#Karthikeya-2: నిఖిల్ ‘కార్తికేయ 2’రివ్యూ
'ఐదు సహస్త్రాల ముందే పలికిన ప్రమాదం... ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అంటూ నిఖిల్ విభిన్నమైన ప్రోమోలుతో ,పబ్లిసిటీ క్యాంపైన్ తో ఈ రోజు మన ముందుకు వచ్చాడు. తను హీరోగా చేసిన ‘కార్తికేయ’ సీక్వెల్ అని వచ్చిన ఈ చిత్రం శ్రీకృష్ణుడు, ద్వారకా నగరం, రహస్యం అంటూ ఆసక్తి రేపింది. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి...చిత్రం కథేంటి...ఈ సినిమాతో నిఖిల్ హిట్ కొట్టాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
ఇది శ్రీకృష్ణుడు కంకణం చుట్టూ తిరిగే కథ. డాక్టర్ కార్తికేయ (నిఖిల్) కు కొత్త విషయాలంటే ఆసక్తి. ప్రతీ విషయంలోనూ సైన్స్ లాజిక్ వెతుకుతూంటాడు. మూఢ నమ్మకాలని ఖండిస్తూంటాడు. అయితే ఓ సారి అతనికి ప్రమాదం ఎదురైతే...దాన్నుంచి బయిటపడితే శ్రీకృష్ణుడు నగరమైన ద్వారక కు తీసుకు వస్తానని తల్లి (తులసి) మొక్కుకుంటుంది.ఆ మొక్కు తీర్చటానికి తన కొడుకుని ఒప్పించి ద్వారక తీసుకు వెళ్తుంది. అదే సమయంలో అక్కడ ఓ గొప్ప ఆర్కియాలజిస్ట్ రావు చనిపోతాడు. అతన్ని కార్తికేయే హత్య చేసాడని పోలీస్ లు వెంబడించి అరెస్ట్ చేస్తారు.
అయితే చిత్రంగా కార్తికేయను ...మరణించిన రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) పోలీస్ స్టేషన్ నుంచి బయిటకు తీసుకు వస్తుంది. అప్పుడు అతనికి ఓ విషయం చెప్తుంది. అక్కడ నుంచి నిఖిల్ కు ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకుంటాడు. అది శ్రీకృష్ణుడు కంకణం సాధించాలని. ఈ క్రమంలో అనేక అడ్డంకులు. మరో ప్రక్క శాంతను (ఆదిత్యా మీనన్), ఇంకా అభీరా తెగ వాళ్లు కార్తికేయను ఆ మిషన్ నుంచి తప్పించాలని చూస్తారు. ఇబ్బందులు పెడుతూంటారు. వాటిని అన్నిటిని తప్పించుకుంటూ కార్తికేయ ఆ కంకణం సాధిస్తాడా....ఆ కంకణం వెనక ఉన్న మిస్టరీ ఏమిటి...కార్తికేయను అడ్డు తొలిగించుకోవాలని చూస్తున్న అభీరా తెగ వాళ్లు ఎవరు..వాళ్లకేం కావాలి... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ .....
అద్భుత వైద్య రహస్యాలను పొందుపరిచి ఒక సీక్రెట్ ప్లేస్ లో భద్రపరిచిన శ్రీకృష్ణుడి కంకణం చేజిక్కించుకోవాలని కొందరు దుర్మాగులు ప్రయత్నిస్తుంటే.. తన ప్రమేయం లేకుండా హీరో ఆ ట్రాక్ లోకి వచ్చి ఆ కంకణాన్ని సాధించి లోక కళ్యాణానికి ఉపయోగించడం.. ఈ క్రమంలో అతడికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో కథ నడుస్తుంది.
సాహిత్యంలో గత కొంతకాలంగా హిస్టరీ, పురాణాల పాత్రలు బేస్ చేసుకుని కథలు, నవలలు వస్తున్నాయి. ఆ పాత్రలను మూల కథగా తీసుకుని ఇప్పటికాలానికి తీసుకొచ్చి థ్రిల్లర్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ లో డావిన్సీ కోడ్ వంటివి ఈ తరహా నవలలే. అవి అన్ని చోట్లా బాగా క్లిక్ అవుతున్నాయి. మన దేశంలోనూ అశ్విన్ సంఘీ వంటి రచయితలు అలాంటి పాత్రలను,నవలలు సృష్టిస్తున్నారు. అలాంటి వాటిల్లో The Krishna Key ఒకటి. కృష్ణుడు అక్షయపాత్ర చుట్టూ తిరిగే కథ అది. అలాంటిదే ఈ సినిమా కూడాను. అయితే ఆ కథ వేరు..ఇది వేరు. ఈ సినిమా.. కృష్ణుడి కంకణం చుట్టూ ఈ కథ జరుగుతుంది. ఈ కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్ కలుపుతూ, థ్రిల్లర్ నేరేషన్ లో Indiana Jones and the Raiders of the Lost Ark (1981) ని గుర్తు చేస్తూ ఈ సినిమా ముందుకు వెళ్తుంది.
