Maidaan movie review: `మైదాన్` మూవీ రివ్యూ రేటింగ్..
`ఆర్‌ఆర్‌ఆర్`ఫేమ్ అజయ్ దేవగన్ ఇప్పుడు `మైదాన్` అనే చిత్రంలో నటించారు. ఫుట్‌బాల్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ గురువారం విడుదల కానుంది. ముందుగా మీడియాకి ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇండియన్ సినిమాలో చాలానే వచ్చాయి. వస్తున్నాయి. కానీ అందులో సక్సెస్ అయ్యింది కొన్ని మాత్రమే. `చెక్ దే ఇండియా`, `ధోనీ`, `భాగ్ మిల్కా భాగ్`, `మేరికోమ్` వంటి కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షక ఆదరణ పొందాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా వచ్చింది. ఇండియన్ ఫుడ్‌బాల్ కోచ్ ఎస్ ఏ రహీమ్ జీవితం ఆధారంగా ఈవెంట్ ప్రధానంగా `మైదాన్` అనే చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. హైదరాబాద్‌కి చెందిన ఫుట్ బాల్ కోచ్ రహీమ్ 1962లో భారత్‌కి గోల్డ్ మెడల్ తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఆయన లైఫ్ ఆధారంగా అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో కోచ్‌గా అజయ్ దేవగన్ నటించారు. ప్రియమణి, గజరాత్ రావు, చైతన్య శర్మ, మధుర్ మిట్టర్ ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ నిర్మించారు. బుధవారం(ఏప్రిల్ 11)న ఈ మూవీ రిలీజ్ కానుంది. ముందుగా మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
1950-62 మధ్య సాగే కథ ఇది. ప్రారంభంలో ఫుట్‌బాల్ గేమ్స్ లో భారత్ దారుణంగా పరాజయాలు సాధిస్తుంది. ఇండియన్ మీడియా దీన్ని ఘోరంగా చిత్రీకరించి పేపర్‌లో రాస్తుంది. ఈ క్రమంలో ఎస్ ఏ రహీమ్(అజయ్ దేవగన్) ఫుట్‌బాల్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. ఆయనది హైదరాబాద్. ఆయన దేశం మొత్తం తిరిగి బెస్ట్ ఫుట్ బాల్ ప్లేయర్లని ఎంపిక చేసి ట్రైనింగ్ ఇస్తాడు. ప్రారంభంలోనే ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఫైనల్ వరకు కూడా వెళ్లలేదు. దీంతో రహీమ్‌ని కోచ్ పదవి నుంచి తొలగిస్తారు. రహీమ్‌కి సిగరేట్ అలవాటు బాగా ఉంటుంది. దీంతో అది కాన్సర్‌కి కారణమవుతుంది. ఎక్కువ రోజులు బతకలేదు. అప్పటి వరకు ఫ్యామిలీ, భార్య(ప్రియమణి)తో సరిగా ఉండలేడు, వారికి టైమ్ ఇవ్వలేకపోయానని బాధపడతాడు. ఇకపై ఫ్యామిలీతోనే గడపాలనుకుంటాడు. అయితే ఈ క్రమంలో తన లక్ష్యాన్ని మర్చిపోతాడు. అతను డల్‌గా ఉండటాన్ని చూసిన భార్య.. అతని లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, లక్ష్యాన్ని సాధించడానికి కాన్సర్ అడ్డుకాదని ఇన్‌స్పైర్ చేస్తుంది. మరి భార్య చెప్పిన మాటలేంటి? రహీమ్ మళ్లీ కోచ్‌గా ఎలా అయ్యాడు? ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ జాకర్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్ లో విన్నర్‌గా నిలిపేందుకు ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? ఇది ఎలా సాధ్యమైందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్‌కి 1951-62 గోల్డెన్ ఎరా గా వర్ణిస్తారు. ఆ సమయంలోనే సయ్యద్ అబ్దుల్ రహీమ్ ఇండియన్ టీమ్‌కి కోచ్‌గా ఉన్నారు. టాలెంటెడ్ ఆటగాళ్లని దేశం మొత్తం తిరిగి మట్టిలో మాణిక్యాలను ఎంపిక చేశాడు. బెస్ట్ ఫుట్‌బాల్ టీమ్‌గా వారిని రెడీ చేశాడు. ఈ టీమ్ చాలా కప్‌లు సాధించింది. ముఖ్యంగా మొదటి సారి ఏషియన్ గేమ్స్ లో టైటిల్ విన్నర్‌గా నిలిపిన ఘనత రహీమ్‌కి దక్కుతుంది. అందుకే ఆ టైమ్‌ని గోల్డెన్ ఎరాగా పిలుస్తారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఎప్పుడు ఇండియా ప్రదర్శన ఇవ్వలేదు. ఇప్పుడు మనుగడ కోల్పోయే పరిస్థితి నెలకొంది. అయితే ఫుట్‌బాల్ గేమ్స్ పై స్పోర్ట్స్ డ్రామా సినిమాలు వచ్చింది చాలా అరుదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో రాలేదనే చెప్పాలి. ఇంత ప్రాపర్‌గా మూవీ రాలేదు. అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లో ఎమోషనల్ చాలా ముఖ్యం. స్ట్రగుల్, డ్రామా, ఎమోషన్స్ సమపాళ్లలో పండితేనే సినిమా వర్కౌట్ అవుతుంది.పాజిటివ్, నెగటివ్ చూపిస్తేనే ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. పెయిర్‌గా చూపిస్తే జనాలు రిజెక్ట్ చేస్తారు. `మైదాన్` సినిమా మెయిన్‌గా ఎమోషనల్‌గా సాగుతుంది. కోచ్ పెయిన్, ఎమోషన్స్ తోపాటు భారత్‌కి జరిగిన అవమానాలు, ఫెడరేషన్‌లోని లోపాలను ఎత్తిచూపుతూ ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు అమిత్ (రవీందర్‌నాథ్) శర్మ. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు.
1951కి ముందు భారత్ ఈ గేమ్స్ లో ఘోరంగా పరాజయం సాధించిన తర్వాత రహీమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడం నుంచి సినిమా ప్రారంభమవుతుంది. రహీమ్ హైదరాబాద్, కోల్ కత్తా, ముంబయి, కేరళా ఇలా అన్ని స్టేట్స్ కి తిరిగి, అక్క స్థానికంగా ఉన్న బెస్ట్ ప్లేయర్స్ ని కనిపెట్టి వారిని ఒక్కటిగా చేర్చి ట్రైన్ చేయడం వంటి అంశాలతో మొదటి భాగం సాగుతుంది. ఈ క్రమంలో రహీమ్ జర్నీని చూపించారు. ఆయన టీమ్‌ని రెడీ చేయడానికి ఎంతగా శ్రమించాడు, ఫ్యామిలీని వదిలి ఎంతగా కష్టపడ్డాడనేది ప్రధానంగా ఆవిష్కరించారు. మొదటి భాగం మొత్తం టీమ్ బిల్డ్ చేయడం, ఫెడరేషన్‌లో దీనిపై చర్చలు, మీడియా అధినేత క్రిటిసిజం వంటి అంశాల చుట్టూనే సాగుతుంది. అదే సమయంలో ఫెడరేషన్‌లోని లొసుగులను చర్చించారు. దీంతో మొదటి భాగం మొత్తం చాలా స్లోగా సాగుతుంది. చాలా బోర్ తెప్పిస్తుంది.
