మీరు ఇలా ఉంటే ఫోన్ కి బానిసలైనట్టేనట..
ప్రస్తుతం మొబైల్ ఫోన్ అత్యవసర వస్తువుల జాబితాలో చేరిపోయింది. ఇది లేకుండా పూట గడవని కాలం దాపురించిందంటే నమ్మండి. దీన్ని చేతిలో పట్టుకోకుండా క్షణ కాలంపాటు ఉండలేకపోతున్నారంటే.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందో మీరే అర్థం చేసుకోవచ్చు.

నేటి ఆధునిక కాలంలో మనుషులకు, ఎలక్ట్రానికి గాడ్జెట్స్ అయినా స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్ వంటి వాటికి విడదీయరాని బంధం ఏర్పడిందనే చెప్పొచ్చు. ఈ ఫోన్లను విపరీతంగా ఉపయోగించే అలవాటు కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచే పెరిగింది. తిండి తిప్పలు లేకుండానైనా ఉంటున్నారేమోగాని స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండటం లేదు.
నిజానికి స్మార్ట్ ఫోన్ వాడకం చెడ్డ అలవాటేమీ కాదు. కానీ మితిమీరి దీన్ని వాడితేనే ఎన్నో తిప్పలు పడాల్సి ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు తెలుసుకోవడానికి, ఇతరులతో అనుబంధాల్ని పెంచుకోవడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫోన్లకు అడిక్ట్ అవడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
వన్స్ ఫోన్లకు అడిక్ట్ అయ్యారో మీ లైఫ్ మీ చేతుల్లో అస్సలు ఉండదు. తరచుగా ఫోన్లు చూస్తూ ఫోతే కళ్లు దెబ్బతినడం, మెడనరాలు దెబ్బతినడం, మానసికంగా వీక్ అయిపోవడం, బంధాలు బంధుత్వాలు పూర్తిగా కనుమరుగవడం వంటివి ఎన్నో జరుగుతాయి. ఇంతేకాదు 24 గంటలు స్మార్ట్ ఫోన్ తోనే గడిపితే మీరు పిచ్చోళ్లు అయిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఆన్లైన్ లో గేమ్స్ ఆడి ఆడి పిచ్చోళ్లు అయిన వారు మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉంటాం.
ఇక స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయిన వారు తరచుగా ఫోన్ ను చెక్ చేస్తూనే ఉంటారు. వాట్యాప్ లో ఏదైనా మెసేజ్ వచ్చిందా.. కొత్త నోటిఫికేషన్స్, అప్ డేట్స్ ఏవైనా వచ్చాయా అంటూ ఒక్కటే స్క్రోల్ చేస్తూనే ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక వ్యాధి అంటున్నారు నిపుణులు. అందుకే దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది.
మరేం చేయాలి.. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే ముందు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని సోషల్ మీడియాను చూడటం తగ్గించాలి. ముఖ్యంగా ఉదయం, పడుకునే సమయంలో ఫోన్లను అస్సలు వాడకూడదు.
ఆరోగ్యం కూడా ముఖ్యమే.. స్మార్ట్ ఫోన్లను చూడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యాయామాలు, యోగాసనాలు చేయాలి. అలాగే హెల్తీ ఫుడ్ ను తీసుకోవాలి. ఇలా చేస్తే శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
స్మార్ట్ ఫోన్ చూడాలనిపించినప్పుడల్లా బుక్ చదవడమో, రాయడమో లేకపోతే ఏదైనా పనిచేయండి. అప్పుడే మీ మనసు ఫోన్ మీదికి వెళ్లదు. ఇలాంటి పనుల వల్ల మీ మనస్సు హాయిగా ఫీలవుతుంది.
ఇకపోతే ఫోన్ చూడటానికి సమయాన్ని కేటాయించండి. అంటే ఈ సమయంలోనే ఫోన్ చూడాలి అన్న విధంగా. ఆ సమయాల్లో మాత్రమే ఫోన్ చూడండి. ఎక్కువ సమయంలో కుటుంబంతో గడిపేందుకు ప్లాన్ చేసుకోండి.
ఎక్కువగా మీరు ఏయే యాప్ లను చూస్తున్నారో వాటిని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్ లను. ఈ యాప్ ల వల్లే మీరు ఫోన్లకు బానిసలుగా మారొచ్చు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పడుకునే ముందు ఫోన్లను అస్సలు చూడకండి. ఎందుకంటే బ్లూ లైట్ ఎఫెక్ట్ తో నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో మీరు రాత్రుళ్లు నిద్ర పోలేరు.
చిన్నపిల్లలను స్మార్ట్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూసే పిల్లలు గుడ్డివాళ్లు అయ్యే ప్రమాదం ఉంది.