తిట్టకుండా, కొట్టకుండా పిల్లల్ని దారిలోకి తీసుకురావడం ఎలా?
పిల్లలు కుదురుగా ఒక్క దగ్గర ఉండరు. కొంటె పనులు చూస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడే మాట వినడం లేదని పేరెంట్స్ పిల్లలపై అరవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ కొన్ని ట్రిక్స్ తో కొట్టకుండా, తిట్టకుండా పిల్లల్ని దారిలోకి తీసుకురావొచ్చు. అదెలాగంటే?
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు మేము చెప్పింది ఖచ్చితంగా వినాలని అనుకుంటారు. అలాగే చేయాలనుకుంటారు. ఒకవేళ వాళ్లు వినకపోతే వెంటనే పిల్లలను తిట్టడమో కోపంగా అరవడమో లేకపోతే కొట్టడమో చేస్తుంటారు. పిల్లలు తప్పులు చేసినప్పుడు తిట్టడం తప్పేం కాదు. కానీ కొంతమంది తల్లిదండ్రులు ప్రతిదానికీ అరుస్తుంటారు. అరవడం, తిట్టడం వల్లే పిల్లలు మాట వింటారు అనుకుంటారు. కానీ ఇది మీ భ్రమే. అంతేకాక ప్రతి విషయానికి మీరు వారిపై అరిస్తే పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మీ తిట్లు వారిని ఎంతో బాధపెడతాయి. ముఖ్యంగా ఇతరుల ముందు మీ పిల్లలపై అరిస్తే వారికి ఎంతో బాధకలుగుతుంది.
ఇక కొంతమంది తల్లిదండ్రులు మంది ముందు పిల్లలపై ఎందుకు అరిచానని ఫీలవుతుంటారు. అయితే తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను ఫాలో అయితే అరవకుండా, తిట్టకుండా, కొట్టకుండా పిల్లలను మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చెప్పేది వినండి
చాలా మంది పేరెంట్స్ కు ఈ అలవాటు మాత్రం ఉండదు. ఇలా ఎందుకు చేశావని అరవడమో, తిట్టడమో చేస్తుంటారు కానీ.. ఏం జరిగిందని మాత్రం పిల్లల్ని అడగరు. ఇది తప్పు. ముందు ఏం జరిగిందో ఓపికగా వినండి. వాళ్లను మాట్లాడనివ్వండి. పిల్లలు మీతో తమ మనస్సులోని ప్రతి మాటను చెప్పుకునేట్టు ఉండాలి. అందుకే వారు చెప్పే ప్రతి మాటను ఓపికగా వినండి. తప్పులుంటే చెప్పండి. సలహాలు ఇవ్వండి. అప్పుడే పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు.
అంచనాలు
పిల్లల స్టామినా తెలుసుకోకుండా ప్రతి పేరెంట్స్ తమ పిల్లలపై ఎన్నో హోప్స్ ను పెంచుకుంటారు. ఒకవేళ అవి సాధ్యం కాకపోతే నిరాశచెంది పిల్లల్ని తిడుతుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే పిల్లలందరికీ ఒకే రకమైన ప్రతిభ ఉండదు. వారికున్న సామర్థ్యంపైనే మీరు ఆశలు పెట్టుకోవాలి. అందుకే ఇది సాధించలేదని, ఏదీ చేతకాదని వారిని తిట్టి బాధపెట్టకండి.
ప్రవర్తన
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన గురించి తెలుసుకోరు. ఏదైనా చెడు పని చేస్తే వారు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని మాత్రం అడగరు. బదులుగా తిట్టడమో, కొట్టడమో చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు మెండిగా తయారవుతారు. మీ మాట వినరు. అందుకే తప్పు చేసినప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకోండి. దీనివల్ల వారి చెడు ప్రవర్తనను దూరం చేయొచ్చు.
parenting
మంచి, చెడు
మీ పిల్లల ప్రవర్తనను మంచి లేదా చెడుగా వర్గీకరించే ప్రయత్నం చేయకండి. దీనికి బదులు ఏది మంచి, ఏది చెడో వారికి అర్థమయ్యేట్టు వివరించండి. అలాగే వారితో ప్రశాంతంగా మాట్లాడండి. పిల్లలు చెడ్డవారు అనే భావన కలిగించకూడదు. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని చెడ్డవారుగా ముద్ర వేయకండి. వారు అర్థం చేసుకునే విధంగా సమస్యను వివరించడానికి ప్రయత్నించండి.