ఇక సెకండాఫ్ ప్రారంభంలో మెయిన్ గ్రేమ్ స్టార్ట్ అవుతుంది. ఒలంపిక్స్ లో పోరాడటం, ఓడిపోవడం వంటి సన్నివేశాలు రక్తికట్టించేలా ఉన్నారు, అంత డెప్త్ లేదు. పైగా ఈ క్రమంలో కోచ్ రహీమ్‌కి సిగరేట్ అలవాటు కారణంగా లంగ్స్ క్యాన్సర్ అని తెలియడం, దీంతో ఆయన కుంగిపోవడం, అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత్ కూడా సెమీ ఫైనల్ ఓడిపోవడం వంటి సన్నివేశాలతో నెమ్మదిగానే సాగుతుంది. కోచ్ ఉద్యోగం పోయిన తర్వాత నుంచి కథ ఊపందుకుంటుంది. ఎమోషనల్ సైడ్ తీసుకుంటుంది. అదే సమయంలో ఫెడరేషన్‌లో జరిగిన కుట్రలను ఇందులో ప్రధానంగా చూపించారు. ఇవన్నీ సినిమా వేగాన్ని పెంచుతాయి. ఓ వైపు ఎమోషనల్ సైడ్, మరోవైపు డ్రామా యాంగిల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత రహీమ్ భార్య పాత్ర మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడంతో మరింత రక్తికట్టిలా మారుతుంది. ఆమె బాధపడటం, విపరీతమైన దగ్గుతో రహీమ్ బాధపడటం, చివరకు అతని లక్ష్యాన్ని భార్య గుర్తించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అనంతరం మళ్లీ కోచ్‌గా రహీమ్ ఎంపికయ్యాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. నిజానికి చివరి గంటనే ఈ సినిమా. అక్కడే అసలు కథ ఉంటుంది. ఏషియన్ గేమ్స్ లో భారత టీమ్ మళ్లీ పాల్గొనడం, వారిని కోచ్ ట్రైన్ చేసి, వారిలో ఆటపై కసిని రగిల్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక గేమ్స్ లో ఆటగాళ్లు చేసే మిరాకిల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటుంది.
నిజానికి ఫుడ్ బాల్ గేమ్ ని షూట్ చేయడం బిగ్గెస్ట్ టాస్క్. ఓ రకంగా ఈ సినిమా తీయడంలో ఇదే పెద్ద సవాల్‌తో కూడుకున్న అంశం. ఆటగాళ్ల పరిగెత్తడం, బాల్‌ని తీసుకుని దాన్ని ప్రత్యర్థుల నుంచి తప్పించుకుని వెళ్లడం, గోల్ కొట్టేందుకు చేసే ప్రయత్నాలను కెమెరాల్లో అంతే సహజంగా బంధించడం పెద్ద టాస్క్. దర్శకుడు ఇక్కడ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ఆటగాళ్లలోని కసిని, ఆ ఎమోషన్స్ ని క్యాప్చర్ చేయడం, ఆటగాళ్లు కూడా ఆ ఎమోషన్స్ ని పలికించడం వాహ్ అనిపిస్తుంది. ఓ గేమ్‌లో చివరగా గోల్ కొట్టిన తీరుకి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు చూస్తుంటే మనమే నిజంగానే గ్రౌండ్లో ఉండి, వాటిని తిలకిస్తున్నట్టు, మనమే కోచ్‌గా మారిపోయినట్టు, మనమే ఆటగాళ్లుగా ఆడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. లైవ్ గేమ్‌ని చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పచ్చు. దర్శకుడు తన ఎఫర్ట్స్ మొత్తం క్లైమాక్స్ లోనే పెట్టాడని అర్థమవుతుంది. సినిమా చివరి గంట నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే సినిమా సుమారు మూడు గంటల నిడివి పెద్ద మైనస్. చివరి గంట కోసం మొదటి రెండు గంటలు భరించాల్సి ఉంటుంది. అక్కడ ఏమాత్రం ఆసక్తికరమైన అంశాలు లేకపోవడంతో నీరసంగా అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్ ని క్లైమాక్స్ తుడిచేస్తుంది. మంచి అనుభూతిని మిగిల్చుతుంది.
