#LSC : అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా' రివ్యూ
అమీర్ ఖాన్ తెలుగు కనెక్టివిటీ కోసం మన టాలీవుడ్ హీరో నాగచైతన్య ని తీసుకున్నారు. ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చి ఆరు ఆస్కార్స్ సాధించి, ఆ సంవత్సరం అమెరికా లోనే హైయిస్ట్ గ్రాసర్ ఫిల్మ్ లలో ఒకటిగా నిలిచిన Forrest Gump కు రీమేక్. 1994లో వచ్చిన ఆ సినిమా ఇప్పుడు రీమేక్ చేయదగినదేనా...ఇప్పుడు కాలానికి తగినట్లు మార్చి చేసారా..లేక ఉన్నదున్నట్లు చేసుకుంటూ పోయారా, అసలు ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Image: Still from the trailer
కథేంటి...
‘లైఫ్ వాజ్ లైక్ ఏ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ .. యూ నెవర్ నో.. వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్’అనే విషయం చుట్టూ అల్లిన కథ ఇది..ఇదో బయోపిక్ లా అనిపిస్తుంది. ఎక్కడో ..ఎవరి జీవితంలో జరిగిన కథను తెరకెక్కించారామో అని డౌట్ వస్తుంది. లాల్ సింగ్ చద్దా(అమీర్ ఖాన్) ట్రైన్ లో అపరిచితులతో తన జీవితాన్ని చెప్తూండగా ప్రారంభం అవుతుంది. లాల్ కు పుట్టుకతో కాస్తంత తక్కువ ఐక్యూ. దానికి తోడు వెన్నెముక బలంగా లేకపోవడంతో సరిగ్గా నడవలేని పరిస్దితి, కాళ్లకు సపోర్ట్‌గా బ్రేసెస్ వాడుతూంటాడు. తన స్కూల్ లో అందరూ చిన్న చూపు చూస్తూంటే ..ఆత్మ న్యూనతా భావంతో జీవిస్తూంటాడు. అయితే మంచి వాడు.. మనస్సులో ఏమి పెట్టుకోడు.. కుళ్లు, కల్మషం అతనిలో ఉండదు. అతనికి ఎవరూ స్నేహితులు ఉండరు. అప్పుడు రూప (కరీనా కపూర్) పరిచయం కావటం..ఆమె ప్రోత్సాహంతో జీవితంలో ముందుకు వెళ్తూంటాడు. తల్లి,స్నేహితురాలు సహకారంతో జీవితంలో ఒక్కో స్టెప్ దాటడం మొదలెడతాడు. నడవేలేని ఈ కుర్రాడు ఆటల్లో రాణిస్తాడు. సైన్యంలో చేరుతాడు. అక్కడ బాలరాజు( నాగచైతన్య) పరిచయంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది ఏమిటి... లాల్ చివరకు జీవితంలో ఏ స్దాయికి వెళ్ళాడు. రూపతో అతని స్నేహం ప్రేమగా మారిందా... చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Image: Still from the trailer
ఎనాలసిస్...
ఈ చిత్రం హాలీవుడ్ చిత్రం FORREST GUMP [1994]కు ఇండియన్ ఎడాప్షన్ అనే సంగతి తెలిసిందే. అప్పట్లో ‘ఫారెస్ట్ గంప్’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఓ జనరేషన్ మొత్తం ఈ సినిమాకు ఫ్యాన్స్ అయ్యిపోయారు. రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో వచ్చిన ఫారెస్ట్ గంప్ చరిత్రలో నిలిచిపోయే సినిమాగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. అలాంటి సినిమాని రీమేక్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఉన్నది ఉన్నట్లు తీస్తే మక్కికి మక్కీ కాపీ అంటారు. మార్పులు ఎక్కువ చేస్తే ...ఇష్టం వచ్చినట్లు తీసేసి చెత్త చేసేసారు అంటారు. ఎందుకంటే ఆ సినిమాని అందులోని గంప్ పాత్రను చాలా మంది ఆ స్దాయిలో ప్రేమించేసారు. బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి (తెలుగులోనూ చేసారు) దాదాపు పదేళ్ళు ఫారెస్ట్ గంప్ ని మన దేశ పరిస్థితులకు అడాప్ట్ చేస్తూ వచ్చారు. 2018 వరకూ మన దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలని ఈ కథకి జోడిస్తూ మార్పులు చేస్తూనే వచ్చారు. ఈ సినిమా ఒక మనిషి జీవితం. అమెరికన్ దేశ చరిత్ర లాంటిది. దర్శకుడు రాబర్ట్ జెమెకిస్ ఫారెస్ట్ గంప్ పాత్ర ద్వారా అమెరికా చరిత్రని, ప్రధాన ఘట్టాలని అద్భుతంగా డాక్యుమెంట్ చేశారు. ఒక వ్యక్తి జీవన ప్రయాణంలో ఒక దేశ చరిత్రని ఆవిష్కరించటం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంతలా అక్కడ వారికి నచ్చేసింది.
Image: Still from the trailer
అయితే ఇక్కడే అసలు ఛాలెంజ్ ఉంది. ఫారెస్ట్ గంప్ లోని అమెరికన్ సోల్ ని ఇండియన్ స్క్రీన్ పైకి ఇక్కడ సినిమాలా అనిపించేలా ఎలా తీసుకొస్తారనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ విషయంలో చాలా వరకూ స్క్రిప్టు పరంగా మార్కులు వేయించుకుంటారు. ఇక్కడ జరిగిన కథే అనిపించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కథలో ఉన్న చీకటి కోణాలను చాలా వరకు తగ్గించారు. కొన్ని సీన్స్ ... ఒరిజనల్ ని దాటేస్తాయి. అయితే ఇదంతా ఫస్టాఫ్ లో బాగుంటుంది. సెకండాఫ్ కు వచ్చేసరికే మన చాలా సినిమాల్లాగ సాగటం మొదలెడుతుంది.
