ఫ్రెండ్స్ ముందు మీ భర్తను ఎగతాళి చేస్తే ఏమౌతుందో తెలుసా?
Relationship Tips: భార్యాభర్తల మధ్య బంధం అన్నాక కొట్లాటలు, గొడవలు, అలకలు, ప్రేమ, బుజ్జగింపులు చాలా సహజం. వైవాహిక జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కానీ నలుగురిలో ఒకరినొకరు ఎగతాళి చేసుకోవడం మాత్రం మానుకోవాలి. ముఖ్యంగా భార్యలు భర్తలను వారి స్నేహితుల ముందు ఎగతాళి అస్సలు చేయకూడదు. దీనివల్ల ఏమౌతుందంటే?
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చాలా కామన్. ఈ గొడవలకు ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి. ఇంకొన్ని సార్లైతే ఎవరూ తగ్గకుండా వాదించుకుంటూనే ఉంటారు. ఈ వాదనలకు కూడా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే చాలా మంది భార్యలు వారి భర్త స్నేహితులు వచ్చినప్పుడు భర్త గురించి చెడుగా చెప్తుంటారు. అంటే ఎగతాళి వంటివి చేస్తుంటారు. భర్త చెప్పొద్దా.. అలాగే మనసులో ఉన్నవి చెప్పేస్తుంటారు. కానీ ఈ అలవాటు మీ భర్త స్నేహితుల దృష్టిలో మీ కంటే మీ భర్త ఇమేజ్ నే ఎక్కువగా పాడు చేస్తుంది. అందుకే మీ భర్త స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడల్లా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అసలు వారి స్నేహితుల మందు మీరు మీ భర్తను ఎగతాళి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భర్తను తిట్టడం మానుకోండి
మీ భర్తకు నచ్చని అలవాట్లు ఎన్నో ఉండొచ్చు. కానీ వాటిని వారి స్నేహితుల ముందు డప్పు కొట్టడం, అలాగే వాటిని చూపిస్తూ తిట్టడం మంచిది కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ తర్వాత అదే చూపిస్తూ మీ భర్తను ఎప్పుడూ ఎగతాళి చేయొచ్చు. హేళన చేయొచ్చు. దీనివల్ల వారు గొడవ పడే అవకాశం కూడా ఉంది.
బెదిరించడం మానుకోండి
మీ భర్త వారి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు పదేపదే బెదిరించకండి. ఇది కూడా ఒక రకమైన చెడు ప్రవర్తనే. ఇది మీ ఇద్దరినీ స్నేహితుల మందు తక్కువ చేస్తుంది. అందుకే ఏదైనా సమస్య ఉంటే మీ భర్తను పక్కకు పలిచి చెప్పండి. అంతేకానీ నలుగురిలో వారిని బెదిరించకండి.
పిసినారి
బంధువులు, స్నేహితుల ముందు మీ భర్తను పిసినారి అనే మాటను అనకండి. మీ భర్త ఖర్చు చేయనంత మాత్రానా ఇలా అనడం సరికాదు. మీ భర్త తనకోసం కూడా అవసరమైన వస్తువులను కొనకపోవచ్చు. ఇది మీరు గమనించి ఉండరు. అందుకే ఇతరుల ముందు మీ భర్త అలవాటును ఎగతాళి చేయకండి. ఇది వారిని అవమాన పరుస్తుంది.
కోపగించుకోకండి
మీకు ఇప్పటికే ఏ విషయంలైనా మీ భర్తపై కోపం ఉంటే.. స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు మీ భర్తపై కోపాన్ని చూపించకండి. కానీ ఇలాంటి సమయంలోనే కోపం ఎక్కువగా వస్తుంటుంది. చాలా మంది జంటలు ఇలా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే కోప్పడుతుంటారు. ఒకరిగురించి ఒకరు చాడీలు చెప్పుకుంటారు. తప్పొప్పులను ఎత్తిచూపుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఇది ఇతరుల ముందు మీ గౌరవాన్ని తగ్గిస్తుంది.