నటీనటులుః
కోచ్ రహీమ్‌గా అజయ్ దేవగన్ పాత్రలో జీవించారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. పాత్రకి ప్రాణం పోశాడు. సినిమా ప్రారంభమైన కాసేపటి తర్వాత మనకు ఎక్కడా అజయ్ దేవగన్ కనిపించడు. రహీమ్ మాత్రమే కనిపిస్తాడు. రహీమ్‌గానే మెప్పిస్తాడు. స్టార్ హీరో అయినప్పటికీ ఇలాంటి సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం గొప్ప విషయం. ఇందులో ఆయన పాత్రకి ఎలాంటి ఇమేజ్‌లు, హైప్‌లు, ఎలివేషన్లు ఉండవు. మొత్తం ఆయన పాత్ర సెటిల్డ్ గా సాగుతుంది. చాలా సందర్భాల్లో నిస్సాహయుడిగానే కనిపిస్తాడు. పైగా కాన్సర్ కారణంగా ఇబ్బంది పడుతూనే కనిపిస్తాడు. అవన్నీ ఎమోషనల్‌గా మెప్పించాడు. అజయ్ దేవగన్ బెస్ట్ పర్‌పెర్మెన్స్ ఇచ్చిన పాత్రల్లో ఇది మొదటి వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ప్రియమణి ఆయనకు భార్యగా బాగా సూట్ అయ్యింది. అంతేబాగా మెప్పించింది. పత్రిక అధినేతగా గజరాజ్ రావు బాగాచేశాడు. మిగిలిన పాత్రదారులంగా బాగా చేశారు. పాత్రల్లో జీవించారు.
టెక్నీకల్‌గాః
ఈ సినిమా క్రాఫ్ట్ పరంగా, టెక్నీకల్‌గా స్పోర్ట్స్ డ్రామాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు, మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా వర్క్ హైలైట్‌గా నిలుస్తాయి. ఏఆర్ రెహ్మాన్ చాలా రోజుల తర్వాత ది బెస్ట్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చాలా చోట్ల ఆయన బీజీఎం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. సౌండింగ్ మాత్రం నెక్ట్స్ లెవల్. ఇలాంటి సినిమాలకు కెమెరా వర్క్, ఎడిటింగ్ పెద్ద సవాల్‌తో కూడుకున్నదే. తుష్ కంటి రే, ఫోడాల్యాస్ కెమెరా వర్క్ జస్ట్ బ్రిలియంట్ అని చెప్పాలి. రియల్ ఆటని చూసినట్టుగానే క్యాప్చర్ చేయడం విశేషం. దేవ్ రావు జాదవ్, షానావాజ్ మూసాని ఎడిటింగ్ మరో హైలైట్. ఆయన స్పోర్ట్స్ ఎడిటర్ కావడం విశేషం. ఇక 1950-60 పీరియడ్‌ని ఆవిష్కరించడంలో ప్రొడక్షన్ డిజైనర్ పనితీరు కూడా అద్బుతమని చెప్పాలి. నిర్మాణ విలువలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు అమిత్ ఈ మూవీని ఎంచుకోవడం సాహసం, దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించడం సాహసం. ఆ సాహసం చేయడంలోనే సక్సెస్ అయ్యాడు. కానీ నిడివి తగ్గించి ఫస్టాఫ్‌లో కాస్త డ్రామా, ఎమోషనల్, ఫన్ లాంటి యాంగిల్స్ యాడ్ చేస్తే సినిమా నిజంగా ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లోనే ది బెస్ట్ మూవీగా నిలిచేది.
ఫైనల్‌గాః `మైదాన్` బెస్ట్ ఫుట్‌బాల్ బేస్డ్ మూవీ. ముందు రెండు గంటలు ఓపికగా చూస్తే, చివరి గంట ట్రీట్.
రేటింగ్‌ః 3.25
నటీనటులుః అజయ్ దేవగన్, ప్రియమణి, గజరాజ్, రుద్రానిల్ ఘోష్, మధుర్ మిట్టల్, చైతన్య శర్మ, తేజాస్ రవిశంకర్, దేవిందర్ గిల్, మనన్‌దీప్ సింగ్, విష్ణు గీ వారియర్, జయంత్ వీ, అమనదీప్ థాకూర్, రఫీల్ జోష్, అమర్త్యా రే తదితరులు.
దర్శకత్వంః అమిత్ శర్మ
కెమెరాః తుష్ కంటి రే, ఫోడాల్యాస్(స్పోర్ట్స్)
ఎడిటింగ్‌ః దేవ్ రావు జాదవ్, షానావాజ్ మూసాని(స్పోర్ట్స్)
మ్యూజిక్‌ః ఏఆర్ రెహ్మాన్
ప్రొడక్షన్‌ః జీ స్టూడియోస్, బేవ్యూ ప్రాజెక్ట్స్, ఫ్రెష్ లైమ్ ఫిల్మ్స్.