Liger:విజయ్ దేవరకొండ "లైగర్" రివ్యూ & రేటింగ్…!
విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాతలు కరణ్‌జోహార్, చార్మీల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది.
Liger movie review
పాన్ ఇండియా ఫిలిం లైగర్ మూవీ పై ట్రేడ్ లోనే కాదు, ఆడియన్స్ లోను ఓ రేంజిలో అంచనాలున్నాయి. లైగర్ మూవీ ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని ఫిక్సై పోయారు. . పూరి మార్క్ డైలాగ్స్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని ఆడియన్స్ లెక్కలేసుకున్నారు. అయితే అవన్నీ నిజమైతే సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమై ఉండేది. నిజానికి సినిమా ఎలా ఉంది. అంచనాలకు తగ్గట్లే ఉందా లేక తగ్గినట్లే అనిపిస్తోందా...పూరి మ్యాజిక్ ..మరో ఇస్మార్ట్ శంకర్ ని అందించిందా....విజయ్ దేవరకొండని ప్లాఫ్ ల నుంచి ఒడ్డున పడేసిందా, కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథాంశం
లైగర్(విజయ్ దేవరకొండ) తల్లి బాలామణి(రమ్యకృష్ణ) తో కలిసి కరీంనగర్ నుంచి ముంబై వస్తారు.వాళ్ల లక్ష్యం ఒకటే మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ MMA లీగ్ లో గెలవాలని. నేషనల్ ఛాంపియన్ అవ్వాలని. ఒకప్పుడు లైగర్ తండ్రి కూడా పెద్ద ఫైటర్. కాబట్టి ఆమె తన కొడుకుని అంతకు మించి చూడాలనుకుంటుంది. అందుకు కోచ్ (రోనిత్ రాయ్)సాయపడతాడు. లైగర్ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని తన దృష్టిని మొత్తం కాన్సంట్రేట్ చేస్తాడు. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి వచ్చిన తాన్యా(అనన్యా పాండే) అతన్ని తన ప్రేమలో పడేసుకుంటుంది. అది అతని లక్ష్యాన్ని, కాన్సంట్రేషన్ ని దెబ్బ తీస్తుంది. దాన్ని లైగర్ ఎలా అధిగమించాడు...అందుకు తాన్యా ఏ విధంగా సాయిం చేసింది... లాస్ వేగాస్ లో జరిగే వరల్డ్ MMA ఛాంపియన్ షిప్ కు ఎలా వెళ్లగలిగాడు. అతని తండ్రి ఎవరు...మైక్ టైసన్ ది ఈ కథలో ఏం పాత్ర...చివరకు తన తల్లి లక్ష్యం లైగర్ నెరవేర్చగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
భాక్సింగ్ నేపథ్యంలో చెప్పబడ్డ Slumdog Millionaire టెంప్లేట్ కథ ఇది. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ కథని చాలా సార్లు తెరపై చెప్పారనే విషయం పూరికి ఐడియా ఉండకుండా ఉండదు. అయితే తనదైన స్టైల్ డైలాగులు, విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజంస్, మైక్ టైసన్ స్పెషల్ ఎట్రాక్షన్ తో లాగేయచ్చు అనుకుని ఉండవచ్చు. ఆయన ఎక్సపెక్ట్ చేసినట్లుగానే సినిమాని నెక్ట్స్ లెవిల్ లో జనాల్లోకి తీసుకెళ్లటం దాకా అవి పనిచేసాయి. అయితే అవే అంచనాలు పెంచేసాయి. వాటిని అందుకోవటం ఈ మామూలు రెగ్యులర్ కమర్షియల్ స్టఫ్ కు సాధ్యమయ్యే పనికాదు. ఫస్టాఫ్ అయినా కాస్త పద్దతిలో కనిపిస్తుందేమో కానీ సెకండాఫ్ పూర్తిగా డ్రాప్ అయ్యిపోతుంది.
ఎక్కడికెక్కడ కన్వీన్సింగ్ గా అప్పటికప్పుడు సర్దిచెప్పటానికి అన్నట్లు సీన్స్ వస్తూంటాయి. పాటలు అంతే..చూసేవాడి పాట్లు చెప్పనలవి కాదు. హీరోయిన్ ట్రాక్ అయితే వచ్చిన ప్రతీసారి ఇలా ఉందేంటి,చూసుకోలేదా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కమర్షియల్ సినిమాకు కావాల్సిన హీరో..ప్రతి కూల పరిస్దితులు లేదా విలన్ అనే థ్రెడ్ సరిగ్గా లేదు. దాంతో హీరో పాత్ర యాక్టివ్ గా ఉన్నట్లు కనపడినా ప్యాసివ్ గా మారిపోతుంది. ఏదో స్పోర్ట్స్ బయోపిక్ ని డీల్ చేస్తున్నట్లుగా ఫైట్స్ తర్వాత ఫైట్స్ వచ్చేస్తూంటాయి. మధ్యలో కావాలి కాబట్టి హీరోయిన్ తో కొన్ని సీన్స్, తల్లితో కొన్ని సీన్స్ పెట్టుకున్నారు.
