Razakar Movie Review: `రజాకార్` మూవీ రివ్యూ, రేటింగ్..
నిజాం నవాబ్ అరాచకాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం `రజాకార్`. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వస్తున్నాయి. చరిత్రని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా `రజాకార్` అనే సినిమా వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యాన్ని నిజాం నవాబ్ కోణంలో, కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోణంలో చెబుతూ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఆపాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. అన్నింటిని దాటుకుని రిలీజ్ అయ్యింది. యాటా సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించగా, గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, వేదిక, మకరంద్ పాండే, ప్రేమ, అనుష్క త్రిపాఠి, రాజ్ అర్జున్, జాన్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేడు శుక్రవారం(మార్చి 15న) ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
నైజాం(హైదరాబాద్) రాజ్యాన్ని నిజాం నవాబ్‌లు పాలిస్తూ వచ్చారు. వారిలో చాలా మంది మంచి పనులు చేశారు. కానీ ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చినా ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్నారు. తాను హైదరాబాద్‌ని స్వాతంత్ర్య రాజ్యంగా పాలించుకుంటానని కేంద్రానికి తేల్చి చెప్పారు. కానీ ఇక్కడ అనేక ఆగడాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఖాసీం రజ్వీ సారథ్యంలో రజాకార్ వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రజలపైకి ఉసిగోల్పారు. హిందూ, ముస్లీం అనే కోణంలో హిందూవులను ముస్లీంలుగా మారాలని హుకుం జారీ చేశారు. బలవంతంగా మత మార్పిడీలు చేయించారు. హైదరాబాద్‌ని ముస్లీం రాజ్యంగా మార్చే కుట్రలకు పాల్పడ్డారు. తమ మాట వినని వారు, సిస్తు కట్టని జనాలను దారుణంగా హింసించేవారు. పంటలను లాక్కెల్లేవారు. ఈ క్రమంలో ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న వంటి అనేక మంది నాయకులు రజాకార్లకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసి పోరాడారు. అందులో ప్రాణాలు వదిలేశారు. పరకాలలో హింసా కాండ, బైరాన్ పల్లి మరణహోమం, అలాగే గుండ్రంపల్లి దారుణా ఘటనలు, నిజాం, ఖాసీం రజ్వీ, రజాకార్ల ఆగడాలు, అరాచకాలు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి చేరాయి. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోవడం లేదు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని ఎలా ఇన్నిషియేట్ తీసుకున్నాడు? ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించారు. ఇందులో రజాకార్లతో ఇంకా ఎవరెవరు పోరాడి ప్రాణాలు కోల్పోయారు? ఎలాంటి పరిస్థితిల్లో నిజాం.. హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నాడనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
`రజాకార్` సినిమా ఏడో నిజాం హయంలో ఖాసీం రజ్వీ సృష్టించిన రజాకార్ల ఆగడాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రాంతాల్లో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు ఎంతగానో దారుణాలకు తెగబడ్డారు. మహిళలను వివస్త్రలను చేసి హింసించారు. మానభంగాలు చేశారు. మగవాళ్లని అతి కిరాతకంగా చంపారు. పసిపిల్లలను వదల్లేదు. ఆడబిడ్డలను వదల్లేదు. తమకు ఇష్టా రాజ్యంగా వ్యవహరించి హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలను తమ బానిసలుగా మార్చేశారు. అలా రజాకార్ల అత్యంత దారుణమైన చర్యలను ఈ సినిమాలో కళ్లకి కట్టి నట్టు చూపించారు. ఆ టైమ్‌లో ఎంతటి దారుణాలు జరిగేవో, హింసాకాండ జరిగేదో ఈ చిత్రంలో ఆవిష్కరించారు మేకర్స్. అయితే సినిమాలో తెలంగాణ సాయుధ పోరాటం కోణంలోగానీ, కమ్యూనిస్టులు పోరాడిన కోణంలోగానీ చూపించలేదు. నిజాం నవాబ్‌తో కలిసి ఖాసీం రజ్వీ చేసిన కుట్రలు, రజాకార్ల అరాచకాలు, హిందూవులను టార్గెట్ చేసి వాళ్లు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారనేది, హైదరాబాద్‌ని ముస్లీం రాజ్యంగా మార్చే కుట్ర కోణంలో సినిమాని చూపించారు. దీనికి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రియాక్షన్స్, ఆయన ఎలా మదన పడ్డారు, ఏం చేయాలనుకున్నారనేది, చివరికి ఏం చేశారనేది చూపించారు.