Image: Still from the trailer
ఫస్టాఫ్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ల మధ్య జరిగే సీన్స్ తో పీరియాడికల్ హై పాయింట్స్ తో , హ్యూమర్ తో సాగిపోతుంది. సెకండాఫ్ కు వచ్చేసరికే జరిగిందే జరిగుతున్నట్లు.. ఎంతకీ తెగని సమస్యలా మారిపోతుంది. అక్కడే ఎడిటర్ తన టాలెంట్ ని చూపించాల్సింది. చిత్రం ఏమిటంటే...ఒరిజనల్ కన్నా రీమేక్ ...లెంగ్త్ ఎక్కువ. దాదాపు 22 నిముషాలు ఎగస్ట్రా ఉంది. దాంతో చాలా సీన్స్ మన సహనాన్ని సరదాగా పరీక్ష పెట్టడం మొదలెట్టి సీరియస్ గా విసిగిస్తాయి. దాన్నే ఫీల్ అంటే చేయగలిగేదేం లేదు. అయితే వాటిని ట్రిమ్ చేస్తే బాగుండేది. రొమాంటిక్ ట్రాక్ క్యూట్ గా ఉంది...కానీ గొప్పగా లేదు. మల్టిప్లెక్ట్స్ ఆడియన్స్ కి ..అదీ కాస్తంత సహనం ఎక్కువ ఉన్నవాళ్ల కోసం స్క్రీన్ ప్లే రాసినట్లు ఉంది.
టెక్నికల్ గా...
దర్శకుడు అద్వైత్ చందన్...అమీర్ ఖాన్ ని ఇండియన్ ఫారెస్ట్ గంప్ గా తీసుకురావటం మీదే దృష్టి పెట్టారు. ఒరిజనల్ ని గైడ్ గా ఫాలో అయ్యిపోయారు. అయితే ఆ ప్రాసెస్ లో వచ్చిన ల్యాగ్ ని ఆయన గమనించుకోలేదు. స్క్రిప్టు రైటర్ గా అతుల్ కులకర్ణి... ఒరిజనల్ ని మిస్సవకుండా ఇండియన్ ఫ్లేవర్ సాధ్యమైనంత అద్దారు. మన దేశ చరిత్రని, సంస్కృతిని సీన్స్ లో నింపే ప్రయత్నం చేసారు. లాల్ కథ చెప్పే ప్రాసెస్ లో వచ్చే ఫిలాసఫిని పట్టుకున్నారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రీతమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్యారక్టర్ ఎమోషన్స్ ని పట్టుకోగలిగింది.
నటీనటుల్లో ....
అమీర్ ఖాన్ ఇలాంటి పాత్రల్లో జీవించేస్తాడు. అమాయకత్వంతో కూడిన పాత్ర ఇది. ఎక్స్‌ప్రెషన్స్‌కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శారీరకంగానే కాదు మానసికంగా సవాల్ విసిరిన పాత్ర ఇది. అయితే అమీర్ ఖాన్ మరీ పర్శనల్ గా తీసుకుని చేసినట్లున్నారు. దాంతో కొన్ని సీన్స్ లో ఒరిజనవల్ ఫారెస్ట్ గంప్ పాత్ర కన్నా మిస్టర్ బీన్ లాంటి కమిడియన్ ని ఆవాహన చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రెంటికి మధ్య గీత చాలా చిన్నది. అమాయకత్వం వేరు...తింగరితనం వేరు..అతి తెలివి వేరు..బ్యాలెన్స్ తప్పితే..ఒకటి మరొకటిలాగ కనపిస్తుంది. ఇక రూపగా కరీనా కపూర్ తన పరిధి మేరకు గీత దాటకుండా చేసుకుంటూ పోయింది. నాగచైతన్య గొప్పగా చేసాడా అనే కన్నా చాలా వరకూ తన సినిమాల కన్నా బాగా చేసాడు. బాలరాజుగా దాదాపు అరగంట సేపు స్క్రీన్ పై వెలిగాడు. చైతు కొత్తగా అనిపించారు. అయితే ఈ సినిమా చైతు కెరీర్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందో కానీ సినిమాకు మాత్రం చైతు బాగానే ఉపయోగపడ్డారు. తల్లి పాత్రలో మోనా సింగ్ చక్కని అభినయంతో ఆకట్టుకుంది.
ఫైనల్ థాట్
ఫారెస్ట్ గంప్ ఇప్పటికే చూసిన వారు ...ఈ సినిమా కొత్తగా,గొప్పగా అనిపించదు. మిగతావాళ్లు కాస్తంత ఎక్కువ ఓపిక ఉండి... స్లో నేరేషన్ భరిస్తే సినిమా నచ్చుతుంది.
Rating: 2.5
బ్యానర్లు : వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
నటీనటులు: ఆమిర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య తదితరులు
సమర్పణ :మెగాస్టార్ చిరంజీవి
సంగీతం: ప్రీతిమ్
ఛాయాగ్రహణం: సేతు
ఎడిటింగ్ : మాణిక్ దవార్
భారతీయ చిత్రానుకరణ: అతుల్ కుల్ కర్ణి
దర్శకత్వం :అద్వైత్ చందన్
నిర్మాతలు: ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
Runtime:2h 39m
విడుదల తేదీ: 11/08/2022