ఎప్పుడు హీరో డోంట్ కేర్ ఏటిట్యూడ్ క్యారక్టరైజేషన్ పై దృష్టి పెట్టే పూరి జగన్నాథ్ ఈ సారి ఎందుకనో దాన్ని వదిలేసాడు. హీరో డైలాగులు అన్ని నత్తిలో కొట్టుకుపోయాయి. నత్తి చాలా చోట్ల విసిగిస్తుంది. మొదట కొంచెం కొత్తగా అనిపించినా రాను రాను ఓవర్ చేసారు అనిపించింది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే... పూరి పూర్తిగా వదిలేసారు. ఎక్కడా ఓ స్ట్రక్చర్,పద్దతి లేకుండా నడుస్తుంది. అలాగని ఇదేమీ ప్రయోగమూ కాదు..న్యూ జనరేషన్ కథా కాదు. క్యారక్టర్స్ సరిగ్గా డెవలప్ కాకుండా కేవలం స్టోరీ లైన్ ని పట్టుకుని సీన్స్ అల్లుకుంటూ పోయినట్లు అనిపిస్తుంది. దాంతో ఆ క్యారక్టర్ కొన్ని సార్లు ఒకలా..మరికొన్ని సార్లు మరోలా బిహేవ్ చేస్తాయి. సినిమాలో ఉన్న బోలెడు ఫైట్స్ ని ఒక పద్దతిలో పట్టుకునే స్క్రీన్ ప్లే ఉంటే ఖచ్చితంగా సినిమా మరోలా ఉండేది. మెయిన్ కథకు సంబంధం లేని ట్రాక్ లు విసిగించటానికి కారణం అదే. పోకిరి,ఇస్మార్ట్ శంకర్ వంటి కమర్షియల్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ తీసిన సినిమాయేనా అని డౌట్ వచ్చేస్తుంది.
నటీనటుల్లో...
విజయ్ దేవరకొండ MMA ఫైటర్ క్యారక్టర్ కి తగినట్లు గా తన బాడీని అద్బుతంగా రెడీ చేసుకున్నారు. అలాగే క్యారక్టర్ లో అంత విషయం లేదనిపించినా తన ఎనర్జీ తో దాన్ని చాలా చోట్ల లేపారు. వన్ మ్యన్ షో అనిపించారు. మైక్ టైసన్ తో వచ్చే సీన్స్ లో తనను తాను ప్రెజెంట్ చేసుకున్న విధానం విజయ్ దేవరకొండలో ఉన్న డెడికేషన్ ని చూపిస్తుంది. అయితే ఆ ఫైట్ తెరపై అంత సీరియస్ మ్యాటర్ లా కనపడదు. మిగతా ఫైట్స్ లోనూ దేవరకొండ ఓ యాక్షన్ మాస్ హీరోలా కనిపిస్తారు. అకిడిపకిడి సాంగ్ లో డాన్స్ అదరకొట్టాడు.
అనన్య పాండే ...సినిమాని బాలీవుడ్ కు తీసుకెళ్లటానికి తప్ప మరెందుకు పనికివచ్చినట్లు కనపడదు. ఆమె ట్రాక్ దారుణం. ఆమె నటన అందుకు తగ్గట్లే ఉంది. ఆ ట్రాక్ లేపేసినా జనం ఆనందపడేలా ఉంది. రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. ఎన్నో సినిమాల్లో చేసినట్లే ఇందులోనూ చేసుకుంటూ వెళ్లిపోయింది. పూరి రెగ్యులర్ సినిమా మదర్ లా రెబల్ క్యారక్టరైజేషన్. గెటప్ శ్రీను కాస్త నవ్వించాడు. అలీ పెద్దగా ఏమీ అనిపించలేదు. మైక్ టైసన్ ..ఏ మాత్రం కొద్దిగా కూడా ఇంపాక్ట్ కలగచేయలేకపోయారు. మిగతా పాత్రలు జస్ట్ ఓకే.
టెక్నికల్ గా చూస్తే...
ఈ సినిమాలో పాటలు రిలీజ్ కు ముందు వచ్చిన రెస్పాన్స్ కు తెరపైకు తేడా కనపడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న సీన్స్ కు ఇవి స్పీడు బ్రేకర్స్ గా మారాయి. అయితే అకిడిపకిడి సాంగ్ బాగుంది. సీన్స్ సపోర్ట్ చేయలేదేమో ...అంత ఊపు వచ్చేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే లేదు. Liger BGM జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. సీన్స్ లో విషయం లేని చోట కూడా కళ్లు ప్రక్కకు తిప్పుకోనివ్వకుండా ట్రై చేసారు. ఆర్ట్ డైరక్షన్ కూడా ఫెరఫెక్ట్ . పూరి మార్క్ ఎడిటింగ్ స్టైల్ , రాండమ్ కట్స్ ఈ సారి పెద్దగా ఆసక్తి కలిగించలేదు. పూరి డైలాగులు విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఖర్చు తెరపై కనిపిస్తోంది.
బాగున్నవి +
విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్
యాక్షన్ సీక్వెన్స్ లు
రమ్యకృష్ణ ఫెరఫార్మెన్స్
BGM
బాగోలేనివి -
ఎన్నో సార్లు చెప్పబడ్డ రొటీన్ కథ
ఇరిటేట్ తెప్పించే స్దాయిలో నత్తిని వాడటం
Predictable స్క్రీన్ ప్లే
ఫైనల్ థాట్:
కథ, కథనం సరిగ్గా లేకపోతే మైక్ టైసన్ వచ్చినా, విజయ్ దేవరకొండ మైక్ పట్టుకున్నా ఫలితం అస్సామే..
Rating: 2.5/5
బేనర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
నటీనటులు: విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శీను తదితరులు
డీఓపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ భాష
ఎడిటర్: జూనైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ
కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
రన్ టైమ్: 2 గంటల 20 నిముషాలు
విడుదల తేదీ: ఆగస్ట్ 25, 2022