కొన్ని ప్రధాన ఘటనలను, ఆయా ప్రాంతాల్లో తమకు ఎదురు తిరిగినందుకు రజాకార్లు ఎంతగా హింసా కాండకి పాల్పడ్డారు, ఎంతటి మరణహోమం సృష్టించారో చూపించారు. అందులోనే పరకాల, బైరాంపల్లి, గుండ్రంపల్లి, భువనగిరి, వంటి కొన్ని ప్రాంతాల్లోని సంఘటనలు చూపించారు. అలాగే ఐలమ్మ, నారాయణరెడ్డి, రాజన్న వంటి కొందరు నాయకుల పోరాటాన్ని ఆవిష్కరించారు. అలాగే జర్నలిస్ట్ షోయాబుల్లా ఖాన్ పోరాట పఠిమని ఆవిష్కరించారు. అయితే ప్రారంభంలో నుంచి ఆయా ప్రాంతాల్లో జరిగే ఘటనలు, హింసాకాండని చూపించుకుంటూ వెళ్లారు. ఓ వైపు ఈ ఆగడాలు, మరోవైపు నిజాం, ఖాసీం రజ్వీల కుట్రలు, ఇంకోవైపు వల్లభాయ్ పటేల్ చేసే యాక్టివిటీస్‌ని చూపిస్తూ బ్యాలెన్స్ చేశారు. కథని ఏకకాలంలో మూడు యాంగిల్స్ లో చెప్పారు. అయితే డైరెక్ట్ గా ఇలాంటి యాక్షన్ చూపించడంతో ఎమోషన్స్ మిస్ అయ్యింది. జనాల బాధలను ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. మితిమీరిన యాక్షన్ ఎమోషన్స్ ని పక్కకి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరో ఘటనలను, జరిగిన విషయాలను చెబుతూ వెళ్లారు తప్పితే ఇందులో కొత్త విషయం ఏదీ చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే జరిగినవి కూడా అన్ని చూపించలేదు.
అయితే రజాకార్ల ఆగడాలను మాత్రం యదార్థంగా ఆవిష్కరించారు. అంతకంటే దారుణంగా బయట జరిగినా, సినిమాలో మాత్రం అయ్యో ఇలా జరిగిందా అనిపించేలా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఒక్కో ఘటన చూస్తుంటే హృదయం బరువెక్కిపోతుంది. మనసు కదిలిపోతుంది. నెత్తురు మరుగుతుంది. అలాంటి సీన్లని బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే బలంగా రాసుకున్నారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం చాలా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో గాథ, ఎంత చెప్పినా చాలదు. ఒక్క సినిమాలో చెప్పలేం. అందుకే కొన్ని మెయిన్ ఇన్స్ డెంట్స్ ని మాత్రమే టచ్ చేశారు. యాక్షన్‌కి తగ్గ బీజీఎం, పాటలు కుదిరాయి. ఆ యాక్షన్, ఘటనలను మరింత ఎలివేట్ చేసేలా భీమ్స్ బీజీఎం ఉండటం విశేషం. అది ఆడియెన్స్ కదిలించేలా చేస్తుందని చెప్పొచ్చు. కానీ డ్రామా మిస్ అయ్యింది. ఎంత రియల్ ఇన్సిడెంట్స్ అయినా సినిమా అన్నప్పుడు డ్రామా ఉండాలి, అది రక్తికట్టేలా ఉండాలి, ఎమోషన్స్ ఆడియెన్స్ క్యారీ కావాలి. సోల్ ఆడియెన్స్ కి ఎక్కాలి. అది లేదంటే సినిమా సీన్లుగానే మిగిలిపోతుంది. ఈ మూవీలోనూ కొంత అదే జరిగింది. పూర్తి స్థాయిలో ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ కాలేకపోతారు. ఇప్పటితరానికి అవన్నీ తెలియదు కాబట్టి దాన్ని అంతే అర్థవంతంగా, ఆ ఎమోషన్స్ ఎక్కేలా చేయాలి. ఇందులో అది కొరవడింది. సినిమా అంతో ఇంతో కనెక్ట్ అవుతుందంటే అది బిజీఎం, యథార్థంగా సంఘటనలు చూపించడం వల్లే అని చెప్పచ్చు.
చరిత్ర వక్రీకరణ జరిగిందా?
`రజాకార్` సినిమాలో కేంద్ర హోంమంత్రిని హీరోగా చూపించే ప్రయత్నం చేశారు. ఖాసీం రజ్వీని విలన్‌గా చూపించారు. ఖాసీం రజ్వీ ట్రాప్‌లో పడి నిజాం తప్పుడు పనులు చేశాడని, చివరికి రియలైజ్ అయినట్టుగా సినిమాలో చూపించారు. అయితే రజాకార్లని ఎదుర్కోవడంలో, ప్రజలను తిరుగుబాటుకి చైతన్య పరచడంలో ముందుండి నడిపింది కమ్యూనిస్టులు. కానీ వారి ప్రస్తావన తేలేదు. తెలంగాణ సాయుధ పోరాటం అనే పదాన్ని వాడకుండా సినిమాని తీశారు. దీంతోపాటు ఎంతో మంది వీరుల ప్రస్తావన తీసుకురాలేదు. చాలా మంది గొప్ప నాయకులను మిస్ చేశారు. మరోవైపు సినిమాలో ఎండింగ్ వరకు హిందూ, ముస్లీం అనే పాయింట్‌లోనే చర్చిస్తూ వచ్చారు. క్లైమాక్స్ లో దాన్ని బ్యాలెన్స్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అందరి పేర్లు ప్రస్తావిస్తూ ఓ పాట పెట్టారు. కానీ సినిమాలో మెయిన్‌గా వారి గురించి చర్చించకుండా, కమ్యూనిస్టు ల ప్రస్తావన తేకుండా కేవలం నాయకుల పేర్లు చెబుతూ జోహార్లు చెప్పడంతోనే సరిపెట్టారు. పైగా చివర్లో కేంద్ర బలగాలు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మొదట్నుంచి ముందుండి పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు సైడ్(సైలెంట్) అయ్యారని ఒక్క డైలాగ్‌తో వారిని సైడ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాని బీజేపీ మద్దతు దారులు తీశారు. కాబట్టి వారికి అనుకూలంగానూ తీసినట్టుగా అనిపిస్తుంది.
