భోగి పండుగ నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
Sankranti 2024: భోగి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ పండుగ నాడు చేయాల్సిన, చేయకూడని పనులు చాలానే ఉన్నాయి. అవేంటంటే?
ప్రతి సంవత్సరం భోగి పండుగను ఎంతో జరుపుకుంటారు. అయితే భోగి నాడు కొన్ని ఆచారాలను ఖచ్చితంగా పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రామాల్లో చాలా మంది తమ సంప్రదాయ ఆచారాల ప్రకారం భోగి పండుగను జరుపుకుంటుంటే, నగరాల్లో మాత్రం చాలా మంది ఈ పండుగకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అసలు ఈ భోగి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం?ఈ భోగి పండుగ సమయంలో చేయాల్సినవి, చేయకూడని విషయాల గురించి ఇప్పడు తెలుసుకుందాం పదండి.
చేయాల్సిన పనులు
మన పూర్వీకులు 'భోగి' రోజున ఇంటి దేవతలను పూజించేవారు. అందుకే ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజున మీ కులదేవత ఆలయానికి వెళ్లి పూజలు చేయడం మర్చిపోకండి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.
మీకు తెలుసా? మన పూర్వీకులు భోగి పండుగను వైద్య విధానంగా ఉపయోగించేవారు. ఈ సమయంలోనే పంటలు చేతికొస్తాయి. ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చే సమయం ఇదే. ఆ సమయంలో గింజలు.. తెగుళ్లు, క్రిముల బారిన పడకుండా ఉండటానికి ఇంట్లో పసుపు నీటిని చల్లడం, పేడతో అలకడం, ధూపం వేయడం వంటి పనులను చేస్తారు. ఇవి ఇంట్లోకి క్రిములు రాకుండా చేస్తాయి.
చేయకూడని పనులు
భోగి పండుగ రోజున ఆడవారు, మగవారు మాంసాన్ని అస్సలు తినకూడదు. అదేవిధంగా పురుషులు మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. భోగి పండుగ నాడు ఇంట్లోని మహిళలు, పురుషులు సెలవు కావడంతో... ఇంట్లో పని పూర్తైన తర్వాత రెస్ట్ తీసుకుని నిద్రపోవచ్చని అనుకుంటారు. కానీ ఈ తప్పు మీరు పొరపాటున కూడా చేయకండి. భోగి రోజున నిద్రిస్తే ఇంటి దైవానికి కోపం వస్తుందని చెబుతారు.
పరిశుభ్రతను పాటించడానికి భోగి మంటల్లో కేవలం కట్టెలను మాత్రమే వేయాలి. దీంతో గాలి కాలుష్యం అయ్యే అవకాశం ఉండదు. కానీ టైర్లు, రబ్బరు, ప్లాస్టిక్ లు, ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేసే పదార్థాలను కాల్చడం మానుకోండి. ఎందుకంటే ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.