్నా.. అదో నేరంలా చూసి వాళ్లను మందలిస్తూ ఉంటారు. అయితే.. పిల్లలకు లైంగికత మీద అవగాహన కలిగేలా చేయడం పూర్తిగా తల్లిదండ్రులమీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బాలబాలికలకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎలా పంచుకోవాలో అర్థం కాదు. సరిగ్గా ఆ సమయంలోనే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది.
లైంగికత విషయంలో తమకే తగని గందరగోళం ఉంటే, తమలోనే తికమక నెలకొని ఉంటే... పిల్లలకేం చెబుతారు? చెప్పినా, ఇంకాస్త తికమకపెడతారు. మరికొంత గందరగోళపరుస్తారు.
దీనివల్ల నష్టమే ఎక్కువ. అయినా, మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. మనం చెప్పకపోతే, పిల్లలు మరో మార్గంలో తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే విషయం... పూర్తిగా నిజమైంది కాకపోవచ్చు. తమ కళ్లతో చూసింది నిజమనే భ్రమలో ఉండిపోతారు.
కాబట్టి.. పిల్లలకు యుక్త వయసు వచ్చేసరికి వారికి తమలో జరిగే మార్పులు వారికి ముందుగానే తెలియజేయాలి. పీరియడ్స్ గురించి కూడా అమ్మాయిలకు ముందుగానే వివరించి చెప్పాలి. ఆ వయసులో ఏర్పడే ఆకర్షణ, ప్రేమ నిజమో కాదో కూడా చెప్పాలి.
పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చా, యాదృచ్ఛికంగా ఏ ఇబ్బందికరమైన భంగిమలోనో వారికి కనిపిస్తే? పిల్లల ముందు తలెత్తుకోలేని పరిస్థితే వస్తే?... తదితర ప్రశ్నలు వ్యక్తం చేస్తుంటారు చాలామంది.
నిజమే, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఇబ్బందే ఇది. ఆ సమయంలో ఎలా స్పందించాలన్నది పిల్లల వయసును బట్టి ఉంటుంది.
పెద్దల గదిలోకి పిల్లలు వెళ్లినా... అనుమతి తీసుకున్నాకే అడుగువేయడం మంచి పద్ధతి. బాల్యం నుంచీ కొన్ని ప్రాథమికమైన మర్యాదలు నేర్పితే... ఇలాంటి ఇబ్బందులు ఉండనే ఉండవు.