నటీనటులుః
సినిమాలో భారీ కాస్టింగ్‌గా ఉంది. ఇక అందులో మెయిన్‌గా ఖాసీం రజ్వీ పాత్ర హైలైట్ అయ్యింది. ఆ పాత్రలో రాజ్ అర్జున్ ఒదిగిపోయాడు. అదరగొట్టాడు. సినిమా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇక నిజాం నవాబ్‌గా మకరంద్ పాండే అంతే సహజంగా, అంతే బాగా చేశాడు. బాగా సెట్ అయ్యాడు. ఆయన హవాభావాలు వాహ్ అనేలా ఉన్నాయి. వీరితోపాటు ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ, రాజన్నగా బాబీ సింహా ఉన్న కాసేపు అదరగొట్టారు. పాత్రలకు ప్రాణం పోశారు. వీరితోపాటు వేదిక, ప్రేమలు సైతం విరోచితంగా కనిపించారు. అలాగే వల్లభాయ్ పటేల్‌గా తేజ్ సప్రు చాలా హుందాగా కనిపించాడు. బాగా చేశారు. ఆయన్నే చూసిన ఫీలింగ్ కలిగించాడు. మిగిలిన పాత్రధారులు సైతం మెప్పించారు. ఎవరినీ తక్కువ చేయడానికి లేదు.
సాంకేతిక నిపుణులుః
సినిమాకి టెక్నీషియన్లే ప్రధాన బలం. మ్యూజిక్ బ్యాక్ బోన్‌గా నిలిచింది. సినిమాలో పాటలు ఉత్తేజాన్నిచ్చేలా ఉన్నాయి. బతుకమ్మ పాట గూస్‌బంమ్స్ తెప్పించింది. ఇక బీజీఎం నెక్ట్స్ లెవల్. భీమ్స్ సిసిరోలియో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు అదరగొట్టారు. ఆయన వల్లే చాలా సీన్లు ఎలివేట్ అయ్యాయి. రమేష్ కుషేందర్ కెమెరా వర్క్ బాగుంది. చాలా రిచ్‌గా ఉంది. కొన్ని షాట్లు చాలా లావిష్‌గానూ ఉన్నాయి. చాలా సీన్లలో డిటెయిలింగ్‌కి ప్రయారిటీ ఇచ్చారు. అక్కడ కెమెరా పనితనం తెలిసిపోతుంది. తమ్మిరాజు ఎడిటింగ్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు. బాగా రిచ్‌గా చేశారు. రాజీపడలేదు. దర్శకుడు యాటా సత్యనారాయణ తనలోని కసి మొత్తం సినిమాలో పెట్టినట్టు ఉంది. సినిమాని ఓన్ చేసుకుని తీశాడు. తన కసిని వెండితెరపై ఆవిష్కరించారు. స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నారు. కన్విన్సింగ్‌గా ఉంది. కానీ డ్రమటైజ్ చేయడంలో, ఎమోషన్స్ పండించేలా సినిమాని తెరకెక్కించడంలో ఆయన సక్సెస్ కాలేకపోయాడు. అదే సమయంలో ఎజెండా విషయంలో ఓ వర్గం మెప్పు పొందే ప్రయత్నం చేసేలా ఆయన ఈ సినిమా తీశాడని మాత్రం స్పష్టమవుతుంది. మరో వర్గాన్నిసైడ్ చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది.
ఫైనల్‌గాః `రజాకార్`.. ఆనాటి రజాకార్ల ఆగడాలకు నిదర్శనం. కానీ కండీషన్స్ అప్లై.
రేటింగ్‌ః 2.5
నటీనటులుః ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, రాజ్ అర్జున్, మకరంద్ పాండే, వేదిక, ప్రేమ, జాన్ విజయ్, తలైవసల్ విజయ్, అరవ్ చౌదరి, మహేష్, దేవి ప్రసాద్, తేజ్ సప్రు తదితరులు.
దర్శకత్వంఃయాటా సత్యనారాయణ
నిర్మాతః గూడూరు నారాయణ రెడ్డి,
మ్యూజిక్‌ః భీమ్స్ సిసిరోలియో
కెమెరాః రమేస్ కుషేందర్
ఎడిటింగ్‌ః తమ్మిరాజు.
బ్యానర్‌ః సమర్‌వీర్ క్రియేషన్స్ ఎల్‌ఎల్పీ.