- Home
- Life
- Palakura Pachadi: స్పైసీగా పాలకూర పచ్చడి ఇలా చేశారంటే.. ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు
Palakura Pachadi: స్పైసీగా పాలకూర పచ్చడి ఇలా చేశారంటే.. ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేస్తారు
పాలకూర అనగానే పప్పులో వేయడమో లేక కూర వండుకొని తినడమో చేస్తారు. కానీ ఒకసారి పాలకూర పచ్చడి (Palakura Pachadi) ప్రయత్నించి చూడండి. దీని రెసిపీ చాలా సులువు. పైగా చాలా రుచిగా ఉంటుంది.

పాలకూర పచ్చడి
పాలకూర పోషకాల గని. ప్రతిరోజూ తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. పాలకూరలో ఉండే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి అత్యవసరమైనవి. అయితే పాలకూరను ఎలా వండాలో చాలామందికి తెలియదు. పప్పులో దీన్ని కలిపి వండేస్తారు లేదా నూనెలో వేయించి వేపుడులా చేస్తారు. ఈ రెండు పద్ధతుల్లోనే కాదు పాలకూరను పచ్చడి రూపంలో కూడా తినవచ్చు. స్పైసీగా చేసుకుంటే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది.
పాలకూర పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర తరుగు రెండు కప్పులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె మూడు స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, మెంతులు నాలుగు గింజలు, పసుపు చిటికెడు, జీలకర్ర పావు స్పూను, ఆవాలు పావు స్పూను, మినప్పప్పు ఒక స్పూన్, ధనియాలు ఒక స్పూన్, చింతపండు ఉసిరికాయ సైజులో తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి.
పాలకూర పచ్చడి రెసిపీ
పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి. ఆ నూనెలో ధనియాలను, మెంతులను, ఎండుమిర్చిని, మినప్పప్పును వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలకూరను వేసి వేయించాలి. అందులోనే పసుపు, చింతపండు కూడా వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పాలకూర మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. పాలకూర రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీలో మొదటగా వేయించుకున్న ధనియాలు, మినప్పప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూరను కూడా అందులో వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తాళింపు పెట్టుకోవాలి. తాళింపు కోసం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి దాన్ని పాలకూర పచ్చడి పై వేసుకోవాలి. అంతే టేస్టీ పచ్చడి రెడీ అయిపోయినట్టే.
వేడి వేడి అన్నంలో తింటే
ఈ పాలకూర పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి. అద్భుతంగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. స్పైసీగా చేసుకుంటే అదిరిపోతుంది. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి వేశారంటే ఇంకా రుచిగా ఉంటుంది. ఈ పాలకూర పచ్చడిని ఇడ్లీతో, దోశతో తిన్నా కూడా టేస్టీ గానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం పోషకాల పాలకూర పచ్చడిని ప్రయత్నించి చూడండి.