ఉరుములు, మెరుపుల ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?
అప్పుడే వర్షాలు మొదలయ్యాయి. వర్షాలు పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు చాలా కామన్. కానీ ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలంటే ఉరుములు, మెరుపుల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే?
రాబోయేది వర్షాకాలం. వర్షాకాలం మొదలుకాకముందే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక వర్షాకాలంలో వర్షాలు ఎడితెరిపి లేకుండా కురుస్తాయి. వర్షాలు పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులు రావడం చాలా కామన్. చాలా చోట్ల పిడుగులు కూడా పడుతుంటాయి. అయితే ఉరుముల, మెరుపుల సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉరుముల మెరుపుల సమయంలో ఆరుబయట అస్సలు ఉండకూడదు. వెంటనే ఇంట్లోకి వెళ్లాలి. పిల్లల్ని కూడా ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదు.
ఉరుములు, మెరుపుల సమయంలో పిల్లలు ఉంటే ఆటలు లేదా ఇతర కారణాల వల్ల వారిని బయటకు వెళ్లనివ్వకండి. అలాగే మేకలు, ఆవులు వంటి పశువులను పెంచుకునే వారు ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు నుంచి రక్షించడానికి వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి.
మీరు ఉరుములు విన్నప్పుడు టీవీని వెంటనే ఆఫ్ చేయండి. ఇంట్లో మెయిన్ ఆఫ్ చేయండి. మొబైల్ వంటి ఎలక్ట్రికల్ పరికరాలను ఛార్జింగ్ పెట్టడం కూడా చేయకండి. ఉరుములు, మెరుపుల సమయంలో లోహం పైకప్పు కింద ఉండకూడదు. పిడుగు నేరుగా చెట్లను తాకి మంటలకు కారణమవుతుంది. అందుకే చెట్టు కింద నిలబడటం, కూర్చోవడం లాంటివి చేయకండి.
బైక్ పై వెళ్తున్నప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడితే సమీపంలోని సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. ఉరుములు ఆగిపోయిన తర్వాత బయలుదేరండి. అలాగే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నప్పుడు, బోటింగ్ చేస్తున్నప్పుడు ఉరుములతో కూడిన వానలు పడుతున్నట్టైతే వెంటనే ఒడ్డుకు వెళ్లండి. పిడుగులు జలాశయాన్ని తాకితే పెను విపత్తు సంబవిస్తుంది.
ఉరుములతో పాటు భారీ వర్షాలు కురిస్తున్నట్టైతే లోతట్టు ప్రాంతాల్లో అస్సలు ఉండకూడదు. మీరు వెంటనే దగ్గర్లోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లండి. కంటిన్యూగా ఉరుముల చప్పుడు వినిపిస్తున్నట్టైతే స్నానం చేయడం మానుకోండి. ముఖ్యంగా షవర్ స్నానం అస్సలు చేయకండి. వంటగది వంటి మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కూడా ఉరుములు, మెరుపుల సమయాల్లో ఉండకూడదు.