మొదటి సీన్ నుంచి చివరి దాకా ఓ విధమైన క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అయితే విలన్, హీరో మధ్య పెద్దగా ఏమి జరిగినట్లు అనిపించదు. హీరో క్యారక్టర్ కు ఎదురేలేనట్లు ముందుకు వెళ్తూంటుంది. విలన్ పాత్రకు సరైన స్టాండ్ కనపడదు. దాంతో ప్యాసివ్ గా తయారైంది. ఇలాంటప్పుడు ఈ కథల నుంచి రావాల్సిన మాగ్జిమం వావ్ ఎలిమెంట్స్ మిస్ అవుతాయి. అదే చాలా చోట్ల జరిగింది. గొప్ప కథ కాదు కానీ నేపధ్యం కొత్తగా ఉండటం. స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉండటం కలిసొచ్చింది. డ్రామా కూడా బాగా పండింది. ఫస్టాఫ్ లో సినిమా ద్వారక చుట్టూ తిరగటం, కృష్ణుడు భక్తులైన అభిరా తెగ వారు చేసే ఎటాక్ లతో నడిచిపోయింది. ఇంట్రవెల్ కూడా బాగా సెట్ అయ్యింది. సెకండాఫ్ లో కాస్త లాగినట్లు అనిపించినా, క్లైమాక్స్ కు వచ్చేసరికి సర్దుకున్నారు. ముఖ్యంగా అనుపమ ఖేర్ పాత్ర సినిమాని లేపి నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. అలాగే రొటీన్ లవ్ ట్రాక్ లు వంటివి సినిమాలో పెట్టకపోవటం కూడా పెద్ద రిలీఫ్. కథకు కీలకమైన కంకణం గురించిన పూర్వ కథను మరింత ఇంట్రస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే కంకణానికి సంబంధించిన క్లూస్ ఒక్కోటి తెలుసుకుంటూ, చివరగా దాన్ని సాధించే క్రమం బాగుంది.
టెక్నికల్ గా...
ఈ సినిమా హైలెట్స్ లో మొదట చెప్పుకోవల్సింది కాలభైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా సీన్స్ కు ఇది చూపు తిప్పుకోనివ్వకుండా కాపు కాచేసింది. ఆ తర్వాత కెమెరా వర్క్ సైతం సినిమాని నెక్ట్స్ లెలివ్ కు తీసుకెల్లింది. ఇక డైరక్టర్ విషయానికి వస్తే.. పైన చెప్పుకున్నట్లు రొటీన్ కు వెళ్లకుండా కథను థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్పటం కలిసొచ్చింది. స్క్రిప్టులోనే చాలా భాగం సక్సెస్ అయ్యాడు. మేకింగ్ పరంగా ఈ దర్శకుడు మొదటి సినిమా నుంచి మంచి మార్కులు వేయించుకుంటూనే ఉన్నాడు. ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సిన ఆర్ట్ వర్కు ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉంది. డైలాగులు యావరేజ్ గా ఉన్నాయి. అనుపమ ఖేర్ పాత్రకు మాత్రం బాగా రాసారు. VFX వర్క్ కూడా బాగా కుదిరింది. చీప్ థ్రిల్స్ లేవు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ...బాగా రిచ్ గా ఉన్నాయి.
నటీనటులు విషయానికి వస్తే...
నిఖిల్ ఈ పాత్రను బాగా ఓన్ చేసుకుని ఒదిగిపోయారు. దాదాపు అంతా అతనే మోసాడు. అనుపమా పరమేశ్వరన్ ...కథకు ఉపయోగ పాత్రే.ఎంతవరకూ చేయాలో అంతవరకూ చేసింది. శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఫన్ తో రిలీఫ్ ఇచ్చారు. అనుపమ్ ఖేర్, ఆదిత్య మేనన్ వంటివారు తమ పాత్రని ప్రభావవంతంగా పోషించారు.
బాగున్నవి:
కొత్తగా అనిపించే నేపధ్యం
థ్రిల్లింగ్ నేరేషన్
అదిరిపోయిన ఆర్ట్ వర్క్
బాగోలేనివి:
అక్కడక్కడా మరీ సినిమాటెక్ లబర్టీ తీసుకోవటం
హడావిడిగదా ముగించేసినట్లు అనిపించటం
కీలకమైన కంకణం ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవటం
ఫైనల్ థాట్
ఇదో Spiritual Treasure Hunt. తెలుగు సినిమా కథ,కథనం మారుతోంది అనటానికి ఇదొక బలమైన సాక్ష్యం.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3
నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మేనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్, తదితరులు;
సంగీతం: కాలభైరవ;
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని;
కళ: సాహి సురేష్;
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్;
నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్;
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మెుండేటి;
Run Time:2 hr 25 Minutes
విడుదల తేదీ: 13-08-2022