ఆరోగ్యానికి మంచివని అత్తిపండ్లను ఎక్కువగా తింటే ఈ రోగాలొస్తయ్ జాగ్రత్త..
అత్తిపండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయినప్పటికీ.. ఈ పండ్లను ఎక్కువగా తింటే లేని పోని రోగాలొచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంజీర పండ్లలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ పండ్లను చలికాలంలో తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగని వీటిని అతిగా తింటే మాత్రం కడుపునకు సంబంధించిన సమస్యలతో పాటుగా ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. అవేంటంటే..
అత్తిపండ్లలో ఉండే పోషకాలు
అత్తిపండ్లలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు దూరం అవుతాయి.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి
అత్తిపండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అత్తిపండ్లను ఎక్కువగా తినడం వల్ల రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉండే అత్తి పండ్లను మొత్తమే తినకూడదు.
కడుపులో నొప్పి
నిజానికి అత్తి పండ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అత్తిపండ్ల వల్ల కడుపులో బరువు పెరుగుతుంది. అత్తిపండ్లను ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. అంతేకాదు ఈ పండ్లు కాలెయం, ప్రేగులను దెబ్బతీస్తాయి. అత్తిపండ్లను ఎక్కువగా తినడం వల్ల పేగుల పనితీరు తగ్గుతుంది.
మైగ్రేన్
అంజీర పండ్లలో సల్ఫైట్ కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో ఎక్కువైతే మైగ్రేన్ నొప్పి వస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ నొప్పి ఉన్నప్పుడు అత్తి పండ్లను మొత్తమే తినకూడదు. తలనొప్పి ఉన్నప్పుడు ఈ పండ్లను తింటే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
బలహీనమైన దంతాలు
అంజీరల్లో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను మోతాదుకు మించి తింటే దంతాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల దంతాలు బలహీనపడతాయి. దంతాలు పుచ్చిపోయే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.