`మారుతీనగర్ సుబ్రమణ్యం` మూవీ రివ్యూ, రేటింగ్..
రావు రమేష్ హీరోగా నటించిన చిత్రం `మారుతీనగర్ సుబ్రమణ్యం`. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈచిత్రానికి సుకుమార్ భార్య తబిత సమర్పకురాలు కావడం విశేషం. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కంటెంట్ ఉన్న సినిమాలకు కటౌట్‌తో పనిలేదు. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తూ, ఎంటర్‌టైన్ చేస్తే స్టార్ హీరోలు అవసరం లేదని నిరూపిస్తున్నారు ఆడియెన్స్. అందులో భాగంగానే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటుడు రావు రమేష్.. మెయిన్ లీడ్‌గా(హీరోగా) మారి `మారుతీనగర్ సుబ్రమణ్యం` అనే చిత్రంలో నటించాడు. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్థన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(ఆగస్ట్ 23) విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
మారుతీనగర్‌లో ఉండే సుబ్రమణ్యం(రావు రమేష్)కి టీచర్ కావాలనేది డ్రీమ్. డీఎస్సీలో ఉద్యోగం వస్తుంది. కానీ అది కోర్ట్ కెళ్తుంది. కోర్ట్ కేసు సాగుతూనే ఉంటుంది. కేసు క్లోజ్ అయి తనకు జాబ్ వస్తుందని, తన డ్రీమ్ నెరవేరుతుందని, సమాజంలో గౌరవంతో బతకొచ్చు అని, తనకంటూ సొంతంగా ఇళ్లు కట్టుకోవచ్చు అని ఆశతో ఉంటాడు సుబ్రమణ్యం. కానీ ఏళ్లు గడిచినా ఆ కేసు ఎటూ తేలదు. దీంతో ఏ పనిచేయకుండా ఇంట్లో ఖాళీగానే ఉండిపోతాడు. తన భార్య కళారాణి(ఇంద్రజ) ఉద్యోగం చేస్తూ ఇంటిని నడపిస్తుంటుంది. వీళ్లకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు అర్జున్(అంకిత్ కొయ్య) తన ఫ్యామిలీ ఇది కాదని, అల్లు అరవింద్ తన నాన్న అని, అల్లు అర్జున్ అన్నయ్య అని, తనకు పేదరికం తెలియాలని చెప్పి సుబ్రమణ్యం వద్ద పెంచుతున్నాడని కలలు కంటుంటాడు. ఇంతలోనే సుబ్రమణ్యం అత్తయ్య(అన్నపూర్ణమ్మ) కన్నుమూస్తుంది. ఆ బాధలో ఉన్న సమయంలోనే తాను కూడబెట్టిన డబ్బులు తీయడంతో సుబ్రమణ్యంపై కళారాణి ఫైర్ అవుతుంది. ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. అనంతరం ఆమె తీర్థయాత్రలకు వెళ్తుంది. ఆ సమయంలోనే సుబ్రమణ్యం అకౌంట్‌లోకి పది లక్షలు వచ్చిపడతాయి. అవి ఎవరు పంపించారనేది పెద్ద మిస్టరీ. ఇంతలోనే కళారాణి.. అది తన అమ్మ ఇన్సురెన్స్ మనీ అని, ఇళ్లు కట్టడానికి ఉపయోగించాలని చెబుతుంది. కానీ ఈ విషయం తెలియక సుబ్రమణ్యం, అర్జున్ కలిసి ఆ డబ్బుని ఖర్చు చేస్తారు. తీరా కళారాణి ఈవిషయం చెప్పదంతో షాక్ అవుతారు. పది లక్షలు ఖర్చు చేశామని తెలిస్తే కళారాణి ఫైర్ అవుతుంది. ఆమెని తట్టుకోవడం కష్టమని, ఎలాగైనా పది లక్షలు కూడబెట్టాలని నానా తంటాలుపడుతుంటారు తండ్రి కొడుకులు. ఈ క్రమంలో సుబ్రమణ్యం, అర్జున్ ఎలాంటి తప్పులు చేశారు? సుబ్రమణ్యంకి జాబ్ వచ్చిందా? కాంచన(రమ్యపసుపులేటి)తో అర్జున్ లవ్ స్టోరీ ఏంటి? చివరికి వీరికథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఓటీటీలు విస్తరించాక కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది. థియేటర్లలోనూ ఆయా మూవీస్ సందడి చేస్తున్నాయి. ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాయి. ముఖ్యంగా కామెడీ సినిమాలకు విశేషమైన ఆదరణ దక్కుతుంది. ఫన్ వర్కౌట్ అయ్యిందంటే సినిమా హిట్ పక్కా. దర్శకుడు లక్ష్మణ్ కార్య కూడా ఆ తరహాలోనే `మారుతీనగర్ సుబ్రమణ్యం` సినిమాని తెరకెక్కించాడు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి చిత్రమే. కానీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాని డీల్ చేసిన విధానం మాత్రం బాగుంది. అయితే ఇప్పుడు చాలా వరకు ఫన్, కామెడీ సినిమాలు వస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో ఓటీటీలో ఇలాంటి సినిమాలు చాలా వస్తున్నాయి. వాటిని మించిన వినోదం ఉంటేనే ఆడియెన్స్ థియేటర్‌కి వచ్చి సినిమాని చూస్తారు. ఈ నేపథ్యంలో వినోదాన్ని నమ్ముకుని సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. ఫన్ వర్కౌట్ అయితే సినిమా హిట్, లేదంటే ఫట్. `మారుతీ నగర్ సుబ్రమణ్యం` విషయంలో దర్శకుడు అలాంటి సవాల్‌నే ఫేస్ చేశాడు. ఫన్ వర్కౌట్ చేస్తూ, ఆద్యంతం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్టాఫ్ నుంచి ఫన్ వర్కౌట్ చేసేందుకు కష్టపడ్డాడు. సిచ్చువేషనల్ కామెడీ క్రియేట్ చేస్తూ ఇంప్రెస్ చేశారు. ప్రారంభం నుంచే సుబ్రమణ్యం పాత్ర తీరుతెన్నులు, ఆయన అమాయకత్వం, కొడుకుతో ఆయన ఫన్నీ కన్వర్జేషన్ ఆకట్టుకునేలా ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఫస్టాఫ్‌లో కొంత ఫన్ డోస్ తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం ఆ గ్రిప్ తప్పకుండా చూసుకున్నాడు. కామెడీ డౌన్ అవుతున్న సమయంలో ఏదో ఒక ట్విస్ట్ తో సినిమాని నడిపించాడు.
మూవీ ప్రధానంగా మనీ చుట్టూ తిరుగుతుంది. తన అకౌంట్ లో పడ్డ పది లక్షలు ఎవరివీ? ఎలా వచ్చాయనేది పెద్ద సస్పెన్స్ తో నడిపించి. దాన్ని ఖర్చు చేయించే క్రమంలో రావు రమేష్, అంకిత్‌లో చేసే కోతి చేష్టలు నవ్వులు పూయిస్తుంటాయి. వాళ్లు చేసే సిల్లీ పనులు మనకు వినోదాన్ని పంచుతాయి. ఒకటి అనుకుని చేస్తే, మరోటి అవ్వడం, పది లక్షలు ఖర్చు అవడం, ఆ అమౌంట్ ఇంటికోసమని ఇంద్రజ చెప్పడంతో వాటిని రికవరీ చేయడం కోసం చేసే తప్పుల కారణంగా అసలుకే మోసం రావడం హిలేరియస్‌గా అనిపిస్తుంటుంది. రావు రమేష్ పాత్ర ఒక తప్పుపై మరో తప్పు చేయడం ఫన్ క్రియేట్ అవుతుంది. అదే సమయంలో సస్పెన్స్ జనరేట్ అవుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా క్రియేట్ అవుతుంది. సీన్ బై సీన్ చూస్తున్నప్పుడు నెక్ట్స్ జరిగేది ఊహించేలా ఉండటం ఆ కిక్ తగ్గుతుంది. మరోవైపు పది లక్షలు ఎలా వచ్చాయి? అనేది, దానిచుట్టూ క్రియేట్ చేసిన డ్రామా మరింత లాజికల్ గా చేయాల్సింది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ యూత్‌కి గ్లామర్ ట్రీట్‌లా ప్లాన్ చేశారు. రావు రమేష్, అంకిత్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. కానీ ఫన్ తగ్గినప్పుడు సీన్లు సప్పగా అనిపిస్తాయి. ఆ విషయంలో దర్శకుడు కేర్ తీసుకోవాల్సింది. అదేసమయంలో లాజికల్ విషయాలపై మరింత వర్క్ చేస్తే బాగుండేది.
అయితే ఓ మోస్తారు కామెడీ చిత్రాలను ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. హైప్ బాగా ఉంటే ఆ స్థాయిలో ఫన్ వర్కౌట్ కాకపోతే ఆ వెలితి ఉంటుంది. `మారుతీనగర్ సుబ్రమణ్యం` సినిమాలో కొన్ని చోట్ల ఆ ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో సుకుమార్ భార్య తబిత ఇన్‌వాల్వ్ కావడం, ఆమె సమర్పకురాలిగా మారి మూవీ రేంజ్‌ని పెంచడం, సుకుమార్‌ని, అల్లు అర్జున్‌ని సైతం ఇన్‌వాల్వ్ చేయడంతో దీని రేంజ్ పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టీమ్ చెప్పిన విషయాలు సినిమాపై మరింత హైప్‌ని పెంచాయి. ఇది సినిమా పరంగా ఆడియెన్స్ లోకి వెళ్లడంలో చాలా ఉపయోగపడింది. అది సినిమాపై ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. దీనికితోడు ఎమోషన్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకునే మూవీ అవుతుంది. ఇంటిళ్లిపాదికి మంచి టైమ్‌పాస్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.
