ఉదయం తొందరగా నిద్రలేవాలంటే ఏం చేయాలో తెలుసా?
ఒక్క పెద్దవారికి తప్ప ఎవ్వరికీ ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉండదు. ఇకపోతే చాలా మంది బలవంతంగా నిద్రలేవాల్సి వస్తుంది. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ఎవ్వరూ లేపాల్సిన అసవరం లేకుండా మీరే తొందరగా నిద్రలేస్తారు.
ఊర్ల సంగతి పక్కన పెడితే సిటీల్లో అయితే లేట్ గా పడుకోవడం, పొద్దున్న లేట్ లేవగా ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ ఒకప్పుడు అయితే పనులు ఉన్నా లేకున్నా.. రాత్రిపూట తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్రలేచేవారు. ఇప్పుడు ఎన్ని పనులున్నా తెల్లవార్లూ ఫోన్లు చూస్తూ ఎప్పుడో 1,2 గంటలకు పడుకుని ఉదయం లేట్ గా లేస్తున్నారు. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. మీ శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఉదయం తొందరగా నిద్రలేవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఉదయాన్నే నిద్రలేవడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టైం కు నిద్రపోవడం
మీరు పొద్దున్నే నిద్రలేవాలంటే మాత్రం ఖచ్చితంగా రాత్రి సమయానికి నిద్రపోవాలి. అందుకే రాత్రిపూట ఎప్పుడు పడుకోవాలో అనేది ఒక టైం ను సెట్ చేయండి. ఆ సమయానికి మీరు పడుకున్నారంటే ఉదయం నిద్రలేవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు
మార్పులు
మీ ఉదయపు దినచర్య సరిగ్గా లేకుంటే.. వెంటనే మీరు తొందరగా నిద్రలేచే విషయంలో పెద్ద తేడాను చేయకండి. దీనికి బదులుగా మీ సమయాన్ని క్రమ క్రమంగా రోజూ మార్చండి. దీంతో మీరు కంటినిండా నిద్రపోగలుగుతారు. ఉదయం తొందరగా నిద్రలేస్తారు.
వీటికి దూరం
రాత్రిపూట అనవసర పనులను చేయకండి. ఎందుకంటే వీటికి సమయం, శక్తి రెండూ ఖర్చు అవుతాయి. దీనివల్ల మీరు మరింత అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.దీంతో మీకు విపరీతంగా నిద్రవస్తుంది. దీనివల్ల మీరు ఉదయాన్నే నిద్రలేవలేరు. అందుకే రాత్రిపూట అనవసరమైన పనులను చేయకండి.
తగినంత నిద్ర
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కంటినిండా నిద్రపోవాలి. మీరు రోజుకు 7 నుంచి 8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. మీకు గనుక నిద్రలేమి సమస్య ఉంటే అలసటగా అనిపిస్తుంది. దీనివల్ల మీరు ఉదయాన్నే నిద్రలేవడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.
స్క్రీన్
పడుకోవడానికి ముందు ఎట్టి పరిస్థితిలో మీరు ఫోన్లు, ల్యాప్టాప్లు లేదా టీవీ మొదలైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను చూడకండి. ఎందుకంటే ఇవి మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. ఇవి మనకు నిద్రపట్టకుండా చేస్తాయి. కాబట్టి మీరు నిద్రపోవడానికి గంట ముందు వీటిని దూరం పెట్టండి. బదులుగా పుస్తకాలను చదవండి. లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటు చేసుకోండి.
దినచర్య
మీరు మరుసటి రోజు ఏం చేయాలి అనే దాన్ని నిద్రపోవడానికి ముందు ఒక సారి గుర్తుచేసుకోండి. ఇలా చేస్తే అలారం లేకుండా మీ కళ్లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. వెంటనే నిద్రలేస్తారు.
పగటిపూట నిద్రపోకూడదు
చాలా మందికి పగటిపూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల వీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు. అంటే చాలా లేట్ గా నిద్రపోతారు. దీంతో ఉదయాన్నే తొందరగా నిద్రలేవలేరు. మీరు ఉదయం తొందరగా నిద్రలేవాలంటే మాత్రం పగటిపూట మాత్రం పడుకోకూడదు.