నటీనటులుః
సుబ్రమణ్యం పాత్రలో రావు రమేష్ ఇరగదీశాడు. తనకు ఫుల్ లెన్త్ రోల్ పడితే పెద్ద హీరోల సినిమాల్లోనే రెచ్చిపోతుంటాడు. అలాంటిది. ఆయనే హీరో అంటే ఇంకెంత రెచ్చిపోతాడు. ఈ సినిమా విషయంలో ఆయన విశ్వరూపం చూపించాడు. ఫన్ విషయంలో పీక్ చూపించాడు. సినిమాకి ఆయనే బ్యాక్ బోన్, మెయిన్ హైలైట్ కూడా. రాణి పాత్రలో ఇంద్రజ మెప్పించింది. ఆమె డామినేషన్ సైతం బాగుంది. హుందాతనంతో కూడిన పాత్రలో మెప్పించింది. అంతేకాదు ఓ పాటకి డాన్స్ తో దుమ్మురేపింది. అర్జున్ పాత్రలో అంకిత్ అదరగొట్టాడు. రావురమేష్, అంకిత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతోపాటు సినిమాకి హైలైట్‌గా నిలిచింది. కాంచనగా హీరోయిన్ రమ్య ఉన్నంతలో మెప్పించింది. ఇన్నోసెంట్‌గా అలరిస్తూనే అందంతో కట్టిపడేసింది. ఇక హీరోయిన్ తండ్రి భాస్కర్ పాత్రలో హర్షవర్థన్ తనదైన కామెడీ పాత్రలో ఆకట్టుకున్నాడు. అజయ్ పాత్ర కూడా మెప్పించేలా ఉంటుంది. అలాగే ప్రవీణ్ సైతం కాసేపు అలరించాడు. జబర్దస్త్ నూకరాజు కాసేపు హిలేరియస్‌గా నవ్వించాడు. ఇతర పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపించాయి.
టెక్నీషియన్లుః
సినిమాకి ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ఎక్కడా చిన్న సినిమా అనే ఫీలింగ్ కలిగించదు. ఫ్రేములు కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ కి ఇంకా పని చెప్పాల్సింది. కొంత ట్రిమ్ చేస్తే బాగుండేది. కళ్యాణ్ నాయక్ సంగీతం బాగుంది. ఉన్నంతలో ఆకట్టుకుంది. బీజీఎం డీసెంట్ గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. రిచ్‌గా తీశారు. దర్శకుడు లక్ష్మణ్ కార్య..తొలి చిత్రంతోనే ఫన్‌తో సినిమా చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఒక డెబ్యూ డైరెక్టర్ ఈస్థాయిలో సినిమా చేయడమంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో అభినందించదగ్గ ప్రయత్నమే. సిచ్చేవేషనల్ కామెడీని వర్కౌట్ చేయడం పెద్ద టాస్క్. దర్శకుడు లక్ష్మణ్ అక్కడే తన టాలెంట్ చూపించాడు. బలవంతంగా క్రియేట్ చేసిన ఫన్ కాకుండా సందర్భాను సారంగా ఫన్ జనరేట్ చేయడమే ఈ సినిమా ప్రత్యేకత. అదే హైలైట్. సినిమాకి రైటింగ్ పెద్ద అసెట్. డైలాగ్‌లు అదిరిపోయాయి. ఫన్నీగా, సెటైరికల్‌గా బాగా రాసుకున్నారు. ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్‌గా సినిమాని మలిచిన తీరు బాగుంది. నవ్వించి నవ్వించి గుండెని బరువెక్కించడం సినిమాలో హైలైట్ పాయింట్. ఓవరాల్‌గా సినిమా మంచి ఫన్‌రోలర్ కోస్టర్‌గా చెప్పొచ్చు.
ఫైనల్‌గాః `మారుతీనగర్ సుబ్రమణ్యం`.. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేసే మూవీ. ఇంటిళ్లిపాది చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
రేటింగ్‌ః 2.75
నటీనటులుః రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు.
టెక్నీషియన్లుః
సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి,
ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని,
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి,
పీఆర్వో: పులగం చిన్నారాయణ,
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి,
లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి,
క్రియేటివ్ హెడ్: గోపాల్ అడుసుమల్లి,
సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల,
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య,
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: లక్ష్మణ్ కార్య.